పెట్రోల్‌‌ బంకుల కోసం రిలయన్స్‌‌, బీపీ జట్టు

న్యూఢిల్లీరిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఐఎల్‌‌), బీపీ మరోసారి చేతులు కలిపాయి. రిటైల్‌‌ సర్వీస్‌‌ స్టేషన్‌‌ నెట్‌‌వర్క్‌‌, ఏవియేషన్‌‌ ఫ్యూయెల్స్ బిజినెస్‌‌ కోసం కొత్త జాయింట్‌‌ వెంచర్‌‌ను నెలకొల్పాయి. ఈ జాయింట్‌‌ వెంచర్‌‌లో రిలయన్స్‌‌కు 51 శాతం వాటా, బీపీకు 49 శాతం వాటా ఉంటాయని రిలయన్స్‌‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 5,500 రిటైల్‌‌ స్టేషన్స్‌‌ పెట్టాలనే టార్గెట్‌‌తో జాయింట్‌‌ వెంచర్‌‌ ఏర్పాటు చేశారు. రిలయన్స్‌‌కు ఇప్పటికే ఉన్న రిటైల్‌‌ స్టేషన్స్‌‌కు అదనంగా మిగిలిన వాటిని నెలకొల్పనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇప్పటికే  రిలయన్స్‌‌ చేతిలో 1,300 రిటైల్‌‌ స్టేషన్స్‌‌ ఉండగా, బీపీకి 3,500 రిటైల్‌‌ స్టేషన్స్‌‌ పెట్టేందుకు 2016 లోనే అనుమతులు వచ్చాయి. తన పెట్రోల్‌‌ పంపుల సంఖ్యను 5 వేలకు పెంచడం ద్వారా మార్కెట్‌‌ వాటాను రెట్టింపు చేసుకోవాలని రిలయన్స్‌‌ లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్‌‌కు ప్రస్తుతం ఈ విభాగంలో 7–8 శాతం మార్కెట్‌‌ వాటా ఉంది.

చమురు వెలికితీత, ఉత్పత్తిలో ఇప్పటికే రిలయన్స్‌‌, బీపీ సంస్థలకు భాగస్వామ్యం ఉంది. ఆర్‌‌ఐఎల్‌‌కు ఉన్న 21 ఆయిల్‌‌ అండ్‌‌ గ్యాస్‌‌ ప్రొడక్షన్‌‌ షేరింగ్‌‌ కాంట్రాక్టులలో బీపీ 2011 లోనే 30 శాతం వాటా తీసుకుంది. ఇండియా గ్యాస్‌‌ సొల్యూషన్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌లోనూ ఆర్‌‌ఐఎల్‌‌, బీపీ భాగస్వాములు. కొత్తగా పెట్టే జాయింట్‌‌ వెంచర్‌‌లో రిలయన్స్‌‌ ఏవియేషన్ ఫ్యూయెల్‌‌ బిజినెస్‌‌ కూడా భాగంగా ఉంటుందని రిలయన్స్‌‌ వెల్లడించింది. ఇండియాలోని 30 ఎయిర్‌‌పోర్టులలో ఈ బిజినెస్‌‌ కార్యకలాపాలను ఆర్‌‌ఐఎల్‌‌ నిర్వహిస్తోంది. మంగళవారం ఆర్‌‌ఐఎల్‌‌ ఛైర్మన్‌‌ ముఖేష్‌‌ అంబానీ, బీపీ గ్రూప్‌‌ సీఈఓ బాబ్‌‌ డుడ్లీలు కొత్త  జాయింట్‌‌ వెంచర్‌‌   అగ్రిమెంట్‌‌పై సంతకాలు చేశారు. 2019 లోనే తుది అగ్రిమెంట్‌‌ ఖరారవుతుందని, రెగ్యులేటరీ అనుమతులు వచ్చాక ట్రాన్సాక్షన్ 2020 మొదటి ఆరు నెలల్లో పూర్తవుతుందని కూడా రిలయన్స్‌‌ ఈ సందర్భంగా వెల్లడించింది.

Latest Updates