రీజినల్​ రింగ్​రోడ్డు డౌటే!.. ప్రాజెక్టుపై కేంద్రం అభ్యంతరాలు

ఇది ఆర్థిక భారం..
ఆ ఏరియాల్లో పరిశ్రమల్లేవు.. వాహనాల రద్దీ ఉండదు
టోల్ఫీజూ రాదు.. రోడ్డుతో ప్రయోజనమేంటని ప్రశ్న
500 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి ఇస్తే పరిశీలిస్తామని సూచన
వాణిజ్య అవసరాలేమిటో చెప్పలేకపోయిన రాష్ట్ర సర్కారు
‘ట్రిపుల్ఆర్’ ప్రపోజల్స్తో విపరీతంగా భూముల ధరలు
వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు, కాంట్రాక్టర్లు, లీడర్లు
నాలుగేండ్ల కింద ఎకరా రూ.20 లక్షల లోపే..
రెండు కోట్ల నుంచి రూ. 15 కోట్ల దాకా రేట్లు
4 జిల్లాల రియల్ ఎస్టేట్పై ప్రభావం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 338 కిలోమీటర్ల రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు (ట్రిపుల్​ఆర్) ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. అంత భారీ ఖర్చుతో ప్రాజెక్టు చేపట్టడం సరికాదని, దానివల్ల వచ్చే ప్రయోజనాలు అంతంత మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీపీఆర్​లో పేర్కొన్న ప్రకారం రీజనల్​ రింగ్​రోడ్డు చేపట్టడం ఆర్థిక భారమని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో డీపీఆర్‌‌ దశలోనే ఈ ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోడ్డు వస్తుందన్న ఆశతో మూడేళ్లుగా భూములపై కోట్లలో పెట్టుబడులు పెట్టిన రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కొందరు రాజకీయ నాయకులు దీనితో అయోమయంలో పడిపోయారని సమాచారం. హైదరాబాద్‌‌ మహా నగరానికి చుట్టూ 50, 60 కిలోమీటర్ల దూరంలో రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు నిర్మించాలని 2016లో సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

338 కిలోమీటర్ల పొడవునా, ఆరు లేన్లతో ఈ రోడ్డు నిర్మాణానికి 12 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేసింది. భారీ ప్రాజెక్టు అవుతుండటంతో రెండు దశలుగా విభజించి, కేంద్రానికి దరఖాస్తు చేసింది. కేంద్రం 2018 డిసెంబర్‌‌లో సంగారెడ్డి, నర్సాపూర్‌‌, తూప్రాన్‌‌, గజ్వేల్‌‌, జగదేవ్‌‌పూర్‌‌, భువనగిరి, చౌటుప్పల్‌‌ వరకు ప్రతిపాదించిన 152 కిలోమీటర్ల మొదటి దశకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ చౌటుప్పల్‌‌ నుంచి షాద్ నగర్‌‌ మీదుగా కంది వరకు నిర్మించే రెండో దశకు అభ్యంతరం తెలిపింది. దీంతో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం సందిగ్ధంలో పడింది.

ఎకరం భూమి రూ.15 కోట్లు!

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డుకు సంబంధించి ఇప్పటివరకు డీపీఆర్‌‌ మాత్రమే సిద్ధమైంది. ఏ గ్రామం, ఏ సర్వే నంబర్‌‌ భూమిలో నుంచి హైవే వెళుతుందన్న విషయంలో క్లారిటీ లేదు. కానీ ఆ డీపీఆర్‌‌ను, అందులో పేర్కొన్న మండలాలను ఆధారంగా చేసుకుని భూములు కొనుగోలు చేస్తున్నారు. అప్పట్లో ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డు రాకతో హైదరాబాద్​ శివార్లలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ప్రతిపాదిత మండలాల్లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అప్పటివరకు ఎకరం రూ.15 లక్షలు మించని భూముల ధరలు రియల్​ఎస్టేట్​ వ్యాపారులు, కాంట్రాక్టర్ల రంగప్రవేశంతో ఏకంగా రూ.కోటికిపైగా పలుకుతున్నాయి. దాంతో రైతులు భూములు అమ్ముతున్నారు. రీజినల్ రింగ్‌‌ రోడ్డు ప్రారంభమయ్యే సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరు, అమీన్‌‌పూర్‌‌ లలో భూములు అత్యధికంగా ఎకరం రూ.15 కోట్లు పలుకుతున్నాయి. నర్సాపూర్‌‌, తూప్రాన్‌‌, ప్రజ్ఞాపూర్‌‌, జగదేవ్‌‌పూర్‌‌, చౌటుప్పల్‌‌లో ఎకరం రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. గజ్వేల్‌‌ను ఆనుకుని రాజీవ్‌‌ రహదారి ఉండడం, మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్​ నిర్మాణం జరుగుతుండటం, ఇప్పుడు రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు వస్తుండడంతో ఇక్కడ ఎకరం రూ.2 కోట్లు దాటింది. వరంగల్‌‌– హైదరాబాద్‌‌ జాతీయ రహదారిలో ఉన్న భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌‌ పరిసరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

