ఆయేషా కేసులో పన్నెండేండ్ల తర్వాత రీపోస్ట్ మార్టం

ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసులో సీబీఐ రీపోస్ట్ మార్టం నిర్వహించింది. 12 ఏళ్ల తర్వాత శనివారం గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానంలో సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య ఆధ్వర్యంలో 8 మంది సభ్యుల ఫోరెన్సిక్ టీమ్ 4 గంటలపాటు ఆయేషా మృతదేహానికి పోస్టుమార్టం చేసింది. కేసులో కీలకంగా ఉన్న ఎముకలు, పుర్రె చిట్లిన గాయాలను గుర్తించినట్లు తెలిసింది. మృతదేహం ఎముకల నుంచి అవశేషాలను సేకరించింది. ప్రత్యేక బాక్స్‌‌‌‌‌‌‌‌లో భద్రపరిచి సీలు చేసి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయేషా మృతికి కారణాలపై ఫోరెన్సిక్ బృందం రిపోర్ట్ ఇవ్వనుంది. దీని ఆధారంగా సీబీఐ తదుపరి విచారణ ప్రక్రియ చేపట్టనుంది.

అసలు నిందితులెవరు?

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా 2007 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 27న అర్ధరాత్రి హత్యకు గురైంది. ఈ కేసులో నిందితులను శిక్షించాలంటూ అప్పట్లో విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన చేశాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన సత్యంబాబును అనుమానించి 2008 ఆగస్టులో అరెస్టు చేశారు. పోలీసు దర్యాప్తు ఆధారంగా కేసును విచారించిన విజయవాడ మహిళా సెషన్స్‌‌‌‌‌‌‌‌ స్పెషల్ కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్లు జైలుశిక్ష విధించింది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకోగా 2017 మార్చి 31న సత్యంబాబును నిర్దోషిగా తీర్పు చెప్పింది. 8 ఏళ్ల జైలుశిక్ష తర్వాత సత్యంబాబు రిలీజ్ అయ్యాడు. దీంతో ఈ కేసులో ఏపీ పోలీసులు విఫలమయ్యారని, అసలు నిందితులకు శిక్ష పడలేదని ఆయేషా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.  పోలీసులు విచారణలో రాజకీయ నాయకుల ప్రమేయంతో వాస్తవాలు వెల్లడి కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు 2018 నవంబర్‌‌‌‌‌‌‌‌ 29న సీబీఐ విచారణకు ఆదేశించింది.

పోలీసు, సిట్ ఎంక్వైరీతో దర్యాప్తు కష్టమే: సీబీఐ

గత జనవరి నుంచి సీబీఐ విచారణ ప్రారంభించింది.  పోలీసు, సిట్ ఎంక్వైరీపై ఆధారపడి దర్యాప్తు పూర్తి చేయలేమని కోర్టుకు తెలిపింది. రీపోస్ట్ మార్టం చేస్తేనే కీలకమైన ఆధారాలు లభిస్తాయని పేర్కొంది. దీంతో ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు కోర్టు అనుమతించింది. రెవెన్యూ ఆఫీసర్లు, అయేషా  కుటుంబసభ్యుల సమక్షంలోనే రీ పోస్ట్ మార్టం చేయాలని కండిషన్ పెట్టింది.

ఆధారాలన్నీ తగలబెట్టేశారు

మా కూతురు హత్య కేసులో ఆధారాలను పూర్తిగా తగలబెట్టేశారు. హాస్టల్ వార్డెన్, తోటి విద్యార్థినులను కస్టడీలోకి తీసుకుని విచారించలేదు. హాస్టల్ లో ముగ్గురు అమ్మాయిలు బయటి వ్యక్తులతో ఉండటం చూసినందుకునే ఆయేషాను చంపేశారు. ఈ హత్య వెనుక అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనవడు సతీశ్‌‌‌‌‌‌‌‌, అతని మిత్రులు ఉన్నారు. న్యాయం కోసం 12 ఏళ్లుగా పోరాడుతున్నాం. మా బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకపోతే ఎప్పుడో న్యాయం జరిగేది. సీబీఐ అధికారులు నిక్కచ్చిగా విచారణ చేయాలి.

– ఆయేషా తల్లిదండ్రులు

Latest Updates