యోస్ బ్యాంక్ డిపాజిటర్లకు రూ.10 వేల కోట్లు

న్యూఢిల్లీయెస్ బ్యాంక్‌‌ను వీలైనంత త్వరగా కష్టాల నుంచి బయటపడేయడానికి ఆర్‌‌బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే దీనికి ఆర్థికసాయం అందించేందుకు, డిపాజిటర్లను ఆదుకునేందుకు స్పెషల్ లిక్విడిటీ విండోను అందజేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిపాజిటర్ల విత్‌‌డ్రాయల్స్‌‌ను అనుమతించేందుకు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు షార్ట్ టర్మ్ లోన్‌‌ను లేదా లైన్ ఆఫ్ క్రెడిట్‌‌ను ఆర్‌‌‌‌బీఐ ఇవ్వాలనుకుంటున్నట్టు పేర్కొన్నాయి. ఇది ప్రత్యేక కేసు కాబట్టి వడ్డీ తక్కువుంటుందని తెలిపాయి. ఆర్‌‌‌‌బీఐ యాక్ట్ సెక్షన్ 17 కింద, ఈ లిక్విడిటీని అత్యంత అరుదైన సందర్భాల్లో ఇస్తారు. యెస్‌‌ బ్యాంక్‌‌లో తొలుత రూ.2,450 కోట్ల ఇన్వెస్ట్‌‌మెంట్ పెట్టి 49 శాతం వాటాను దక్కించుకునేందుకు ఎస్‌‌బీఐ సిద్ధంగా ఉందని స్టేట్ బ్యాంక్ చీఫ్ రజ్‌‌నీశ్‌‌ కుమార్ చెప్పారు. ఆర్‌‌‌‌బీఐ నుంచి యెస్ బ్యాంక్ రివైవల్ ప్లాన్‌‌ అందుకున్న తర్వాత శనివారం కుమార్ మీడియాతో సమావేశమయ్యారు. ఆర్‌‌‌‌బీఐ డ్రాఫ్ట్ స్కీమ్‌‌ను బ్యాంక్ తమ అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ స్కీమ్‌‌ కింద తొలుత యెస్ బ్యాంక్‌‌లో రూ.2,450 కోట్లను ఇన్వెస్ట్ చేయాలన్నారు. ఈ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ను మాక్సిమమ్ రూ.10 వేల కోట్లకు పెంచాలనే కమిట్‌‌మెంట్‌‌తో తాము ఉన్నట్టు రజనీష్ చెప్పారు. యెస్  బ్యాంక్‌‌ కుప్పకూలకుండా ఉండేందుకు గురువారం రాత్రికి రాత్రే ఆ బ్యాంక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలతో డిపాజిటర్లు ఆందోళన చెందారు. వారి డబ్బుకు ఏమీ కాదని, ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్లు ప్రమాదంలో పడవని ఎస్‌‌బీఐ చీఫ్ భరోసా ఇచ్చారు.

చాలా మంది రెడీ అవుతున్నారు..

యెస్‌‌ బ్యాంక్‌‌ను రక్షించడానికి ఆర్‌‌‌‌బీఐ డ్రాఫ్ట్‌‌ స్కీమ్‌‌ను తీసుకొచ్చిన తర్వాత, చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని, వాళ్లలో కొందరు చాలా మంచి పేరున్న వారని కుమార్ చెప్పారు.  ఆసక్తిగల ఇన్వెస్టర్లతో తమ ఇన్వెస్ట్‌‌మెంట్ టీమ్‌‌ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు.  యెస్ బ్యాంక్‌‌ను పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు ఆర్‌‌‌‌బీఐ 30 రోజుల టైమ్ ఇచ్చిందని, ఆ డెడ్‌‌లైన్ కంటే ముందే తాము తమ ప్లాన్‌‌ను ఆమోదించి, అమలు చేస్తామని కుమార్‌‌ తెలిపారు. వాటా కొనుగోలు వల్ల ఎస్‌‌బీఐ క్యాపిటల్ అడిక్వసీ రేషియోపై ఎలాంటి ప్రభావమూ ఉండదని స్పష్టం చేశారు. తమ షేర్‌‌‌‌హోల్డర్స్ భయపడాల్సినవసరం లేదన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండింగ్  లేకుండానే  వాటా కొంటామన్నారు.  ఎస్‌‌బీఐ మరో బ్యాంక్‌‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.