లక్షల ఎకరాలు చేతులు మారినయ్

వ్యవసాయం రోజురోజుకు భారంగా మారడం, సాగునీటి సదుపాయం సరిగ్గా లేకపోవడం, భూములకు ఊహించని ధర రావడంతో చాలా చోట్ల రైతులు భూములు అమ్మేసుకుంటున్నారు. కుటుంబ అవసరాలు, మార్కెట్‌‌లో డిమాండ్‌‌ కూడా వారిని అమ్మకంవైపు నెడుతున్నాయి. హైదరాబాద్‌‌ చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక్క 2018–19 ఏడాదిలోనే రైతులు 1,33,621 ఎకరాల భూములను అమ్మేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 1,50,054 ఎకరాలు, ఉమ్మడి మెదక్‌‌ జిల్లా పరిధిలో 2,33,307 ఎకరాల భూములను అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్‌‌ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

ఆర్​ఆర్​ఆర్​ ప్రభావం ఎక్కువున్న గజ్వేల్‌‌ సబ్ రిజిస్ట్రార్‌‌ పరిధిలో 2018లో 11,562 డాక్యుమెంట్లు రిజిస్టర్‌‌ కాగా, 2019 డిసెంబర్‌‌ 4వ తేదీ నాటికే 14,507 డాక్యుమెంట్లు రిజిస్టర్‌‌ అయ్యాయి. తూప్రాన్‌‌ సబ్‌‌ రిజిస్ట్రార్ పరిధిలో 2017–18లో 5,134, 2018–19లో 7,958 డాక్యుమెంట్లు రిజిస్టరవగా ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి డిసెంబర్‌‌ 4 వరకే 4,814 డాక్యుమెంట్లు రిజిస్టర్‌‌ అయ్యాయి. కొనుగోలుదారుల్లో ఎక్కువగా రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులు, హైదరాబాద్‌‌, ఇతర పట్టణాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లే ఎక్కువగా ఉన్నారు. గతంలో గ్రామాల్లో ఎవరైనా రైతు తన భూమి అమ్మకానికి పెడితే మొదట గెట్టు పక్క రైతుకు చెప్పేవారు. కానీ రైతులు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి. దాంతో రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లకు అమ్మేస్తున్నారు. రీజినల్​ రింగ్​ రోడ్డు అమలు దశలోకి చేరితే.. రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ఉమ్మడి మెదక్‌‌ జిల్లాకు చెందిన ఓ సబ్‌‌ రిజిస్ట్రార్ చెప్పారు.

మూడేళ్లలో వేల కోట్ల దందా

రాష్ట్ర ప్రభుత్వం రీజినల్​ రింగ్​రోడ్డు డీపీఆర్‌‌ను కేంద్రానికి సమర్పించాక ఈ మూడేండ్లలో ఏకంగా వేల కోట్ల రూపాయల భూముల దందా జరిగినట్టు అంచనా. అసలు ఈ రోడ్డు నిర్మిస్తారో లేదో.. వేసినా ఏయే ఏరియాల నుంచి వెళ్తుందన్నది కచ్చితంగా తెలియదు. అయినా ఆ రోడ్డు కలిపే పట్టణాల ఆధారంగా చుట్టూ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం ఊపందుకుంది. రియల్ ఎస్టేట్‌‌ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కొందరు రాజకీయ నాయకులు వందల ఎకరాల భూములు కొన్నట్టు సమాచారం. కొందరు ఫలానా ప్రాంతం నుంచి హైవే వెళుతోందంటూ ఫేక్‌‌ బ్లూ ప్రింట్స్‌‌తో అడ్డగోలుగా రేట్లు పెంచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్​పోర్ట్​ మెరుగుపరచడం, అభివృద్ధి వికేంద్రీకరణ, చిన్న పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా రీజినల్ రింగ్‌‌ రోడ్డును నిర్మించబోతున్నట్టు సర్కారు చెప్పింది. కానీ అవేమీ జరగకముందే భూముల ధరలు మాత్రం సామాన్యుడికి అందకుండా పోయాయి.

రీజినల్ రింగ్రోడ్డు స్వరూపం

హైవే పొడవు: 338 కిలోమీటర్లు..

ఆరు లేన్లతో నిర్మాణం

ఫస్ట్‌ ఫేస్‌: 152 కిలోమీటర్లు. తూప్రాన్‌ – గజ్వేల్‌– జగదేవ్‌పూర్‌ – భువనగిరి – చౌటుప్పల్

సెకండ్‌ ఫేస్: 186 కిలోమీటర్లు. చౌటుప్పల్‌ – యాచారం – కడ్తాల్‌ – షాద్‌ నగర్‌ – చేవెళ్ల – శంకర్‌పల్లి – కంది

కవరయ్యే జిల్లాలు: 5, నియోజకవర్గాలు: 9

కావాల్సిన భూమి: 11 వేల ఎకరాలు

మొత్తం ఖర్చు అంచనా: రూ. 12 వేల కోట్లు

భూసేకరణకు: రూ. 3వేల కోట్లు

నిర్మాణాలకు: రూ. 9 వేల కోట్లు

ట్రిపుల్‌ ఆర్‌తో కలిసే రహదారులు:

ఎన్‌హెచ్‌– 65, 44, 163, 765

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates