కూతుళ్ల చదువుకోసం ఆరాటం..రోజు 12కిలోమీటర్లు తీసుకెళుతున్న తండ్రి

అతను చదువుకోక కూలిగా మారాడు. అందుకే అలాంటి పరిస్థితి తన ముగ్గురు కూతుళ్లకు రాకూడదనుకున్నాడు.  రోజూ12 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్​కు బైక్​పై తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు. ఆ తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఎవరో సోషల్​ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వార్త కాస్త వైరలైంది. నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

అమ్మాయిలు చదువుకోవాలంటే పోరాటమే

పాకిస్తాన్​లాగే అఫ్ఘానిస్థాన్​లో అమ్మాయిలకు సరైన ఎడ్యుకేషన్​అందించడం కష్టం. ఆడ పిల్లల పేరెంట్స్​ను ఎడ్యుకేట్​ చేసేందుకు, చదువు వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పేందుకు ఎన్జీవోలు ఏండ్లుగా కష్టపడుతున్నాయి. కానీ ఫలితాలేమో అంతంతే ఉంటున్నాయి. కొన్ని చోట్ల స్కూలు బిల్డింగ్​లు ఉన్నా క్లాసులకు వచ్చే ఆడపిల్లలకు పాఠాలు చెప్పడానికి మహిళా టీచర్లు ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పక్టికా ప్రావిన్స్​కు చెందిన మియా ఖాన్ ఓ మార్పుకు అడుగువేశాడు. అడ్డంకులను అధిగమించి తన ముగ్గురు కూతుళ్లను స్కూలుకు పంపుతున్నాడు. రోజూ 12 కిలోమీటర్ల దూరంలోని స్కూల్​కు తీసుకెళ్తున్నాడు. క్లాసులు పూర్తయ్యే వరకూ ఉండి తీసుకొస్తున్నాడు.

డాక్టర్లను చేయాలని..

కూతుళ్లకు మంచి చదువు చెప్పించాలని, వారిని డాక్టర్లను చేయాలనేది మియాఖాన్​ కల. ఎందుకంటే పక్టికా ప్రావిన్స్​లోనే అసలు లేడీ డాక్టర్​లేరు. అందుకే తన కూతుళ్లను డాక్టర్లను చేయాలని నిర్ణయించుకున్నాడు. తన డెడికేషన్, విజన్​కు తోడు తన కూతుళ్లపై అతనికి కొండంత నమ్మకం. ‘‘నేను చదువుకోలేదు. రోజు కూలీగా బతుకున్నాను. కానీ నా కూతుళ్ల చదువు మాత్రం నాకు చాలా విలువైనది. ఎందుకంటే మా ఏరియాలో లేడీ డాక్టరే లేరు. అందుకే వారిని డాక్టర్లను చేయాలనుకుంటున్నా. నా కుమారుల మాదిరిగానే కూతుళ్లకూ ఎడ్యుకేషన్​ అందించాలనేది నా కోరిక”అని మియాఖాన్​ చెప్పాడు.

సోషల్​ మీడియా ఫిదా

ప్రస్తుతం అతని ముగ్గురు ఆడపిల్లలు నూరానియా గర్ల్స్​ స్కూల్​లో చదువుతున్నారు. ‘‘నేను చదువుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది నేనే గ్రేడ్​ 6 చదువుతున్నా. మా నాన్న లేదా మా అన్న రోజు మోటార్​సైకిల్​పై మమ్మల్ని స్కూలుకు తీసుకొస్తారు. స్కూల్​ అయిపోయాక వాళ్లే మమ్మల్ని తీసుకెళ్తారు”అని మియా కుమార్తె రోజీ చెప్పింది. వుమెన్​ ఎంపవర్​మెంట్​ ఇంటి నుంచే మొదలవ్వాలని, మియా లాంటి తండ్రి దొరకడం అతని కూతుళ్లకు దక్కిన అదృష్టం  అన్నారు. అఫ్ఘాన్​లని ప్రతికూల పరిస్థితుల కారణంగా స్కూళ్లలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో మియాఖాన్​ చూపిస్తున్న పట్టుదల మిగతా తండ్రుల్లోనూ మార్పు తెస్తుందని చాలా మంది నమ్ముతున్నారు.

 

 

Latest Updates