పర్మిషన్లు లేకుండా జరిగిన ఫ్లాట్లు, ప్లాట్ల అమ్మకాలపై ఫోకస్

పర్మిషన్లు లేకుండా జరిగిన ఫ్లాట్లు, ప్లాట్ల అమ్మకాలపై ఫోకస్

 

  • పర్మిషన్లు తీసుకోని బిల్డర్లపై చర్యలకు సిద్ధం
  • ప్లాట్ల రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేసేలా రూల్స్​
  • అక్రమమని తేలితే ఫ్లాట్​కు 10 శాతం ఫైన్, బిల్డర్ కు జైలు శిక్ష
  • నష్టపోనున్న తక్కువ ధరకు కొన్న కస్టమర్లు 

హైదరాబాద్, వెలుగు:  సిటీలో యూడీఎస్ (అన్‌ డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ ల్యాండ్‌), ​ప్రీ లాంచ్​ ఆఫర్ల పేరిట కొనుగోలుదారులను అట్రాక్ట్​ చేసిన రియల్​ఎస్టేట్​ బిల్డర్లకు చెక్​ పెట్టేందుకు రెరా (రియల్ ​ఎస్టేట్ ​రెగ్యులేటరీ​ అథారిటీ) సిద్ధమైంది. పర్మిషన్లు లేకుండా జరిగిన ఫ్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయ వివరాలను సేకరించే పనిలో బిజీగా ఉంది. రెరా రూల్స్​ పక్కాగా అమలు చేసే క్రమంలో కొనుగోలుదారులపైనా కఠినంగా వ్యవహరించనుంది. ఇందులో భాగంగా ప్రీ, సాఫ్ట్ లాంచ్​ ఆఫర్లలో కొనుగోలు చేసిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు నిలిపివేయనుంది. సంబంధిత ఫ్లాట్లపై 10 శాతం ఫైన్​ వేయనుంది. బిల్డర్లకు జైలు శిక్ష వేసే చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది. మరోవైపు  ఇప్పటికే కొనుగోలు చేసినవారికి భరోసా లేకుండా పోయే ప్రమాదం ఉంది.   

ఫస్ట్​ టైమ్​ ప్రాపర్టీలు కొనేవారే ఎక్కువగా..
సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా తక్కువ ధరలో ఉండే ప్లాట్లను సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇందులో మెజార్టీ కొనుగోలు దారులు ఫస్ట్​టైమ్​ ప్రాపర్టీలు కొనేవారే ఉంటుంటారు. వీరిని ఆకట్టుకునేలా కంపెనీలు, బిల్డర్లు ప్రీ లాంఛ్ పేరిట అట్రాక్ట్ ​చేస్తుంటాయి. మార్కెట్ ధర కంటే సగం రేటులోపే ఫ్లాట్లు, ప్లాట్లను ఇస్తామంటూ నమ్మిస్తుంటాయి. ఇలా కొనుగోలు చేసిన ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్, పూర్తిగా పేమెంట్ చేసిన కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. 

నమోదు చేసుకోని బిల్డర్లకు నోటీసులు 
సిటీలో యూడీఎస్, ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట అమ్మకాలు చేస్తున్న రియల్ బిజినెస్ ​సంస్థల  జాబితాను రెరా రెడీ చేసింది.  రెరాలో నమోదు చేసుకొని 32 కంపెనీలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది.  మరిన్ని ఆధా రాలు సేకరించే పనిలో ఉంది. అయితే రెరా నోటీసులపై కొందరు బిల్డర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. యూడీఎస్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపేస్తే కస్టమర్లే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఎక్స్​పర్ట్స్​పేర్కొంటున్నారు.  మరోవైపు బిల్డర్లు ప్రభుత్వ, నేతల అండదండలతో రెరా కేసుల నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం కూడా ఉండొచ్చనే విమర్శలు వస్తున్నాయి.