అమేథీ లో రాహుల్‌ ఓటమికి కారణం?

అమేథీ… గాంధీ కుటుంబానికి 40 ఏళ్లుగా  అనుబంధమున్న నియోజకవర్గం.. అక్కడివారికి పార్టీ, పాలనతో పనిలేదు.  జస్ట్‌‌ గాంధీ కుటుంబాన్ని నమ్ముతారంతే. గెలిచాక ఐదేళ్లలో ఒక్కసారీ కన్నెత్తి చూడకపోయినా, ఎలక్షన్ల నాడు  కనిపిస్తే చాలు లక్షల మెజార్టీతో పట్టంకడతారు.   ఇదంతా గతం.. ఇప్పుడు అదంతా  తారుమారయింది.  జనం ఒక్కసారిగా ఎందుకు ముఖం చాటేశారు?.  ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ చీఫ్‌‌ గెలిస్తే ప్రధానే కదా?  అయినా ఎందుకు పట్టుబట్టి మరీ ప్రజలు ఆయనను ఓడించారు. 15 ఏళ్లుగా రాహుల్‌‌  ఈ నియోజకవర్గానికి  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నాలుగోసారి మాత్రం  జనం  ఆయనకు ‘సారీ’ చెప్పేశారు. ఇన్నాళ్లు ఏ పార్టీ అమేథీపై గట్టిగా ఫోకస్‌‌ చేయలేదు. ఫలితాన్ని ముందే ఊహించి ఓ నిర్ణయానికొచ్చి వదిలేశాయి. బీజేపీ మాత్రం గెలుపు మార్గాలను  వెదికింది. కాంగ్రెస్‌‌కు ఆ ప్రాంతంతో ఏళ్లనాటి అనుబంధం ఉన్నా.. సంస్థాగత నెట్‌‌వర్క్‌‌ బలహీనంగా ఉండడాన్ని గుర్తించింది. గ్రామీణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధాలు తగ్గిపోతుండడాన్నీ పసిగట్టింది. ఈ రెండింటినీ గ్రహించిన బీజేపీకి ఫోకస్‌‌ చేయాల్సిన అంశాలపై క్లారిటీ వచ్చింది.

ప్రచారంలోనూ తేడానే

రాహుల్‌‌ గాంధీతోపాటు ఆయన తరఫున నియోజకవర్గంలో పనిచేసిన నేతలెవరూ గ్రామీణులతో  మంచి సంబంధాలు కొనసాగించలేకపోయారన్న వార్తలు  వచ్చాయి.  ఈసారి ప్రచారంలోనూ తేడా కన్పించింది. రాహుల్‌‌ పర్యటనలన్నీ ఓ స్థాయి పట్టణాలకు,  మెయిన్‌‌ రోడ్లకు , కూడళ్లకే పరిమితమయ్యాయి. స్మృతీ పర్యటనలన్నీ ఎక్కువ పల్లెల చుట్టే తిరిగాయి. ఇంటింటికి వెళ్లి ఆమె ఓట్లడిగారు. పలకరింపులోనూ ఆమె  ఆప్యాయతను ప్రదర్శించారు. కచ్చితంగా మోడీనే గెలవబోతున్నారని, అభివృద్ధి, సంక్షేమానికి ఓటెయ్యాలని కోరారు. ఇవన్నీ ఓటింగ్‌‌పై స్పష్టమైన ప్రభావం చూపాయి.  ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా.. ఆమె కూడా ప్రత్యేకత చూపలేకపోయారని  స్థానికులు అంటున్నారు. ‘కేవలం చేతులూపుకుంటూ ఓ పెద్ద వాహనంలో కనీకన్పించకుండా ప్రచారం చేసి వెళ్లిపోయారు.’ అని  స్థానికుడొకరు చెప్పారు.  ‘కొత్త జనరేషన్‌‌ ఈ సారి కాంగ్రెస్‌‌కు ఓటెయ్యలేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వారితో బీజేపీ ఓట్లు వేయించుకుంది. ప్రత్యేకంగా స్కీములు పెట్టి మరీ వారిని ఆకర్షించారు’ అని ఓ కాంగ్రెస్‌‌ అభిమాని యూత్‌‌ ఓటింగ్‌‌పై వివరించాడు.

