రాష్ట్రంలో షాపులు తెరిచి ఉంచే సమయం కుదింపు

రాష్ట్రంలో మే 7 వరకూ లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను అతిక్రమించే వారిపై జాలి చూపరాదని, వారి వాహనాలు స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇంటి చిరునామాకు 3 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లేందుకు ఎవరికీ పర్మిషన్ ఇవ్వవద్దని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.

ఇదే సమయంలో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర షాపులను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, కిరాణా దుకాణాలను 11 తర్వాత తెరిచేందుకు అనుమతించేది లేదని పోలీసులు యజమానులను హెచ్చరించారు. బుధవారం నుంచి కావాల్సిన వస్తువులను 11 గంటల్లోగా తీసుకుని ఇళ్లకు చేరాలని… ఆ తర్వాత బయటకు రావద్దని ఆదేశించారు.

వాణిజ్య సముదాయాలు, గవర్నమెంట్ ఆఫీసులు, పెట్రోలు బంకుల పనివేళలను కూడా తగ్గించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎవరికైనా వైద్య పరమైన అవసరం ఏర్పడితే, 100కు డయల్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

Latest Updates