రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతున్నయ్!

 

ముంబై: ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు దిగొస్తున్నాయి. లాక్‌‌డౌన్ కారణంగా డెవలపర్లకు డబ్బు సమస్యలు ఎక్కువ కావడంతో ధరలను తగ్గిస్తున్నారు. ఈ నగరంలో ఇల్లు కొనాలనుకునే వారికి ఇదే అనువైన సమయమని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఎక్స్‌‌పర్టులు అంటున్నారు. డబ్బులు లేట్‌‌గా చెల్లిస్తామన్నా కూడా డెవలపర్లు ఒప్పుకుంటున్నారు. సమాన వాయిదాలకూ ఓకే చెబుతున్నారు. ఇంట్లో దిగేంత వరకు చెల్లింపులపై వడ్డీలు మాఫీ చేస్తామని హామీ  ఇస్తున్నారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ ఐఎల్ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌లో క్రైసిస్ మొదలైన తరువాత రియల్టీ కంపెనీలకు లోన్లు దొరకడం కష్టంగా మారింది. అంతేగాక అమ్ముడుపోని ప్రాజెక్టులు పేరుకుపోయాయి. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దెబ్బతిన్నది.అయినప్పటికీ ఈ రంగానికి సాయం అందించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ధరలు తగ్గించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

డిస్కౌంట్లకు రెడీ..

ఈ విషయమై సేవిల్స్ ఇండియా ఎండీ భవిన్ ఠక్కర్ మాట్లాడుతూ.. కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వారికి డిస్కౌంట్లు ఇవ్వడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలపర్లు, సెల్లర్లు రెడీగా ఉన్నారని చెప్పారు. మిడ్‌‌ రేంజ్ సెగ్మెంట్‌‌లోని ఇండ్లపై 15 శాతం వరకు తగ్గిస్తున్నారని, కొందరు మాడ్యులర్ కిచెన్స్ లేదా కార్ లేదా ఫర్నిచర్ వంటి వాటిని ఉచితంగా ఇస్తున్నారని వివరించారు. లగ్జరీ అపార్ట్‌‌మెంట్లపై అయితే డిస్కౌంట్లు 35 శాతం వరకు ఉన్నాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ముంబైలోని దాదాపు 70 శాతం ప్రాజెక్టుల ధరలు తగ్గాయని ప్రాప్‌‌స్టక్ స్టడీ తెలిపింది. సెకండరీ మార్కెట్లోనూ తక్కువ ధరలకే ఆస్తులు అందుబాటులో ఉన్నాయని మరో స్టడీ వెల్లడించింది. ముంబైతోపాటు ఢిల్లీలోనూ రేట్లు తగ్గాయని పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని డెవలపర్లు అంటున్నారు.

అయితే ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్ వంటి ఒకటి రెండు కంపెనీలు మాత్రం ధరలు తగ్గించడం లేదు. ఈ విషయమై కంపెనీ సీఎండీ వికాస్ ఒబెరాయ్ మాట్లాడుతూ ముంబైలో కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయని, లేబర్ కొరత వల్ల ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని వివరించారు.  చెల్లింపుల విషయంలో మాత్రం కస్టమర్లతో కఠినంగా వ్యవహరించడం లేదని, ఈఎంఐ వంటి ఆఫర్లు ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 25 శాతం మొత్తం తీసుకొని, గృహప్రవేశ సమయంలో మిగతా మొత్తం కట్టాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు.  ఒబెరాయ్ మాదిరిగా అన్ని రియల్టీ కంపెనీల దగ్గర డబ్బు లేదని, అవి ధరలు తగ్గించకతప్పదని ప్రాపర్టీ ఎనలిస్టులు అంటున్నారు. చిన్న డెవలపర్లు కచ్చితంగా డిస్కౌంట్లు ఇస్తామని స్పష్టం చేశారు.

Latest Updates