మరింత తక్కువ వడ్డీకే హౌజింగ్​ లోన్లు

మార్కెట్​అంచనాలకు అందకుండా కీలక వడ్డీ రేట్లను 35 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తూ ఆర్‌‌‌‌బీఐ నిర్ణయం తీసుకుంది. నెమ్మదించిన ఆర్థిక వృద్ధికి ఊపందుకునేలా చేయడమే లక్ష్యంగా వడ్డీరేట్లకు కోత పెట్టింది. దీంతో రెపో రేటు 2010 ఏప్రిల్ నాటి కనిష్ట స్థాయి 5.40 శాతానికి దిగొచ్చింది. రివర్స్ రెపో రేటు 5.15 శాతానికి చేరింది. జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సోమవారం నుంచి బుధవారం వరకు సమావేశమైంది. మరోవైపు నెఫ్ట్ ద్వారా ఫండ్​ ట్రాన్స్​ఫర్స్​ను 24 గంటలూ అనుమతించాలని, డిసెంబర్​ నుంచి దీనిని అమలు చేయాలని ఆర్‌‌‌‌బీఐ నిర్ణయించింది.

కుంటుపడుతోన్న ఎకానమీకి.. ఊతమివ్వడమే లక్ష్యంగా ఆర్‌‌బీఐ  చొరవ తీసుకుంటోంది.ఈ దిశలోనే వరుసగా వడ్డీరేట్లు తగ్గిస్తూ.. ఆర్థిక వ్యవస్థకు సాయం చేస్తోంది. ఇప్పటికే మూడు సార్లు కీలక రేట్లను తగ్గించిన ఆర్‌‌బీఐ, బుధవారం ఏకంగా 35 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఎకానమీ పుంజుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆర్‌‌బీఐ దీంతో తేల్చిచెప్పినట్టైంది. తగ్గించిన వడ్డీ రేట్లు వీలైనంత త్వరగా కన్స్యూమర్లకు చేరాలని కూడా ఆర్‌‌బీఐ బ్యాంక్‌లను ఆదేశించింది. దీంతో ఇక నుంచి మనం తీసుకునే ఇంటి, ఆటో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి. ప్రధానంగా వినియోగం పెరిగేలా ఆర్‌‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపులో దూకుడు పెంచింది.

వరుసగా నాలుగోసారి… అంచనాలకు మించి… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) కీలక వడ్డీరేట్లను 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తున్న తరుణంలో, దాన్ని ఊపందుకునేలా చేయడానికి వడ్డీరేట్లకు కోత పెట్టింది ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ. దీంతో రెపో రేటు 2010 ఏప్రిల్ నాటి కనిష్ట స్థాయి 5.40 శాతానికి దిగొచ్చింది. రివర్స్ రెపో రేటు 5.15 శాతానికి చేరింది. రెపో రేటు అంటే.. బ్యాంక్‌‌‌‌లకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అప్పు ఇచ్చినందుకు విధించే వడ్డీ రేటు. ఆరుగురు సభ్యులున్న మానిటరీ పాలసీ కమిటీలో(ఎంపీసీలో) నలుగురు 35 బేసిస్ పాయింట్ల రేటు కోతకు అంగీకరించారు. రవీంద్ర హెచ్ ధోలకియా, మైఖెల్ దేబబ్రత పాత్ర, బిభు ప్రసాద్ కనుంగో, శక్తికాంత్ దాస్‌‌‌‌లు 35 బేసిస్ పాయింట్ల తగ్గింపుకు ఓకే చెప్పారు. ఈ తగ్గింపు అందరూ అంచనా వేసిన దాని కంటే(25 బేసిస్ పాయింట్ల కంటే)  10 బేసిస్‌‌‌‌ పాయింట్లు ఎక్కువగానే ఉంది. మిగతా ఇద్దరు  ఎంపీసీ సభ్యులు అంటే చేతన్ ఘతే, పమి దువాలు 25 బేసిస్ పాయింట్ల కోతకు అనుగుణంగా ఓటు వేశారు.

కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సోమవారం నుంచి బుధవారం వరకు సమావేశమైన సంగతి తెలిసిందే. తదుపరి ఎంపీసీ మీటింగ్ 2019 అక్టోబర్ 1,3,4 తేదీల్లో జరుగనుందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ ఎకానమీ గ్రోత్ అంచనాలను కూడా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ 7 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది. డిమాండ్, పెట్టుబడులు తగ్గడంతో ఇండియన్ ఎకానమీ వృద్ధి కూడా తగ్గే అవకాశముందని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పేర్కొంది. వరుసగా రేటు కోత చేపట్టడంతో ఈ ఏడాది రెపో రేటు 1.1 శాతం తగ్గింది. వరుసగా నాలుగు సార్లు రేటు కోత చేపట్టడం 2012 ఏప్రిల్ నుంచి 2013 మే మధ్య కాలంలోనే జరిగింది.

అప్పుడు రెపో రేటు 1.25 శాతం వరకు తగ్గింది. దీంతో ఆ సమయంలో రెపో రేటు 8.50 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గిపోయింది. అప్పట్లో మానిటరీ పాలసీ కమిటీ లేకపోవడంతో, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మాత్రమే వడ్డీరేట్లపై నిర్ణయాలు తీసుకునేది. 25 బేసిస్ పాయింట్ రేటు కోత సరిపోదని ఎంపీసీ భావించిందని, 50 బేసిస్ పాయింట్ తగ్గింపు చాలా ఎక్కువవుతుందని.. 35 బేసిస్ పాయింట్ల తగ్గింపు అయితే బ్యాలెన్స్‌‌‌‌డ్‌‌‌‌గా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. 2006 నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీరేట్లను కేవలం 25 లేదా 50 బేసిస్ పాయింట్లలోనే మారుస్తోందని పేర్కొన్నారు.  డిమాండ్, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు తగ్గడం ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారాయని దాస్ అన్నారు.

నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని దాస్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని రంగాలకు తగినంత లిక్విడిటీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ నుంచి ఆర్థిక వృద్ధి మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగా కొనసాగుతున్నాయని, గ్లోబల్‌‌‌‌గా వృద్ధి సన్నగిల్లిందని, ట్రేడ్ వార్ టెన్షన్లతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఎంపీసీ కూడా పేర్కొంది.  వడ్డీ రేట్ల తగ్గింపు వృద్ధికి సహకరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్‌‌‌‌బీఐ రేట్ల కోత క్రమక్రమంగా రియల్ ఎకానమీలోకి బదిలీ అవుతుందని ఎంపీసీ పేర్కొంది. రెపో రేటుకు కోత పెట్టడం వరుసగా ఇది నాలుగో సారి. ముందు మూడు పాలసీల్లో కూడా ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేటు కోత పెడుతూనే వచ్చింది.

అదుపులోనే ద్రవ్యోల్బణం…

2019 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంటుందని ఎంపీసీ అంచనావేసింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలలు రిటైల్ ద్రవ్యోల్బణం 3.5 శాతం నుంచి 3.7 శాతం మధ్యలో ఉంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ నిర్దేశించిన లక్ష్యం 4 శాతాని కంటే తక్కువగా ఉంటుండటంతో ఎంపీసీ వడ్డీరేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రేటు కట్ సైకిల్‌‌‌‌ను అవలంబిస్తూ వస్తోందని, కానీ ఈ సారి తగ్గింపు కాస్త సర్‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్‌‌‌‌గా ఉందని కొటక్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఎకానమిస్ట్ సువోదీప్ రక్షిత్ అన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రేటు కోత చేపట్టడంతో, హోమ్, ఆటో కొనుగోలుదారులకు ఈఎంఐలు తగ్గుతాయని పలువురు భావిస్తున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రేటు కోత ప్రయోజనాలను రుణం తీసుకునే వారికి బదలాయిస్తామని బ్యాంక్‌‌‌‌లు ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌కు హామీ ఇచ్చాయి.

కేవలం 29 బేసిస్ పాయింట్లే చేరాయి…

ఆర్‌‌‌‌బీఐ జూన్ నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర రేట్లకు కోత పెడితే.. బ్యాంక్‌‌లు ఇప్పటి వరకు కేవలం 29 బేసిస్ పాయింట్లనే కస్టమర్లకు బదలాయించినట్టు శక్తికాంత్ దాస్ చెప్పారు. తాజాగా మరో 35 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో, వీటన్నింటినీ కస్టమర్లకు అందించే బాధ్యత ఇప్పుడు బ్యాంక్‌‌లపై ఉంది.

