చించేసిన సిరాజ్..కోల్ కతాపై బెంగళూరు గ్రాండ్ విక్టరీ

స్వింగ్‌‌, స్పిన్‌‌తో.. బెంగళూరు చేసిన ముప్పేట దాడిలో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ చెల్లాచెదురైంది..! హైదరాబాద్‌‌ కుర్రాడు మహ్మద్‌‌ సిరాజ్‌‌ (4-2-8-3) ఐపీఎల్‌‌ హిస్టరీలోనే అరుదైన ఫీట్‌‌ సాధించి అదుర్స్‌‌ అనిపించగా, రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ యుజ్వేంద్ర చహల్‌‌ (4-0-15-2) సూపర్‌‌ టర్నింగ్‌‌తో ప్రత్యర్థిని వణికించాడు..! దీంతో చిన్న టార్గెట్‌‌ను ఈజీగా ఛేదించిన ఆర్‌‌సీబీ.. ఏడో విజయంతోటాప్‌‌-2లోకి దూసుకెళ్లింది..! మరోవైపు కొత్త కెప్టెన్‌‌ వచ్చినా.. రాత మార్చుకోలేకపోతున్న కోల్‌‌కతా.. తృటిలో ఓ చెత్త రికార్డు (లోయెస్ట్‌‌ స్కోరు)ను తప్పించుకుంది..!!

అబుదాబిఐపీఎల్‌‌–13లో బెంగళూరు మరోసారి అదరగొట్టింది. ఇన్నాళ్లూ బ్యాటింగ్‌‌తో విజయాలు సాధించిన ఆర్‌‌సీబీ.. ఈసారి బౌలింగ్‌‌తో మెరుపులు మెరిపించింది. ఓ పేసర్‌‌, స్పిన్నర్‌‌ చేసిన విధ్వంసంతో మ్యాచ్‌‌ను ఏకపక్షంగా మార్చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్‌‌సీబీ 8 వికెట్ల తేడాతో కోల్‌‌కతాను చిత్తు చేసింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 రన్సే చేసింది. కెప్టెన్‌‌ మోర్గాన్‌‌ (34 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 30) టాప్‌‌ స్కోరర్‌‌.  తర్వాత బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 85 రన్స్‌‌ చేసింది. పడిక్కల్‌‌ (17 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 25), గురుకీరత్‌‌ సింగ్‌‌ (26 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 21 నాటౌట్‌‌) రాణించారు. సిరాజ్‌‌కు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ లభించింది.

వామ్మో.. సిరాజ్‌‌

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ కుర్రాడు సిరాజ్‌‌ (3/8).. కోల్‌‌కతాను భయపెట్టాడు. బాల్‌‌ను అద్భుతంగా స్వింగ్‌‌ చేస్తూ ఓపెనర్లు గిల్‌‌ (1), త్రిపాఠి (1)ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఎంతలా అంటే కనీసం బాల్‌‌ను టచ్‌‌ చేయడానికి కూడా ఈ జోడీ భయపడింది. రెండో ఓవర్‌‌లో షార్ట్‌‌ లెంగ్త్‌‌తో వేసిన మూడో బాల్‌‌ను టచ్‌‌ చేసిన త్రిపాఠి.. కీపర్‌‌కు దొరికాడు. తర్వాతి బాల్‌‌కు సంధించిన ఇన్‌‌స్వింగర్‌‌.. రాణా (0) వికెట్లను గిరాటేసింది. ఫలితంగా మెయిడెన్‌‌ ఓవర్‌‌తో రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌లో సైనీ (1/23).. గిల్‌‌ను వెనక్కి పంపాడు. జస్ట్‌‌ ఐదు బాల్స్‌‌ తేడాలో మూడు వికెట్లు పడటంతో నైట్‌‌రైడర్స్‌‌ స్కోరు 3/3గా మారింది. బాంటన్‌‌ (10) ఫోర్‌‌, సిక్స్‌‌తో రెచ్చిపోయినా.. నాలుగో ఓవర్‌‌లో సిరాజ్‌‌ దెబ్బకు పెవిలియన్‌‌కు చేరాడు. ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను ఆడే క్రమంలో డివిలియర్స్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. ఈ ఓవర్‌‌నూ సిరాజ్‌‌ మెయిడెన్‌‌ వికెట్‌‌తో ముగించాడు. కేవలం 14 రన్స్‌‌కే 4 వికెట్లు కోల్పోవడంతో కేకేఆర్‌‌ కష్టాల్లో పడింది.

