టెండర్ ఓటు వేస్తే రీ పోలింగ్: వి.నాగిరెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో టెండర్ ఓటు వేస్తే రీ పోలింగ్ తప్పనిసరి నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌(SEC) వి.నాగిరెడ్డి. దొంగ ఓట్లు వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడిన ఎస్‌ఈసీ… ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుందని తెలిపారు.

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నట్లు SEC తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని సూచించారు.  టెండర్‌ ఓటు ఒక్కటి పడినా ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. టెండర్‌ ఓటు వేసిన  దగ్గర ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించబోమని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో అధికారులతో పాటు పార్టీల నేతలు కూడా సహకరించాలని SEC కోరారు.

అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాల్లో తప్పుడు సమాచారం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్థి వివరాలను నోటీసు బోర్డులో ఉంచుతామనీ.. అభ్యర్థుల గత చరిత్ర, నేర చరిత్ర, ఆస్తుల వివరాలు అందుబాటులో ఉంచుతామని SEC వి.నాగిరెడ్డి తెలిపారు. అభ్యర్థి వివరాలు తెలిస్తే ఎవరికి ఓటు వేయాలనే విషయాన్ని ఓటర్లు తెలుసుకుంటారని చెప్పారు.

Latest Updates