క్షణికావేశంలో అన్నను చంపి కటకటాల పాలు

సికింద్రాబాద్: ఈ నెల 8 న సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో జరిగిన హత్య కేసులో నిందితుడు సాయిని రిమాండ్ కు తరలించినట్లు ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. దసరా పండుగ రోజున మద్యం మత్తులో తల్లిని తిడుతున్న అన్న సంతోష్ ను తమ్ముడు సాయి కుమార్ మందలించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఉద్రేకానికి లోనై క్షణికావేశంతో పూల అలంకరణ ఉపయోగించే చిన్న కత్తితో అన్నపై దాడి చేశాడు.ఈ దాడిలో సంతోష్ కు మెడపైన, కడుపులో గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 3గంటల ప్రాంతంలో మృతి చెందాడని ఇన్ స్పెక్టర్ తెలిపారు. తల్లి వాగ్మూలం, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సాయి కుమార్ పైన హత్య కేసు నమోదు చేసామని ఆయన తెలిపారు.హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుణ్ని అదుపులోకి  తీసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు.

Latest Updates