బిగ్ స్క్రీన్స్ లోనే ‘రెడ్’ రిలీజ్: రామ్

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న రెడ్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. మాస్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ ఫిల్మ్ పై ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసుకున్న రెడ్ ను థియేటర్స్ లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ గులాబో సితాబోతోపాటు కీర్తి సురేష్ లీడ్ రోల్ లో వస్తున్న మల్టీ లింగువల్ మూవీ పెంగ్విన్ కూడా రిలీజ్ కానున్నాయి. అలాగే మరో ఐదు చిత్రాలు కూడా ప్రైమ్ లోనే విడుదల కానున్నాయి. దీంతో రెడ్ మూవీ కూడా డిజిటల్ రిలీజ్ కానుందని పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తలకు రామ్ చెక్ పెట్టాడు. శుక్రవారం 32వ బర్త్ డే జరుపుకున్న పోతినేని వారి ఇస్మార్ట్ అబ్బాయి రెడ్ రిలీజ్ పై స్పష్టతనిచ్చాడు.

‘కొన్ని ఓటీటీ ప్లాట్​ఫామ్స్ నుంచి మంచి ధరలకు సినిమాను అమ్మాల్సిందిగా మాకు ఆఫర్స్ వచ్చాయి. అయితే మేం వారి ఆఫర్లను తిరస్కరించాం. ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ వాచింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. సీటులో ఉత్కంఠగా కూర్చోబెట్టే సినిమా రెడ్. ఉత్సుకత కలిగించే ఇన్వెస్టిగేషన్స్ నేపథ్యంలో మాస్ అంశాల మిళితంగా ఈ మూవీని తెరకెక్కించాం. ఈ మూవీని పెద్ద స్క్రీన్స్ లోనే చూడాలి. అందుకోసమే తీశాం కూడా. పరిస్థితులు అదుపులోకి వచ్చే దాకా ఎదురుచూస్తాం. అప్పుడే సినిమాను విడుదల చేస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో రామ్ క్లారిటీ ఇచ్చాడు. స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ దొరికితే పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధమేనని రామ్ తెలిపాడు.

Latest Updates