తిరుమల బస్ టికెట్ల వెనుక జెరూసలేం యాత్రపై ప్రచారం

తిరుమలలో బస్సు టికెట్ల ముద్రణ వివాదాస్పదమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉంది. ఐతే.. ఇతర మతస్తులను ప్రోత్సహించే విధంగా ఆర్టీసీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

తిరుమలలోని ఆర్టీసీ బస్ టికెట్ కౌంటర్లలో అమ్ముతున్న టికెట్లలో కొన్నింటి వెనుక.. అన్యమతానికి సంబంధించిన ముద్రణలు ఉన్నాయి. పవిత్ర జెరూసలేం యాత్ర  అంటూ టికెట్లపై ముద్రణ ఉండడాన్ని తప్పుపడుతున్నారు భక్తులు.

అప్పటికే అన్యమత ప్రచారం ఉన్న పేపర్ బండిల్స్ ను తిరుమల నుంచి.. తిరుపతికి వెళ్లేవారికి టికెట్లను ఇష్యూ చేయడానికి వాడుతున్నట్టుగా చెబుతున్నారు.

అయితే దీనిపై తిరుమల ఆర్టీసీ డిఎం గిరిధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. తిరుమలకు వచ్చిన ఐదు ఖాళీ రోల్స్ పై మాత్రమే అన్య మతానికి సంబంధించిన ప్రకటన వచ్చిందని అన్నారు. పొరపాటున వాటిని తిరుమలకు పంపారని, సీల్డ్ కవర్లో రావడం వలన గుర్తించలేక పోయామని ఆయన తెలిపారు. అన్యమత ప్రకటనలు కలిగిన టికెట్లను తిరుమలకు పంపినవారిని గుర్తించి వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల ఆర్టీసీ డీఎం గిరిధర్ రెడ్డి అన్నారు.

Latest Updates