వాళ్లిద్దరూ చెలరేగితే బ్యాట్స్‌‌మెన్‌‌కు ముచ్చెమటలే

మెల్‌‌బోర్న్: ఇండో-ఆసీస్ సమరానికి అంతా సిద్ధమైంది. శుక్రవారం జరిగే తొలి వన్డేతో ఇరు జట్ల మధ్య భారీ టూర్‌‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎలా ఉండబోతోందనే దాని గురించి ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. ఈ సిరీస్‌‌ను పేసర్ల మధ్య పోరుగా లాంగర్ పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లతో టీమిండియా పేస్ దళం పవర్‌‌ఫుల్‌‌గా కనిపిస్తోందన్నాడు. అయితే తమ టీమ్ బ్యామ్స్‌‌మెన్ వారిని సమర్థంగా ఎదుర్కొంటారనే నమ్మకం ఉందన్నాడు.

‘బుమ్రా సత్తా ఏంటో అందరికీ తెలుసు. అతడో వరల్డ్ క్లాస్ బౌలర్. బుమ్రాతో కలసి బౌలింగ్ చేసే షమీది మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అవుతుంది. వాళ్ల బౌలింగ్‌‌ను మేం గౌరవిస్తాం. వాళ్లిద్దరూ చెలరేగితే బ్యాట్స్‌‌మెన్‌కు కష్టాలు తప్పవు. అయితే ఐపీఎల్‌‌తోపాటు పలు మ్యాచుల్లో వారిని ఎదుర్కొన్న అనుభవం మా బ్యాట్స్‌‌మెన్‌‌కు కలిసొస్తుంది. మేం గత కొన్నేళ్లలో ఇండియాతో 14 వన్డేలు దాకా ఆడాం. ఇరు జట్ల ప్లేయర్లకు ఒకరితో మరొకరు ఆడిన అనుభవం చాలా ఉంది. అందుకే ఈ సిరీస్ రసవత్తరంగా సాగనుంది. ఒక జట్టుగా మేం బలంగా ఉన్నాం. దీనికి ఆషెస్ సిరీస్‌లో మా పెర్ఫామెన్సే ఉదాహరణ. పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లను వాడుకోవడం అలవాటు చేసుకున్నాం. మిచెల్ స్టార్క్, హేజల్‌‌వుడ్, ప్యాట్ కమిన్స్, జేమ్స్ ప్యాటిన్సన్, సీన్ అబాట్, మిచెల్ నేసర్ లాంటి అద్భుతమైన బౌలర్లు మా టీమ్‌‌లో ఉన్నారు’ అని లాంగర్ పేర్కొన్నాడు.

Latest Updates