రిలయన్స్ కు తగ్గిన లాభం..30 శాతం జీతాల్లో కోత

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌లో రూ.6,348 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌‌లో రూ.10,362 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 39 శాతం తక్కువ. సెప్టెంబరు క్వార్టర్‌‌లో ఈ కంపెనీకి రూ.11,640 కోట్ల లాభం వచ్చింది. ఈసారి క్వార్టర్‌‌లో కంపెనీకి రూ. 10,500 కోట్ల వరకు లాభం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలు తప్పాయి.   ఇదేకాలంలో ఆపరేషన్స్‌‌ నుంచి రెవెన్యూ రూ. 1,52,939 కోట్ల నుంచి రూ. 1,39,000 కోట్లకు తగ్గింది. రిలయన్స్‌‌ జియోకు రూ. 2,331 కోట్ల లాభం వచ్చింది.   ప్రతి ఈక్విటీ షేరుకు రూ.6.50 చొప్పున డివిడెండ్‌‌ ప్రకటించింది. ఇదే సందర్భంగా రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ భారీ రైట్స్‌‌ ఇష్యూను కూడా ప్రకటించింది. షేరుకు రూ.1,257 వసూలు చేయడం ద్వారా రూ. 53,125 కోట్ల సమీకరిస్తామని వెల్లడించింది. ఈ విషయమై రిలయన్స్‌‌ సీఎండీ ముకేశ్‌‌ అంబానీ మాట్లాడుతూ కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చినా కంపెనీ సత్తా చాటిందని అన్నారు.  ఇదిలా ఉంటే, రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్ గత వారం ఫేస్‌‌బుక్‌‌కు రూ. 43,574 కోట్ల విలువైన పదిశాతం వాటా అమ్మిన విషయం తెలిసిందే.

 జీతాలకు కోతలు

రిలయన్స్‌‌లోనూ కూడా జీతాల కోత తప్పలేదు. హైడ్రోకార్బన్స్ డివిజన్‌‌ బోర్డు మెంబర్లు, సీనియర్‌‌ లీడర్ల జీతాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు కోత విధిస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ వల్ల ఎదురైన నష్టాల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ చైర్మన్‌‌ ముకేశ్‌‌ అంబానీ 2020–21 సంవత్సరానికి పూర్తి జీతాన్ని వదులుకుంటారు. లాక్‌‌డౌన్‌‌ వల్ల పెట్రో ప్రొడక్టులకు డిమాండ్‌‌ విపరీతంగా తగ్గింది. దీంతో రిలయన్స్‌‌ హైడ్రోకార్బన్స్‌‌ బిజినెస్‌‌కు తీవ్రనష్టాలు వచ్చాయి.  ఏడాదికి రూ.15లక్షల లోపు జీతం ఉన్న వారి జీతాన్ని పూర్తిగా చెల్లిస్తారు. రూ.15 లక్షల కంటే ఎక్కువ వార్షిక జీతం ఉంటే 10 శాతం కోత ఉంటుంది. సీనియర్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ల శాలరీకట్‌‌ 30 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది.

 

 

 

Latest Updates