15 బేసిస్ పాయింట్లు కోత: ఎస్‌‌బీఐ

ఆర్‌‌‌‌బీఐ రెపో రేటు కోతను చేపట్టిన వెంటనే, దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌‌బీఐ లెండింగ్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శనివారం నుంచి అన్ని టెన్యూర్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని  ఎస్‌‌బీఐ పేర్కొంది. దీంతో ఏడాది ఎంసీఎల్‌‌ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు 8.40 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గినట్టు ఎస్‌‌బీఐ ప్రకటించింది. రెపోతో లింక్ అయి ఉన్న క్యాష్ క్రెడిట్ అకౌంట్లు లేదా ఓవర్‌‌‌‌డ్రాఫ్ట్స్ కస్టమర్ల లెండింగ్ రేట్లు సెప్టెంబర్ 9 నుంచి 7.65 శాతానికి దిగొస్తాయి. 2019 జూలై నుంచి గృహ రుణాలను ఎస్‌‌బీఐ రెపోతో లింక్ చేసింది.

రోజంతా నెఫ్ట్‌‌ సేవలు..

డిసెంబర్ నుంచి అమల్లోకి.. ఆర్‌‌‌‌బీఐ

నెఫ్ట్ ద్వారా 24 గంటలు సేవలందించేలా ఆర్‌‌‌‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు ఈ ఏడాది డిసెంబర్ నుంచి నెఫ్ట్ ద్వారా  24×7 ఫండ్ ట్రాన్స్‌‌ఫర్స్‌‌ను అనుమతించాలని ఆర్‌‌‌‌బీఐ నిర్ణయించింది.  ఈ నిర్ణయం రిటైల్ పేమెంట్స్ సిస్టమ్‌‌లో ఒక విప్లవాత్మకమని ఆర్‌‌‌‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌(నెఫ్ట్)ను రిటైల్ పేమెంట్ సిస్టమ్‌‌గా ఆర్‌‌‌‌బీఐ ఆపరేట్ చేస్తోంది. నెలలో రెండో, నాలుగో శనివారాలు మినహాయించి అన్ని పని రోజుల్లోనూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సిస్టమ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. పేమెంట్ సిస్టమ్ విజన్ 2021 డాక్యుమెంట్‌‌లో నెఫ్ట్ సిస్టమ్‌‌ను 2019 డిసెంబర్ నుంచి  24×7 అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గత జూన్ పాలసీలో కూడా డిజిటల్ లావాదేవీలను ప్రమోట్ చేసేందుకు ఆర్‌‌‌‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే ఫండ్ ట్రాన్స్‌‌ఫర్స్ ఛార్జీలను ఎత్తివేసింది ఆర్‌‌‌‌బీఐ. అంతేకాక, ఏటీఎం ఛార్జీలు, ఫీజులను పరిశీలించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

– రజనీష్ కుమార్, ఎస్‌‌బీఐ ఛైర్మన్

అద్భుతం.. జీడీపీ వృద్ధి పుంజుకోవడానికి మనం చొక్కా చేతులు మడిచి మరింత కష్టపడాల్సి ఉందని ఇందాకే నేను ట్వీట్ చేశా. ఈ విషయంలో రిజర్వ్​ బ్యాంక్​ మనల్ని ముందుండి నడిపిస్తోంది..

– ఆనంద్ మహింద్రా,
ప్రముఖ పారిశ్రామిక వేత్త

బుధవారం రేట్ల కోతతో, ఇప్పటి వరకు ఈ ఏడాది రెపో 110 బేసిస్ పాయింట్లు తగ్గింది. బ్యాంక్‌‌ల వద్ద సర్‌‌‌‌ప్లస్‌‌ లిక్విడిటీని ఉంచేందుకే ఆర్‌‌‌‌బీఐ చూస్తోంది. బ్యాంక్‌‌లు వేగంగా ఈ ప్రయోజనాలను కన్స్యూమర్లకు బదలాయించడమే ఇప్పుడు కీలకం. పూర్తిగా ఈ ప్రయోజనాలు చేరకపోతే, కన్‌‌సంప్షన్, ఇన్వెస్ట్‌‌మెంట్ పరంగా మనం మార్పులు చూడలేం..

– సందీప్ సోమనీ, ఫిక్కీ ప్రెసిడెంట్

Latest Updates