ఫండ్ రైజింగ్ లో ఐదేళ్ల  వికలాంగ బాలుడి రికార్డు

500 పౌండ్లు టార్గెట్ పెట్టుకుంటే.. ఏకంగా ఒకటిన్నర మిలియన్ పౌండ్లు వసూల్ 

ప్రాణంపోసిన ఆస్పత్రి రుణం తీర్చుకున్న టోనీ హడ్గెల్

బుడతడి సాహసానికి.. ప్రోత్సహించిన వారికి జనం ఫిదా

అయిదేళ్ల వయసులో సాయం అంటే ఏమిటో తెలియదు. కానీ, ఆ పసి వయసులోనే టోనీ హడ్గెల్ పెద్ద మనసు చాటుకున్నాడు. తన ప్రాణాలు నిలబెట్టి మరుజన్మ ఇచ్చిన హాస్పిటల్ రుణం తీర్చుకున్నాడు. రెండు కాళ్లు లేని ఆ చిన్నారి దాదాపు పది కిలోమీటర్లు నడిచి.. ఫండ్ రైజింగ్ ద్వారా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

టోనీ హడ్గెల్.. 2016లో పుట్టిన కొన్ని రోజులకే పేరెంట్స్ చేతిలో చిత్రహింసలు అనుభవించాడు. నెల రోజుల పసికందని కూడా చూడకుండా వేధించింది ఆ జంట. ఒకరోజు బాగా టార్చర్ చేయడంతో కాళ్లు విరిగిపోయి, రక్తస్రావం జరిగి ఆ బిడ్డ అల్లలాడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు అతన్ని ఎవెలినా చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చేర్పించారు.ఎలాగైతేనేం మొత్తానికి చావుబతుకుల నుంచి బయటపడ్డాడు టోనీ. కానీ, కాళ్లు  నుజ్జు కావడంతో నడవలేని స్టేజ్ లో ఉండిపోయాడు. ఆ టైంలో టోనీ వయసు కేవలం 45 రోజులు. ఆ పసికందు గురించి తెలుసుకున్న పౌలా, మార్క్ లు అతన్ని దత్తత తీసుకున్నా రు. అప్పటి నుంచి టోనీ వాళ్ల దగ్గరే ఉంటున్నాడు.

ఛాన్స్ దొరికింది నాలుగేళ్ల తర్వాత తనకు ప్రాణం పోసిన ఎవెలినా హాస్పిటల్ కి ఏదైనా చేయాలనుకున్నా డు. ప్రోస్తటిక్ కాళ్లు ఉన్నప్పటికీ ఆ చిన్నారి ఏనాడూ నడిచింది లేదు. అందుకే క్రచ్చర్స్ సాయంతో నడక మొదలుపెట్టాడు. ముప్ఫై రోజుల్లో పది కిలోమీటర్ల నడక టార్గెట్ గా పెట్టుకున్నా డు. ఛారిటీ ద్వారా ఆ వచ్చిన సొమ్మును ఎవెలినా హాస్పిటల్ కి ఇవ్వాలన్నది అతని టార్గెట్. నైరుతి ఇంగ్లాం డ్ వెస్ట్ మాలింగ్ లోని ఇంటి నుంచి అతని నడక మొదలైంది. నెల రోజుల్లో మొత్తం 9.3 కిలోమీటర్లు నడిచాడు టోనీ. పక్కనే ఉండి అతన్ని ఎంకరేజ్ చేసింది తల్లి పౌలా. మాగ్జిమమ్ ఐదు వందల పౌండ్స్ దాకా వస్తాయనుకున్నా రు. కానీ, ఆశ్చర్యంగా ఒకటిన్నర మిలియన్ పౌండ్లకు పైగా వచ్చాయి. ఆ చిన్నారి వచ్చిన సొమ్ము మొత్తాన్ని ఎవెలినా హాస్పిటల్ కి డొనేట్ చేశాడు. ‘‘అంతదూరం నడవడేమో అనుకున్నాం . కానీ, నా బిడ్డ ఆశయం ముందు వైకల్యం ఓడిపోయింది’’ అని గర్వంగా చెబుతోంది పౌలా. ఛారిటీ కోసం ఒక చిన్నారి ఇంత పెద్ద మొత్తంలో ఫండ్ కలెక్ట్ చేయడం ఇదే రికార్డట. ఇంతకీ ఈ ఫీట్ కోసం టోనీకి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ కోసం 40 మిలియన్ పౌండ్స్ వసూలు చేసిన వందేళ్ల వార్ వారియర్ కెప్టెన్ టామ్ మూర్.

 

Latest Updates