సొంతవాళ్లనే చంపుకుంటున్రు

క్షణికావేశంలో జరుగుతున్న హత్యలు
ఆగమవుతున్న కుటుంబాలు
చిన్న గొడవలు, మద్యం,అక్రమ సంబంధాలే కారణాలు
ఉమ్మడి జిల్లాలో 50 రోజుల్లో ఆరు ఘటనలు
తండ్రిపై గొడ్డలితో దాడి చేసి..

మే 14న కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో తండ్రి తాటిపల్లి మేలయ్య(50)ను కొడుకు ప్రశాంత్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆటోడ్రైవర్​గా పనిచేస్తున్న మేలయ్య మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్య, కొడుకు, కూతురుతో గొడవపడేవాడు. వేధింపులు పెరగడంతో విసిగిపోయిన కొడుకు తండ్రిపై గొడ్డలితో దాడిచేయగా అక్కడికక్కడే చనిపోయాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో యువకుడు జైలుపాలయ్యాడు.

కామారెడ్డి, వెలుగు : కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు.. ఆత్మీయబంధాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలో 50 రోజుల్లో తమవాళ్లనే కుటుంబ సభ్యులు హత్య చేసిన ఘటనలే దీనికి నిదర్శనం. తాగి వచ్చి వేధిస్తుండటం, చిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల వంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. బాధ్యులు జైలుకు వెళ్లడంతో ఆ కుటుంబాలు ఆగమ వుతున్నాయి. క్షణికావేశంలో హత్యలు చేసి భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఆరు హత్యలు జరిగాయి. ఇవన్నీ తమ కుటుంబ సభ్యులు చేసినవే. కొడుకులు తండ్రులను చంపటం, భార్యలు భర్తలను హత్య చేయడం, మిగతా కుటుంబ సభ్యులు ఇందుకు సహకరిస్తుండటం పరిస్థితుల తీవ్రతకు కారణమవుతున్నాయి.

బోధన్ మండలం మందర్నాకు చెందిన సాయిరాం మే నెల మొదటి వారంలో హత్యకు గురయ్యాడు. భార్య గంగామణి తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి భర్తను గొంతునులిమి చంపారు. సమీపంలోని మంజీర నది ఇసుకలో పాతిపెట్టారు. సాయిరాం తల్లి తన కొడుకు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భార్య, కుటుంబసభ్యులు చంపినట్లు తేలింది.

మే 14న భిక్కనూరు మండలం తిప్పాపూర్​లో మేలయ్యను అతడి కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపేశాడు.

మే 26న డిచ్​పల్లి మండలం ఖిల్లా డిచ్​పల్లిలో తండ్రి వాహిద్ ఖాన్ (70), కొడుకు అఫ్సర్ ఖాన్ గొడవపడ్డారు. తండ్రిపై కొడుకు రాడ్​తో దాడికి పాల్పడగా వాహిద్​ఖాన్ మృతిచెందాడు.

మే 25న నిజామాబాద్ నగరంలో తాగిన మత్తులో ముగ్గురు స్నేహితులు పైసల కోసం గొడవపడ్డారు. వికాస్ పాఠక్​ను మరో ఇద్దరు స్నేహితులు కొట్టి చంపారు.

మే 31న నందిపేట మండల కేంద్రంలోని రాజానగర్​లో గంధం రమేశ్(41)ను భార్య పద్మ కొడుకుల సహకారంతో ఉరివేసి హత్య చేసింది.

జూన్ 3న వర్ని మండలం అంబం(ఆర్)లో గంజురి గంగారాం(50) హత్యకు గురయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యులే గొంతు నులిమి చంపినట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

చంపడం సమస్యకు పరిష్కారం కాదు

చంపటం అనేది సమస్యకు పరిష్కారం కాదు. కొన్ని సార్లు తొందరపాటుతో తీసుకునే నిర్ణయం సమస్యలకు కారణమవుతోంది. తమ వాళ్లనే చంపి కొందరు అరెస్టవుతున్నారు. కూర్చుండి సామరస్యంగా మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.                                                                          – లక్ష్మీనారాయణ, డీఎస్పీ , కామారెడ్డి

ముందు నుంచే గమనిస్తే మేలు

డబ్బు చుట్టే మనిషి జీవనం ఉంటోంది. దానిముందు మనవాళ్లు అనే భావన కనిపించడంలేదు. ఇది పలు అనర్థాలకు దారితీస్తోంది. అసూయ చెందటం, ఇతర ఒత్తిళ్లకు గురైన వారు తాము తీసుకున్న నిర్ణయమే సరైనదని అనుకుంటున్నారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని హత్య చేస్తున్నారు. వ్యక్తితో వచ్చే మార్పును ముందు నుంచే పసిగట్టడం, అవసరమైతే సైకియాట్రిస్ట్ ను సంప్రదించి మార్పు తీసుకురావచ్చు.                                               – డాక్టర్ వీరేందర్, సైకియాట్రిస్ట్

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

Latest Updates