లేట్ నిద్ర.. ఎంత చెడ్దదో!

కొంతమందికి రాత్రి పన్నెండు దాటినా నిద్ర పట్టదు. రాత్రంతా మేల్కొనే ఉండి,  పొద్దున్నే నిద్ర ముంచుకొచ్చి అవస్థలు పడుతుంటారు. రోజు రోజుకి ఇలా నిద్ర పట్టని వారి సంఖ్య పెరుగుతోందని బ్రిటన్ పరిశోధకులు చెప్తున్నారు. నిద్ర అలవాట్లు సరిచేసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు.

అర్థరాత్రి దాటాక కూడా మెలకువగా ఉండే  కొంతమందిని తీసుకుని వాళ్ల మీద  బ్రిటన్​ సైంటిస్ట్‌‌లు పరిశోధన చేశారు. వీళ్లు నిద్ర పోయే టైం,  నిద్ర లేచే టైం ప్రతి రోజు ఒకేలా ఉంటుందట. వీళ్ల తినేవాటిలో కెఫిన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందని వాళ్లు గమనించారు. లేట్‌గా పడుకుని లేట్ గా నిద్ర లేవడం మామూలు విషయంగానే కనిపించొచ్చు కానీ.. ఇది ఆరోగ్యం మీద, మనిషి లైఫ్ స్టైల్ మీద  చాలా మార్పులు తీసుకొస్తుందని  పరిశోధకులు అంటున్నారు.

ప్రతి ఒక్కరి శరీరానికీ ఒక డే అండ్ నైట్ టైం టేబుల్ ఉంటుంది. దాని ప్రకారమే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ డే అండ్ నైట్ టైం టేబుల్ సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం గా ఉండగలుగుతారు.

దీని వల్ల కలిగే నష్టాలేంటంటే… ప్రపంచం అంతా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పనిచేస్తుంది. లేట్ టైం టేబుల్ వల్ల వీళ్లకు పగలు చేసే పనుల్లో ఉత్సాహం ఉండదు. రాను రాను రాత్రిళ్ళు మరింత ఎనర్జిటిక్ గా మారి, పగలంతా నీరసంగా మారిపోతారు. దీనితో చేసే పనులకు ఎంతో ఇబ్బంది కలగొచ్చు.

లేట్​గా నిద్రపోయే వాళ్లు అందరిలా ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోలేరు. రాత్రి రెండు మూడింటికి నిద్ర పోతే మళ్లీ పొద్దున్నే ఆరు ఏడింటికి నిద్ర లేవాల్సి ఉంటుంది. దీంతో సరైన నిద్ర లేక కళ్ళు సరిగా పనిచేయవు. శరీరం కూడా సరైన విశ్రాంతి లేక ఫిట్ నెస్ కోల్పోతుంది.

టిప్స్​ పాటిస్తే మేలు

అయితే  లేట్ నైట్ టైం టేబుల్ వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తే రెగ్యులర్ టైం టేబుల్ లోకి మారిపోవచ్చట. ఇలాంటి వాళ్లను  21 మందిని తీసుకుని  పరిశోధకులు స్టడీ చేశారు. వీళ్లు  అర్ధరాత్రి  రెండు  దాటాక నిద్ర పోతారు.  ఉదయం తొమ్మిది  గంటలకు మేల్కొంటారు. వీళ్లందరికీ కొన్ని టిప్స్ చెప్పి పాటించేలా చేశారు. అవేంటంటే..

  • మామూలుగా లేచే  సమయం కన్నా 2, 3 గంటలు ముందు లేవాలి.
  • ఉదయం శరీరానికి ఎండ తప్పక తగలాలి.
  • సాధ్యమైనంత త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేసేయాలి.
  • రోజు వ్యాయామం చేయాలి. అదికూడా కేవలం ఉదయం మాత్రమే.
  • ప్రతి రోజూ ఒకే సమయంలో లంచ్ చేయాలి. సాయంత్రం ఏడు తర్వాత ఏమీ తినకూడదు.
  • మధ్యాహ్నం మూడింటి తర్వాత కెఫిన్‌‌ ఉండే పదార్ధాలేవి తీసుకోకూడదు.
  • సాయంత్రం నాలుగు  గంటల తర్వాత కునుకు వచ్చినా నిద్ర పోకూడదు.

ఇలాంటి రూల్స్ పెట్టి కచ్చితంగా పాటించేలా చేశారు. దీంతో కేవలం ఒక వారం లోనే వీళ్ల టైం టేబుల్ మారిపోయింది. రెండు, మూడు గంటలు ముందుకు జరిగింది. వీరు నిద్రపోయే టైమ్​ ఏమాత్రం తగ్గలేదు. జస్ట్ టైం టేబుల్ అలా ముందుకి జరిగింది అంతే.. మళ్లీ ఎప్పుడైనా రాత్రి లేట్ గా నిద్ర పట్టినప్పుడు తిరిగి ఈ టిప్స్ ఒకటి రెండు రోజులు పాటిస్తే చాలు. నిద్ర ఆటోమేటిక్ గా మూడు గంటలు ముందుకు జరుగుతుంది.

ఈ టిప్స్ ని ఎవరైనా పాటించొచ్చని, సరైన నిద్ర టైం టేబుల్ కి ఇవి సాయపడతాయని  పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇలా టైం టేబుల్ మారిన తర్వాత  మగతగా ