రాష్ట్రంలో తగ్గుతున్న విదేశీ స్టూడెంట్స్

  •                 రాష్ట్రంలో ఏటా పడిపోతున్న ఫారిన్ స్టూడెంట్స్ సంఖ్య
  •                 2016–17లో 3 వేల మంది, ఇప్పుడు 2 వేల మందే
  •                 ఓయూలో తగ్గుదల.. జేఎన్టీయూలో పెరిగిన అడ్మిషన్లు

రాష్ట్రంలో చదువుకునేందుకు వచ్చే ఫారిన్ స్టూడెంట్స్ సంఖ్య ఏటా తగ్గిపోతోంది. పలు రాష్ట్రాల్లో విదేశీ స్టూడెంట్ల అడ్మిషన్లు పెరుగుతుండగా, తెలంగాణలో తగ్గుతున్నాయి. పీహెచ్​డీ, పీజీ, డిగ్రీ.. ఇలా అన్ని విభాగాల్లో ఇదే స్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు ఫారిన్ స్టూడెంట్స్​కు కేరాఫ్​గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలోనూ అడ్మిషన్లు భారీగా పడిపోయాయి. జేఎన్టీయూలో మాత్రం వీరి సంఖ్య కాస్త పెరిగింది.

60 దేశాల నుంచి స్టూడెంట్లు

రాష్ట్రంలో సుమారు 60 దేశాలకు చెందిన స్టూడెంట్లు చదువుతున్నారు. 2018–19 లెక్కల ప్రకారం స్టేట్​లో మొత్తం 2,020 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకప్పుడు పీజీ, పీహెచ్​డీ కోర్సుల కోసం వచ్చేవారు. ప్రస్తుతం డిగ్రీ కోర్సుల్లోనూ ఫారిన్ స్టూడెంట్స్​చేరుతున్నారు. ప్రస్తుతం చదువుతున్న వారిలో 1,456 మంది అబ్బాయిలు, 564 మంది అమ్మాయిలు. వీరిలో గ్రాడ్యుయేట్​కోర్సుల్లో 1,595 మంది, పీహెచ్​డీ స్టూడెంట్స్15 మంది, ఇంటిగ్రేటెడ్​కోర్సుల్లో 83 మంది, పీజీలో 294 మంది, పీజీ డిప్లొమాలో ఏడుగురు, డిప్లొమాలో 26 మంది చేరారు. డిగ్రీ కోర్సుల్లో బీటెక్, బీబీఏ కోర్సుల్లో ఎక్కువ మంది చేరారు. అయితే అడ్మిషన్లలో ఎక్కువ మందికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) స్పాన్సర్ చేస్తోంది. కొంతకాలంగా ఈ స్పాన్సర్షిప్​కోటా తగ్గడంతోనూ అడ్మిషన్లు తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు.

ఏటా తగ్గుతున్న సంఖ్య

2015–16లో 3,032 మంది ఫారిన్​ స్టూడెంట్స్​చేరితే, వారిలో అమ్మాయిలు 792 మంది, అబ్బాయిలు 2240 మంది. వీరిలో పీహెచ్​డీ స్టూడెంట్స్ 57 మంది, డిగ్రీ స్టూడెంట్స్ 2,596 మంది, డిప్లొమా, పీజీ డిప్లొమా స్టూడెంట్స్​55 మంది, ఇంటిగ్రేటెడ్ కోర్సు 23 మంది, పీజీ 258 మంది, ఎంఫిల్ కోర్సులో ఒక్కరు చేరారు. 2018–19 నాటికి అడ్మిషన్ల సంఖ్య 2020కి తగ్గింది. 2015–16లో 31 రాష్ట్రాల్లో కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​ తర్వాత ఐదో స్థానంలో తెలంగాణ ఉంది. కానీ 2018–19 లో 33 స్టేట్స్​లో తెలంగాణ 8వ స్థానానికి పడిపోయింది.

ఓయూలో భారీగా తగ్గారు

ఒకప్పుడు ఓయూలో మూడు వేలకుపైగా విదేశీ స్టూడెంట్లు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య భారీగా తగ్గింది. 2016–2017లో 82 దేశాల నుంచి 1,666 మంది ఓయూలో చేరితే, ప్రస్తుతం 51 దేశాల నుంచి 413 మందే చేరారు. 2017–18లో 1,141 మంది, 2018–19లో 450 మంది ఓయూ పరిధిలోని కాలేజీల్లో చేరారు. జేఎన్​టీయూలో మాత్రం ఫారిన్​ స్టూడెంట్లు పెరిగారు. 2016–17లో 34 మంది చేరితే, ప్రస్తుతం36 దేశాల నుంచి 248 మంది చదువుతున్నారు. ఇఫ్లూలో 130 వరకూ, హెచ్​సీయూలో 60 మంది వరకూ ఫారిన్ స్టూడెంట్స్​ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా నేపాల్, యూఎస్ఏ, అఫ్ఘనిస్తాన్, నైజీరియా తదితర దేశాలకు చెందిన వారే ఎక్కువగా చదువుతున్నారు.

దేశంలో 49 వేల మంది ఫారిన్ స్టూడెంట్స్

మనదేశంలో 164 దేశాలకు చెందిన స్టూడెంట్స్​ చదువుతున్నారు. దాదాపు 7 లక్షల మంది ఇండియన్​ స్టూడెంట్స్​ బయటి దేశాల్లో చదివితే, ఫారిన్​ నుంచి వచ్చి మన దేశంలో చదువుతున్న వారి సంఖ్య 49 వేలు. 2018–19లో 47,427 మంది చేరితే, వారిలో 32,398 మంది అబ్బాయిలు,15,029 మంది అమ్మాయిలు. ఫారిన్ స్టూడెంట్స్​లో పది దేశాల వారే 63.7 శాతం. అత్యధికంగా నేపాల్(26.88%), అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సుడాన్, భూటాన్​, నైజీరియా, యూఎస్ఏ, యెమెన్, శ్రీలంక, ఇరాన్​కు చెందిన వారున్నారు. డిగ్రీ కోర్సుల్లో 34,830 మంది, సర్టిఫికెట్ కోర్సుల్లో 493 మంది, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 619 మంది, పీహెచ్​డీలో 1,570 మంది, ఎంఫిల్​లో 66 మంది, పీజీలో 7,661 మంది, పీజీ డిప్లొమాలో 73 మంది, డిప్లొమాలో 2,115 మంది చేరారు. ఫారిన్​ స్టూడెంట్స్​ ను రప్పించేందుకు స్టడీ ఇండియా పేరుతో కేంద్రం ఓ కార్యక్రమం ప్రారంభించింది. దీంతో స్టూడెంట్స్​ సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

నిబంధనల వల్లే తగ్గిన్రు

రూల్స్​ మారడంతో గతంతో పోలిస్తే ఐసీసీఆర్ స్కాలర్​షిప్​లు తక్కువ మందికి వస్తున్నాయి. గతంలో ఇరాన్ ​నుంచి ఎక్కువ వచ్చేవారు. అక్కడి పరిస్థితుల వల్ల వారి సంఖ్య తగ్గింది. మనం ప్రత్యేకంగా ప్రచారం చేసుకునే అవకాశం లేదు. కేంద్రం తెచ్చిన స్టడీ ఇండియా ప్రోగ్రాంతో ఫారిన్ ​స్టూడెంట్స్​సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నం.

 ‑ జీబీరెడ్డి, ఓయూ యూఎఫ్ఆర్ఓ డైరెక్టర్

Latest Updates