బెంగళూరుకు బలం.. బలహీనత ఆ ఇద్దరే..

ఐపీఎల్ -13కు కోహ్లీసేన సిద్ధం
స్టార్లతో కూడిన లైనప్

వెలుగు స్పోర్ట్స్​ డెస్క్​:  విరాట్​ కోహ్లీ, ఏబీ డివిలియర్స్​.. వరల్డ్ క్రికెట్​లో టాప్​ మోస్ట్​ ప్లేయర్లు. ఎదురుగా మొనగాళ్లలాంటి బౌలర్లు ఉన్నా.. వీళ్ల బ్యాటింగ్​ ముందు దిగదుడుపే. అయితే ఈ లెక్క ఇంటర్నేషనల్​ క్రికెట్​ వరకు మాత్రమే సరిపోతున్నది. కానీ ఐపీఎల్​లో మాత్రం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు టైటిల్​ బెంగను ఈ జోడీ తీర్చలేకపోతున్నది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలంగా ప్రయత్నిస్తున్నా… ఇప్పటికీ ఆర్​సీబీకి ఐపీఎల్​ టైటిల్​ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. 2009, 2011, 2016లో ఫైనల్​కు చేరినా.. టైటిల్​ను ఒడిసిపట్టుకోలేకపోయింది. ఈ మూడు సీజన్లు మినహా.. లీగ్​ మొత్తం ఆర్​సీబీ పెర్ఫామెన్స్​ అంతంతమాత్రంగానే ఉంది. ఓడిన ప్రతిసారి బౌలింగ్​పై నిందలు వేస్తూ వచ్చిన బెంగళూరు ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తున్నది. మరి ఈసారైనా టైటిల్​ కరువు తీర్చుకుంటుందో లేదో చూడాలి.

బలం..

ఆర్​సీబీ బలం మొత్తం కోహ్లీ, డివిలియర్స్​ అన్నది సత్యం. టీమ్​ మొత్తానికి ఈ ఇద్దరూ మూల స్తంభాలు. వ్యక్తిగతంగానూ ఐపీఎల్​లో ఈ ఇద్దరికి మంచి రికార్డు ఉంది.  ఈ ఇద్దరూ నిలబడితే సిక్సర్ల జడివానలో పరుగుల వర్షం కురుస్తుంది. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసిన ఆసీస్​ ఓపెనర్​  ఆరోన్​ ఫించ్​ రాకతో ఆర్​సీబీ బ్యాటింగ్​ బలం రెట్టింపైంది. ఈ ముగ్గురూ తలుచుకుంటే ఎంతటి మ్యాచ్​నైనా అపోజిషన్​ నుంచి తేలికగా లాగేసుకుంటారు. ఫించ్​కు కెప్టెన్సీ ఎక్స్​పీరియెన్స్​ ఉండటం కూడా ఎక్స్​ట్రా అడ్వాంటేజ్​. ఫీల్డ్​లో విరాట్​కు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ త్రయానికి తోడుగా ఇండియన్​ డొమెస్టిక్ కుర్రాళ్లు అండగా నిలిస్తే చాలు.  ఈసారి పేస్​ బౌలింగ్​ను కూడా ఆర్​సీబీ మరింత బలోపేతం చేసుకుంది. రూ. 10 కోట్లు వెచ్చించి తీసుకున్న క్రిస్​ మోరిస్​ చేరిక పేస్​  పదును పెంచింది. డేల్​ స్టెయిన్​, ఇసురు ఉడానతో పాటు ఇండియన్​ స్టార్లు ఉమేశ్​ యాదవ్​, నవ్​దీప్​ సైనీ గాడిలో పడితే ఆర్​సీబీకి తిరుగుండదు. హైదరాబాద్​ పేసర్​ మహ్మద్​ సిరాజ్ పేస్​ బౌలింగ్​ ఆప్షన్​లో కీలకం కానున్నాడు. యూఏఈ పిచ్​లు స్పిన్​కు అనుకూలిస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆర్​సీబీ కూడా టర్నింగ్​ లోతును పెంచుకుంది. ఇండియన్​ రిస్ట్​ స్పిన్నర్​ యజ్వేంద్ర చహల్​తో పాటు ఆసీస్​ టాప్​ స్పిన్నర్​ ఆడమ్​ జంపా, వాషింగ్టన్​ సుందర్​, మొయిన్​ అలీని కూడా అందుబాటులోకి తెచ్చుకుంది. ఓవరాల్​గా బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ మంచి బ్యాలెన్స్​ కనిపిస్తున్న ఆర్​సీబీకి ఫ్లే ఆఫ్​ వరకు ఢోకా లేనట్లే.