క్యూ కట్టారు..

14/4 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన మోర్గాన్‌‌, కార్తీక్ (4) కూడా కేకేఆర్‌‌ను ఆదుకోలేదు. రన్‌‌రేట్‌‌ తగ్గడంతో 17/4 స్కోరుతో పవర్‌‌ప్లేను ముగించారు. ఓ ఫోర్‌‌, సిక్సర్‌‌తో మెర్గాన్‌‌ కుదురుకున్నా…. 9వ ఓవర్‌‌లో కార్తీక్‌‌ను చహల్‌‌ (2/15) ఎల్బీ చేశాడు. ఓవరాల్‌‌గా ఫస్ట్‌‌ టెన్‌‌లో కోల్‌‌కతా 36/5కు పరిమితమైంది. రెండు ఎండ్‌‌ల నుంచి స్పిన్నర్లు ఒత్తిడి పెంచడంతో కేకేఆర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ ఘోరంగా తడబడ్డారు. రెండుసార్లు రివ్యూలో గట్టెక్కిన కమిన్స్‌‌ (4)ను చహల్‌‌ వదల్లేదు. 13వ ఓవర్‌‌లో వెనక్కి పంపడంతో 40 రన్స్‌‌కు ఆరో వికెట్‌‌ కోల్పోయింది. 15 ఓవర్లలో 52 స్కోరే కావడంతో  మోర్గాన్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించే ప్రయత్నం చేశాడు. ఓ రెండు ఫోర్లతో జోరు చూపెట్టినా.. 16వ ఓవర్‌‌లో వెనుదిరిగాడు. స్లాగ్‌‌ ఓవర్లలో కుల్దీప్‌‌ (12), ఫెర్గుసన్‌‌ (19 నాటౌట్‌‌) భారీ షాట్లు కొట్టకపోయినా.. వేగంగా సింగిల్స్‌‌ తీశారు. దీంతో ఎనిమిదో వికెట్‌‌కు 27 రన్స్‌‌ జోడించడంతో తృటిలో లోయెస్ట్‌‌ స్కోరు రికార్డును తప్పించుకుంది.

ఈజీగా..

చిన్న టార్గెట్‌‌ను బెంగళూరు  ఓపెనర్లు ఫించ్‌‌ (16), పడిక్కల్‌‌ వేగంగా ఛేదించడం మొదలుపెట్టారు. మూడో ఓవర్‌‌లో ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన పడిక్కల్‌‌.. తర్వాతి ఓవర్‌‌లో రెండు ఫోర్లు బాదాడు. ఫించ్‌‌ కూడా అదే దారిలో వెళ్లడంతో పవర్‌‌ప్లే ముగిసే సరికి ఆర్‌‌సీబీ 44 రన్స్‌‌తో పటిష్ట స్థితిలోకి చేరింది. అయితే ఏడో ఓవర్‌‌లో ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన ఫెర్గుసన్‌‌ (1/17) ఆర్‌‌సీబీకి డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. రెండో బాల్‌‌కు ఫించ్‌‌ను ఔట్‌‌ చేయగా, నాలుగో బాల్‌‌కు పడిక్కల్‌‌ రనౌటయ్యాడు. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 46 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది.  స్కోరు చేయాల్సిన రన్‌‌రేట్‌‌ తక్కువగా ఉండటంతో ఈ దశలో వచ్చిన గురుకీరత్‌‌, కోహ్లీ (18 నాటౌట్‌‌) నెమ్మదిగా ఆడారు. వికెట్లను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు.  తర్వాతి రెండు ఓవర్లలో 2, 6 రన్సే వచ్చినా..10వ ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ బాదడంతో స్కోరు 63/2కు చేరింది. ఆ వెంటనే గురుకీరత్‌‌ మరో రెండు ఫోర్లు బాదడం, కోహ్లీ కూడా సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో జోరు చూపాడు. దీంతో మూడో వికెట్‌‌కు 38 రన్స్‌‌ జత చేసి మరో 40 బాల్స్‌‌ మిగిలి ఉండగానే మ్యాచ్‌‌ను ముగించారు.

Latest Updates