మోడీ హయాంలో 10 కోట్ల టాయిలెట్లు నిర్మించాం : రవిశంకర్ ప్రసాద్

 హైదరాబాద్ : మాదాపూర్ హోటల్ ట్రీడెంట్ లో ఐటీ అధిపతులు, న్యాయ నిపుణులతో కేంద్ర న్యాయ, ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ సమావేశం అయ్యారు. సమావేశంలో ఎంపీ దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఐటీ అధిపతులు పాల్గొన్నారు.

భారత్ కే మన్ కీ బాత్.. మోడీ కే సాథ్ పేరిట బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. “నూతన భారతదేశం అభివృద్ధి కోసం పౌరుల నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఏడువేల సూచనల బాక్సులు ఏర్పాటు చేశాం. www.modimankebaath  web, SMS, slips, email’s ద్వారా ఈ సలహాలు తీసుకుంటున్నాం. భారత్ ఆర్థిక రంగంలో ప్రపంచంలో ఆరోస్థానంలో నిలిచింది. మన్మోహన్ హయాంలో 11 స్థానంలో ఉండేది. 40 కోట్ల మందికి పించన్, రైతులకు ఆరు వేల సాయం…. వంటి పథకాలను అందిస్తున్నాం. స్వాతంత్ర్యం నుండి 2014 వరకు 6.2 కోట్ల గ్రామీణ ప్రాంత టాయిలెట్స్ నిర్మిస్తే మోడీ హయాంలో 10 కోట్ల టాయిలెట్స్ నిర్మించాం. దేశ రక్షణ, నల్లధనం విషయంలో మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా బ్యాంకుల ద్వారా రుణాల పేరిట దోచిపెట్టారు. మా ప్రభుత్వం బకాయిలను రాబట్టే పనిలో పడింది. మహాకూటమిలో గతంలో ఎంతోమంది యేడాదికి మించి దేశాన్ని పాలించలేకపోయారు. అయినా మోడీ హఠావో పేరిట అస్థిర ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని కూటమి లోని పార్టీలు తహతహలాడుతున్నాయి. ఎన్డీయే మూడు వందలకు మించి సీట్లు సాధించి మరోసారి సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. రాఫెల్ విషయంలో రాహుల్ మోడీ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నాడు. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత శక్తివంతమైనవి. యూపీఏ హయాంలో కన్నా 9 శాతం తక్కువ ధరకు విమానాలు, 20 శాతం తక్కువ ధరకు ఆయుధాలను మా ప్రభుత్వం కొనుగోలు చేసింది. హైవేస్, గ్రామీణ రోడ్లను రెట్టింపుగా అభివృద్ధి చేశాం. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 50 కోట్ల మందికి 5 లక్షల వైద్య బీమా అందిస్తున్నాం” అని అన్నారు రవిశంకర్ ప్రసాద్.

Latest Updates