మొండి బాకీల వసూలుకు…RBI కొత్త పాలసీ

rbis-new-policy

కొత్త విధానాన్ని రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఆర్‌‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. గత విధానంలోని నిబంధనలను కొన్నింటిని సుప్రీం కోర్టు కొట్టివేయడంతో తాజా విధానాన్ని తెచ్చింది. ఇంతకు ముందులా ఒక్క రోజుకే డిఫాల్టర్​గా ప్రకటించకుండా, ఇప్పుడు నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు ఆర్‌‌బీఐ తెలిపింది. మొండి బాకీల వసూలుకు సంబంధించిన గతంలో తెచ్చిన అన్ని విధానాలను పక్కకు పెట్టి కొత్త విధానం తీసుకు వచ్చినట్లు పేర్కొంది. సీడీఆర్‌‌, దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌‌ లోన్ల ఫ్లెక్సిబుల్‌‌ స్ట్రక్చరింగ్‌‌, స్ట్రేటజిక్‌‌ డెట్‌‌ రిస్ట్రక్చరింగ్‌‌ (ఎస్‌‌డీఆర్)లు అన్నీ ఇకమీదట ఉండవని, కొత్త విధానం ఒక్కటే అమలులో ఉంటుందని ఆర్‌‌బీఐ స్పష్టం చేసింది. మొండి బాకీల వసూలుకు సంబంధించి ఆర్‌‌బీఐ ప్రకటించిన మునుపటి విధానంలోని కొన్ని నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్‌‌ 2 న సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ నిబంధనలు కఠినమైనవిగా కోర్టు అభిప్రాయపడింది. దీంతో కొత్త విధానానికి ఆర్‌‌బీఐ రూపకల్పన చేసింది. బ్యాంకులకు అప్పులు తిరిగి చెల్లించడంలో ఒక్క రోజు ఆలస్యం చేసినా వాటిని మొండి బకాయిలు (ఎన్‌‌పీఏ)గా పరిగణించాలని ఫిబ్రవరి 12, 2018 లో ఆర్‌‌బీఐ రూల్‌‌ తెచ్చింది. అంతేకాకుండా, 180 రోజులలోపల రిజొల్యూషన్‌‌ (పరిష్కారం) కనుక్కోలేకపోతే, ఐబీసీ చట్టం కింద దివాలా ప్రక్రియ మొదలు పెట్టాలని ఆర్‌‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు సైతం ఇబ్బందులపాలయ్యాయి. వివిధ రాష్ట్రాలలోని కోర్టులలో కేసులు దాఖలయ్యాయి. చివరకు ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. కేసును పరిశీలించిన సుప్రీం కోర్టు, మార్చిన నిబంధనలు కఠినమైనవిగా ఉన్నాయంటూ, వాటిని కొట్టి వేసింది.మొండి బకాయిలను వీలైనంత ముందుగానే గుర్తించేలా, వాటి పరిష్కారానికి సరైన చర్యలు తీసుకునేలా కొత్త సర్క్యులర్‌‌ దోహదపడుతుందని భావిస్తున్నారు. డిఫాల్టైన వెంటనే కారణాలను తెలుసుకుని, అవసరమైతే మొండి బకాయిలుగా గుర్తించేందుకు ప్రయత్నించాలని బ్యాంకులకు ఆర్‌‌బీఐ హితవు చెప్పింది. అలాంటి లోన్‌‌ అకౌంట్లను స్పెషల్‌‌ మెన్షన్‌‌ అకౌంట్లుగా (ఎస్‌‌ఎంఏ)లుగా పరిగణించమని చెప్పింది. డిఫాల్ట్‌‌ అవడమంటే శక్తి కోల్పోవడమే కాబట్టి, డిఫాల్ట్‌‌ కావడానికి ముందే పసిగట్టి సరైన పరిష్కార చర్యలను (రిజొల్యూషన్‌‌ ప్లాన్‌‌ను) బ్యాంకులు తీసుకోవాలని సూచించింది. ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఒక అప్పు తీసుకున్న సంస్థ లేదా వ్యక్తి ని డిఫాల్టర్‌‌గా ప్రకటిస్తే, అప్పులు ఇచ్చిన ఇతర ఆర్థిక సంస్థలు అంటే, స్మాల్‌‌ ఫైనాన్స్‌‌ బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు కూడా ఆ అకౌంట్‌‌ను 30 రోజులలోపు పరిశీలించాలని ఆర్‌‌బీఐ తాజాగా బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకులు అకౌంట్‌‌ను రివ్యూ చేసే ఈ 30 రోజుల వ్యవధిలో అప్పు తీసుకున్న వాళ్లు తమ రిజొల్యూషన్‌‌ వ్యూహాన్ని ఖరారు చేసుకోవల్సి ఉంటుందని ఆర్‌‌బీఐ తెలిపింది. అంతేకాదు, దాంతోపాటే రిజొల్యూషన్‌‌ ప్లాన్‌‌ను సిద్ధం చేసుకోవాలని సూచించింది. రిజొల్యూషన్‌‌ ప్లాన్ అమలు చేయాల్సి వచ్చిన సందర్భాలలో అప్పులు ఇచ్చిన ఆర్థిక సంస్థలన్నీ కలిసి ఇంటర్–క్రెడిటార్‌‌ ఎగ్రిమెంట్‌‌ (ఐసీఏ) కుదుర్చుకోవాలని పేర్కొంది. రిజొల్యూషన్‌‌ ప్లాన్‌‌ అమలులోకి తెచ్చేందుకు వీలును కల్పించేందుకు ఈ ఐసీఏ సాయపడుతుందని తెలిపింది. అప్పులు తిరిగి రాబట్టుకునేందుకు ఇన్‌‌సాల్వెన్సీ సహా  చట్టపరంగా ఏ చర్యలనైనా బ్యాంకులు తీసుకోవచ్చని ఆర్‌‌బీఐ స్పష్టం చేసింది. గతంలోని జాయింట్‌‌ లెండర్స్‌‌ ఫోరమ్‌‌ (జేఎల్‌‌ఎఫ్‌‌) మెకానిజంకు కూడా స్వస్తి పలుకుతున్నట్లు ఆర్‌‌బీఐ ప్రకటించింది. తాజా ఆదేశాలు వెంటనే అమలులోకి తెస్తున్నట్లు ఆర్‌‌బీఐ వెల్లడించింది.

Latest Updates