గత అసెంబ్లీ ఎన్నికలతోనే పతనం…

2017 అసెంబ్లీ ఎన్నికల నుంచే ఇక్కడ కాంగ్రెస్‌‌ పార్టీ పతనం ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు. అమేథీ లోక్‌‌సభ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నాలుగు సీట్లలో విజయం సాధించగా, సమాజ్‌‌వాదీ పార్టీ ఒక సీటును దక్కించుకుందు. కాంగ్రెస్‌‌ సింగిల్‌‌ సీటు కూడా దక్కించుకోకపోవడంతోనే క్యాడర్‌‌లో ఆత్మవిశ్వాసం కోల్పోయిందని చెబుతున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేవలం ఒక్క సీటుకే కాంగ్రెస్‌‌ పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

స్థానికులు ఏమంటున్నారు?

‘రాహుల్‌‌ గాంధీ ఫర్సాట్‌‌గంజ్‌‌ ఎయిర్‌‌పోర్టులో దిగేవారు. కారులో నేరుగా అమేథీ వెళ్లేవారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ పరిస్థితిపై చర్చించేవారు. ప్రజలకు మాత్రం తగినంత సమయం కేటాయించలేదు. ఓట్లెలా వేస్తారు?’ అని నీల్‌‌సింగ్‌‌ అనే హోల్‌‌సేల్‌‌ వ్యాపారి రాహుల్‌‌ ఓటమిపై మాట్లాడారు. ‘అమేథీలో ఆయన ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్లు వల్లే ఓడిపోయారు. వాళ్లు ప్రజలకు, రాహుల్‌‌కు మధ్య ఉండి ఈ పరిస్థితి తీసుకొచ్చారు. కేవలం ఎంపీ ఆఫీస్‌‌లో కూర్చుని.. వచ్చిన వాళ్లనే కలిసేవారు. ఏ సమస్యనూ పట్టించుకోలేదు. ప్రజలను రాహుల్‌‌ నేరుగా కలుస్తూ ఉండిఉంటే గెలిచేవారు.’ అని సలోన్‌‌ సిటీ  బస్టాండ్‌‌లో టీ అమ్ముకునే రాజు చెప్పాడు.

ఇదేం రాకెట్‌‌ సైన్స్‌‌ కాదు: స్మృతీ ఇరానీ

‘నా గెలుపులోని సీక్రెట్‌‌ రాకెట్‌‌ సైన్సేమీ  కాదు. వచ్చే ఐదేళ్లు ఎవరు దగ్గరుండి వాళ్ల పనులు చేసిపెడతారో ప్రజలు గ్రహించారు. అందుకే బీజేపీని ఆదరించారు. ఇక్కడి ప్రజలకు మామీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’ అని స్మృతీ ఇరానీ తన గెలుపుపై స్పందించారు.

స్మృతీ ‘ఆపరేషన్‌‌ అమేథీ’…

రాహుల్‌‌పై  గెలిచిన బీజేపీ సీనియర్‌‌ నేత స్మృతీ ఇరానీ ఏదో రెండు మూడు వేల మెజార్టీతో బయటపడలేదు. ఏకంగా 55 వేలపైగా బంపర్‌‌ మెజార్జీతో దూసుకుపోయారు. ఢిల్లీ వర్గాల విశ్లేషణ ప్రకారం.. స్మృతీది ఎలక్షన్లకు రెండుమూడు నెలల ముందటి ప్లాన్‌‌ కాదట. ఓడినా ఐదేళ్లుగా ఇక్కడి ప్రజలతో ఆమె మమేకమయారు. 2014 ఎన్నికల్లోనూ ఆమె అమేథీలో రాహుల్‌‌తో తలపడ్డారు.  ఆ ఎన్నికల్లో లక్షా ఏడు వేల పైచిలుకు ఓట్ల తేడాతో  ఓడిపోయారు. కేంద్రంలో  బీజేపీ అధికారంలో ఉండడంతో లోక్‌‌సభ స్థానం పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓ వైపు అభివృద్ధి చేస్తూనే స్థానిక నేతలతో కలిసి పనిచేశారు. క్యాడర్‌‌ను పటిష్ట పరుచుకున్నారు. ప్రజలకు ఆమె ఫోన్‌‌ కాల్‌‌ దూరంలోనే  ఉంటారన్న పేరుతెచ్చుకున్నారు. స్కూల్స్‌‌, కృషి విజ్ఞాన్‌‌ కేంద్రాలను బలోపేతం చేశారు. రైతులకు టెక్నాలజీని పరిచయంచేశారు.  మోడర్న్‌‌  పరికరాలతో భూసార పరీక్షలు చేయించారు. ఇలా స్మృతి  అన్ని వర్గాలకూ దగ్గరయ్యారు. మహిళా గ్రూపులను బలోపేతం చేస్తూ  వాళ్లకు ఉపాధి మార్గం చూపారు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ఆమె గెలుపుకు సాయపడ్డాయి.

Latest Updates