రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ప్రభుత్వం సీరియస్

రెరాలో నమోదు కాని ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెడుతున్నారు అధికారులు. రెరా అమల్లోకి వచ్చి ఆరు నెలలైనా ఇంకా సగం ప్రాజెక్టులు కూడా రిజిస్టర్ చేసుకోలేదు. యాభై వేలు, లక్షా, రెండు లక్షల ఫైన్ తో ఇన్నిరోజులు గడువు ఇచ్చినా…. డెవలపర్లు ముందుకు రావట్లేదు. ఇప్పటికే ఆరు సార్లు డేట్ ని పొడిగించిన రెరా అధికారులు… ఈసారి మాత్రం భారీ పెనాల్టీ, లీగల్ కేసులు తప్పదంటున్నారు.

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత.. 2017లో తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల కిందకు వచ్చే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను రెరాలో నమోదు చేసుకోవాలి. 2017 జనవరి 1తర్వాత చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఇందులో తప్పకుండా రిజిష్టర్ చేసుకోవాలి.  5వందల  స్క్వేర్ ఫీట్స్ లేదా 8 ఫ్లాట్స్ కంటే ఎక్కువగా ఉండే ప్రతీ ప్రాజెక్టు రెరా కిందకే వస్తుంది.

తెలంగాణలో రెరాని గతేడాది ఆగస్టు 31న ప్రారంభించారు. మూడు నెలల్లోగా అంటే నవంబర్ 30 లోగా అన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ రెరాలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. అయితే రెరా ఇచ్చిన మూడు నెలల గడువులో కేవలం 12వందల ప్రాజెక్టులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. దాంతో 50వేల పెనాల్టీతో డిసెంబర్ 7వరకు ప్రాజెక్టులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. కానీ బిల్డర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో మళ్లీ రెండు లక్షల ఫైన్ తో డిసెంబర్ 31వరకు గడువిచ్చారు. ఆ తర్వాత కూడా మళ్లీ జనవరి 15కి.. తర్వాత జనవరి 31వరకు రెండు లక్షల ఫైన్ తో నమోదు చేసుకునే  ఛాన్సిచ్చారు. అయినా బిల్డర్ల నుంచి ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. ఇక చివరి అవకాశమంటూ ఆరోసారి డేట్ ని పొడిగిస్తూ ఫిబ్రవరి 15వరకు రెండు లక్షల ఫైన్ తో అవకాశం కల్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4వేల 9వందల 47 ప్రాజెక్టులు నమోదవుతాయని అంచనా వేశారు రెరా అధికారులు. కానీ రెరా రిజిస్ట్రేషన్స్ ప్రారంభమై ఆరునెలలు గడిచినా ఇప్పటివరకు కేవలం 19వందల 73 మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఇందులో కూడా అన్ని డాక్యుమెంట్స్ సబ్ మిట్ చేసి.. పూర్తిస్థాయి రెరా సర్టిఫికట్స్ పొందినవి 3వందల ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయంటున్నారు రెరా అధికారులు.

రెరాలో నమోదు చేసుకునేప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్కిటెక్చర్ సర్టిఫికెట్, చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ తో పాటు స్ట్రక్చర్ ఇంజనీర్ సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్స్ కావట్లేదంటున్నారు రెరా అధికారులు. అన్ని డాక్యుమెంట్లతో కలిసి రెరాలో ప్రాజెక్టులు నమోదు చేసుకోవడానికి  ఫిబ్రవరి 15వరకు రెండు లక్షల పెనాల్టీతో చివరి అవకాశమంటున్నారు. ఆ తర్వాత రెరాలో నమోదు కాని ప్రాజెక్టులన్నింటినీ సందర్శించి ప్రాజెక్టు మొత్తం వాల్యూ చేసి పదిశాతం పెనాల్టీ వేస్తామంటున్నారు. లీగల్ కేసులు కూడా పెడతామంటున్నారు. దీనికోసం సెపరేట్ టీమ్ ని ఏర్పాటు చేశామని చెప్పారు.

రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు ఓపెన్ ప్లాట్ లేఔట్లు కూడా రెరాలో తప్పకుండా నమోదు చేసుకోవాలి. కానీ లేఔట్లు నమోదు చేసే విషయంలో రియల్టర్లు వెనుకంజ వేస్తున్నారు. డెవలపర్లు మాత్రం మరో రెండు నెలలు గడువు కావాలంటున్నారు. రెరాపై బిల్డర్లకు ఇంకా పూర్తి అవగాహన రాలేందంటున్నారు.

Latest Updates