అకౌంట్లపై బ్రోకర్ల ఆంక్షలు

యెస్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా జరిపే ట్రేడింగ్‌‌పై బ్రోకర్లు, మ్యూచువల్‌‌ ఫండ్‌‌ కంపెనీలు ఆంక్షలు విధిస్తున్నాయి.    ప్రైమరీ అకౌంట్ యెస్‌‌ బ్యాంక్‌‌ ఉంటే దానిని వేరేదానికి మార్చుకోవాలని క్లయింట్స్‌‌ను బ్రోకర్లు ఆదేశిస్తున్నారు.  క్లయింట్ తమ రిడెంప్షన్ బ్యాంక్ అకౌంట్‌‌ను యెస్ బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌‌కు మార్చాలనుకుంటే, Mutual@kotak.comకు రిక్వెస్ట్‌‌ను పెట్టుకోవాలని కొటక్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. దగ్గర్లోని తమ బ్రాంచ్‌‌లకు వెళ్లి, యెస్ బ్యాంక్ అకౌంట్‌‌కు బదులు వేరే బ్యాంక్‌‌ అకౌంట్‌‌ను ఎంపిక చేసుకోవాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సూచించింది.

ఫోన్‌‌పే పనిచేస్తోంది..

యెస్ బ్యాంక్‌‌పై ఆంక్షలు విధించడంతో, దాని భాగస్వామ్యంలో లావాదేవీలు జరుపుతున్న ఫోన్‌‌పే  సేవలు ఆగిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు  ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఫోన్‌‌పే టీమంతా కలిసి పనిచేసి యాప్​ను పూర్వ స్థితికి తీసుకొచ్చింది.

నిలిచిపోయిన నెట్‌‌బ్యాంకింగ్‌‌ సేవలు

యెస్ బ్యాంక్‌‌ నెట్‌‌బ్యాంకింగ్, క్రెడిట్​కార్డుల సేవలు నిలిచిపోయాయి. ఆర్‌‌‌‌బీఐ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు యెస్ బ్యాంక్ చెక్కులను తీసుకోమని కొందరు చెబుతున్నారు.   ఏటీఎంలలో డబ్బు రాకపోవడంతో చాలా మంది ఇబ్బందిపడ్డారు.

కపూర్‌‌ను ప్రశ్నించిన ఈడీ

యెస్‌‌బ్యాంక్‌‌ ఫౌండర్‌‌ రాణా కపూర్‌‌‌‌ ఇంటిపై ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. శుక్రవారం ముంబైలోని వర్లి ఏరియా సముద్ర మహల్‌‌ కాంప్లెక్స్‌‌లోని రాణా కపూర్ ఇంటిపై ఈడీ ఈ దాడులు నిర్వహించింది. బ్యాంక్ ఎలా కుప్పకూలిందనే విషయంపై ఆయనను ప్రశ్నించాలని ఆర్‌‌‌‌బీఐని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.  ‌‌శనివారం మధ్యాహ్నం కూడా రాణా కపూర్‌‌‌‌ను బల్లార్డ్ ఎస్టేట్ ఏరియాలోని ఈడీ ఏజెన్సీ ఆఫీసుకు తీసుకొచ్చారు. రాణా కపూర్‌‌‌‌ను, ఆయన భార్య బింధును ఈడీ ప్రశ్నించారు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొ లిమిటెడ్(డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్) ప్రమోటర్ కపిల్ వాధ్వాన్, ఆయన బ్రదర్ ధీరజ్ వాధ్వాన్‌‌లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు గురించి కూడా వారిని ప్రశ్నించింది.  డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌కు యెస్‌‌ బ్యాంక్‌‌ భారీగా అప్పులిచ్చింది.  డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌లో రుణాలు దారిమళ్లినట్టు ఆరోపణలున్నాయి. కపూర్‌‌‌‌ కుటుంబ సభ్యులకు లింక్ అయి ఉన్న అకౌంట్లకు వందల కోట్ల రూపాయలు ట్రాన్స్‌‌ఫర్ అయినట్టు ఈడీ విచారణలో తేలింది. క్విడ్ ప్రో కో విధానంలో ఈ లావాదేవీలు జరిగినట్టు వెల్లడైంది. ఈ సందర్భంగా ఈడీ పలు కీలక ఆధారాలను సేకరించినట్టు తెలిసింది.

Latest Updates