సివిల్ సర్వీసుల కుదింపు

  • 60 నుంచి మూడు లేదా నాలుగుకు తగ్గించే యోచన
  • ఐదేళ్ల విజన్ డాక్యుమెంటులో పేర్కొన్న డీఓపీటీ
  • గతేడాదే ప్రతిపాదించిన నీతి ఆయోగ్
  • త్వరలో అమలు చేయాలని భావిస్తున్న మోడీ సర్కారు

దేశ పరిపాలన వ్యవస్థలో కీలకమైన సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు నరేంద్ర మోడీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. మొత్తం 60కి పైగా ఉన్న సివిల్ సర్వీసులను మూడు లేదా నాలుగింటికి కుదించేందుకు ప్రణాళిక రచిస్తోంది. పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు వచ్చే ఐదేళ్లలో ఓ క్రమపద్ధతిలో సివిల్ సర్వీసులను కుదించాలని డిపార్టుమెంట్‌ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) తన విజనరీ డాక్యుమెంటులో పేర్కొంది. దీని అర్థం.. ఉన్న సర్వీసులను మూడు లేదా నాలుగు కుదించడమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని డీవోపీటీ పెద్దాఫీసరు ఒకరు తెలిపారు. ఈ ఐడియా నీతి ఆయోగ్ దేనని వెల్లడించారు. గతేడాదే ఆయోగ్ ఈ ప్రతిపాదన చేసిందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 60 రకాల సివిల్ సర్వీసులు ఉన్నాయి. వీటిని గ్రూపు ఏ, గ్రూపు బీగా విభజించారు. గ్రూపు ఏలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ కలిపి మొత్తం 25 సర్వీసులున్నాయి.

ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

సర్వీసులను ఎలా కుదించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీటన్నింటినీ మూడు గ్రూపులుగా విడగొట్టడమే సర్కారు ముందున్న ఒకే ఒక్కదారి అని డీవోపీటీ ఆఫీసర్ పేర్కొన్నారు. నాన్ టెక్నికల్ సర్వీసులు, టెక్నికల్ సర్వీసులు, సెక్యూరిటీ సంబంధిత సర్వీసులు అనే పేర్లు ఆఫీసర్ల మధ్య బాగా చర్చకు వస్తున్నట్లు వెల్లడించారు. నాన్ టెక్నికల్ అంటే ఐఏఎస్ తరహా, సెక్యూరిటీ సర్వీసులు అంటే ఐపీఎస్ తరహా అని పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ ఏం చెప్పింది?

‘స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా@75’ పేరుతో నీతి ఆయోగ్ గతేడాది ఓ డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది. అందులో సివిల్ సర్వీసులను తగ్గించాలని, ఒకే పరీక్ష పెట్టి, ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వాలని అందులో పేర్కొంది. అలా ఎంపిక చేసిన వారిని సెంట్రల్ టాలెంట్ పూల్ లోకి తీసుకుని, అర్హతల ప్రకారం పోస్టులివ్వాలని చెప్పింది. దీని ప్రకారమే ‘వన్ నేషన్, వన్ ఎగ్జామ్’ అనే పాలసీని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా పరిశీలిస్తోందని డీవోపీటీ ఆఫీసర్ వెల్లడించారు.

ఇతర సంస్కరణలు

డీవోపీటీ ప్రతిపాదనల్లో నేషనల్ రిక్రూట్ మెంట్ అథారిటీ(ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీంతో నాన్ గెజిటెడ్ గ్రూపు బీ, గ్రూపు సీ పోస్టులను భర్తీ చేయించాలి. ఈ పోస్టులన్నింటికీ ఎన్ఆర్ఏ ఒకే ఒక్క ఎగ్జామ్ పెడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.5 లక్షల గ్రూపు బీ, గ్రూపు సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా.

Latest Updates