60 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా పుంజుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా రిక‌వ‌రీ రేటు 60 శాతాన్ని దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా 20,033 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శుక్ర‌వారం కేంద్ర ఆరోగ్య శాఖ‌ దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితుల‌పై వివ‌రించింది. టెస్ట్, ట్రేస్‌, ట్రీట్ అనే విధానంలో క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య భారీగా పెంచి.. వైర‌స్ సోకిన వారిని ముందుగా గుర్తించ‌డం ద్వారా వేగంగా కోలుకుంటున్నార‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 6,25,544 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. 3,79,891 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో క‌రోనా రిక‌వ‌రీ రేటు 60.73 శాతానికి చేరింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 2,27,439 మంది క‌రోనాతో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం దేశంలో చికిత్స పొందుతున్న వారి క‌న్నా కోలుకున్న వారు 1,52,452 మంది అధికంగా ఉన్నారు.

24 గంట‌ల్లో సుమారు రెండున్న ల‌క్ష‌ల టెస్టులు

దేశంలో క‌రోనా టెస్టుల సామ‌ర్థ్యం కూడా భారీగా పెరిగింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1074 ల్యాబ్స్‌లో క‌రోనా టెస్టులు జ‌రుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లోనే సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల శాంపిల్స్ ప‌రీక్షించారు. దేశంలోని అన్ని ల్యాబ్స్‌లో క‌లిపి 2,41,576 శాంపిల్స్ టెస్టు చేయ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా ప‌రీక్షించిన శాంపిల్స్ సంఖ్య 92,97,749కి చేరింది.

 

Latest Updates