బలహీనత..

ఆర్​సీబీ అంటే ఠక్కున గుర్తొచ్చేది కోహ్లీ, డివిలియర్స్​. అదే ఆ టీమ్​కు ఉన్న అతిపెద్ద బలహీనత. కనీసం ఈ ఇద్దరి స్థాయిలో సగమైనా టీమ్​ భారాన్ని మోసే క్రికెటర్లు లేకపోవడం ప్రతికూలాంశం. పేపర్​ మీద కనిపించే స్టార్లు గ్రౌండ్​లో వీళ్లను మరిపించలేకపోతున్నారు. ప్రతి మ్యాచ్​లో బ్యాటింగ్​ మొత్తం విరాట్​, ఏబీపైనే అతిగా ఆధారపడుతున్నది. మిడిలార్డర్​లో బ్యాటింగ్​ భారాన్ని మోసే ప్లేయర్​ లేడు. ఒకవేళ ఏదైనా మ్యాచ్​లో టాప్​–3 విఫలమైతే ఇక ఆర్​సీబీ కమ్​బ్యాక్​ కావడం చాలా కష్టంగా కనిపిస్తున్నది. ఆరోన్‌‌ ఫించ్‌‌ రాకతో అయినా ఆ పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఇక, నాణ్యమైన  డెత్​ బౌలింగ్​ అటాక్​ లేకపోవడం వల్లే ఆర్​సీబీ 30 శాతం మ్యాచ్​లు ఓడిందని ఓ నివేదిక. కాబట్టి ఈ లోటును మోరిస్​, సైనీ, స్టెయిన్, ఉమేశ్​ పూరిస్తే బెంగళూరు టైటిల్​ కష్టాలు కొంతవరకైనా తీరుతాయి. కెప్టెన్​గా ఇంటర్నేషనల్​ లెవెల్లో సూపర్​ సక్సెస్​ అయిన విరాట్​.. ఐపీఎల్​లో మాత్రం తేలిపోతున్నాడు. నిర్ణయాలు తీసుకోవడంలో, టీమ్‌‌మేట్స్‌‌లో విశ్వాసాన్ని నింపడంలో వెనుకబడిపోతున్నాడు. కాబట్టి ఈసారి ఆ బలహీనతలను అధిగమించాలి.

అంచనా..

పవర్​ఫుల్​ బ్యాటింగ్​, ఆల్​రౌండర్లు, స్పెషలిస్ట్​ బౌలింగ్​ అటాక్​ ఉంది కాబట్టి.. ఈసారి కచ్చితంగా ఆర్​సీబీని టైటిల్​ పోరులో చూడొచ్చు. అంతకంటే ముందు ప్లే ఆఫ్స్​ వరకు అయితే ఎలాంటి ఢోకా లేదు. ఈనెల 21న సన్​రైజర్స్​ హైదరాబాద్​తో  బెంగళూరు ఐపీఎల్​ తొలి పోరు మొదలుపెట్టనుంది.

జట్టు

బ్యాట్స్​మెన్​: కోహ్లీ (కెప్టెన్​), డివిలియర్స్​, ఫించ్​, గురుకీరత్​​ మన్, దేవదత్​ పడిక్కల్

ఆల్‌రౌండర్స్‌: మొయిన్​ అలీ, పవన్​ నేగి, శివమ్​ దూబే, పవన్​ దేశ్​పాండే,  ఇసురు ఉడాన

కీపర్స్‌:  పార్థివ్​ పటేల్, జోష్​  ఫిలిప్​​

బౌలర్స్​: క్రిస్​ మోరిస్​, చహల్​, నవ్ దీప్​ సైనీ, స్టెయిన్​, ఉమేశ్​ ​, వాషింగ్టన్​ సుందర్​, ఆడమ్​ జంపా, సిరాజ్​, షాబాజ్​ అహ్మద్​.

For More News..

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌కు రూ.13.03 కోట్లు

Latest Updates