కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్ లో రెడ్ అలర్ట్

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పది మంది ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్​రావడంతోపాటు వారి నుంచి సిటీలో ఒకరికి  సోకడంతో ఆఫీసర్లు రెడ్​అలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియన్లు తిరిగిన ముకరంపుర, కశ్మీరగడ్డ, భగత్ నగర్  ఏరియాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో జనాలెవరూ ఇండ్లు దాటి బయటకురాకుండా చూస్తున్నారు. ఉదయం ఇంటింటికీ ఫ్రీగా పాలు, కూరగాయలను పంపిణీ చేయించారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ఓ ప్రైవేట్​ మెడికల్​ కాలేజీలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స​అందిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన సుమారు 400 మందిని హోం క్వారంటైన్​ చేసి, పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడుపుతున్నారు. ఆదివారం తో పోలిస్తే.. సోమవారం చాలా తక్కువ మంది బయటకు వచ్చారు.

రెడ్ జోన్లు..

ఇండోనేషియన్లు సంచరించిన ముకరంపుర, కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గడ్డ ప్రాంతాలను కలెక్టర్​ శశాంక రెడ్​జోన్లుగా ప్రకటించారు. దాని చుట్టూ ఉన్న భగత్ నగర్, స్టేడియం రోడ్ ప్రాంతాల్లోనూ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 11 కేసులు పాజిటివ్‌‌‌‌‌‌‌‌తోపాటు.. చెల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో సుమారుగా 55 మంది, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 13 మంది ఐసోలేషన్ వార్డుల్లో పరిశీలనలో ఉన్నారు. సుమారుగా 70 మంది వరకు ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉండడం.. విదేశాల నుంచి వచ్చిన వారు 375 మంది ఇంటికే పరిమితం కావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల వారు బయటకు రాకుండా.. వెలుపలి వారు లోనికి పోకుండా కట్టుదిట్టబమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిమ మల్టీప్లెక్స్ నుంచి మొదలుకుని ట్రినిటీ కాలేజీ వరకు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. రెడ్ జోన్ ఏరియాల్లోనూ కదలికలు లేకుండా… ప్రతి గల్లీలోనూ బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

ఇంటికే కూరగాయలు

రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో వారికి నిత్యవసర సరుకులు, కూరగాయలను మంగళవారం ప్రభుత్వమే పంపిణీ చేసింది. కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. నగరపాలక సంస్థ, మార్కెటింగ్ శాఖల సహకారంతో రైతు బజార్ లో కూరగాయలు కొనుగోలు చేసి.. బాడీ నిండా మాస్కులు ధరించిన సిబ్బంది ఆటోల్లో తిరుగుతూ ఇంటింటికీ ఇచ్చారు. ఒక్కో ఇంటికి నాలుగైదు రకాల కూరగాయలు కలిపి ఆరు కిలోలు పంపిణీ చేశారు. 52,53, 60 డివిజన్ల పరిధిలోని ముకరాంపుర ఏరియాలో 4 వేల కూరగాయల బ్యాగులను అందించారు. మూడు రోజులకు సరిపడా పంపిణీ చేశామని.. తరువాత మరోమారు పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు.

డ్రోన్ తో స్ప్రే

కరోన వైరస్‌‌‌‌‌‌‌‌ను అరికట్టేందుకు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తోంది. యంత్రాలు, ట్రాక్టర్లు, డ్రోన్‌‌‌‌‌‌‌‌లు, పవర్ స్ప్రే పంపుల ద్వారా పిచికారీ చేయించారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి,  మార్కెట్లు, టవర్ సర్కిల్‌‌‌‌‌‌‌‌తోపాటు రెడ్ జోన్ ప్రాంతంలోనూ పైపో క్లోరైడ్ లిక్విడ్‌‌‌‌‌‌‌‌ను కలిపి స్ప్రే చేయించారు. 40 డివిజన్లలో లిక్విడ్ ను స్ప్రే చేశారు. ప్రతీ డివిజన్‌‌‌‌‌‌‌‌లో బ్లీచింగ్, సున్నం బస్తాలను పంపిణీ చేశారు. నగర ప్రజలు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ క్రాంతి, మేయర్ సునీల్ రావు  కోరారు.

జిల్లా దిగ్బంధం

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే రెడ్ జోన్‌‌‌‌‌‌‌‌లుగా ప్రకటించారు. జిల్లాలోకి కొత్తవారు ఎంటర్ కాకుండా పోలీసులు బార్డర్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నగరంలో కూడా ఎవరూ రోడ్ల మీదకు రాకుండా కట్టుదిట్టంగా రూల్స్​అమలు చేస్తున్నారు. కాదు కూడదని ఎవరైనా రోడ్ల మీదకు వస్తే లాఠీలకు పనిచెబుతున్నారు.

Latest Updates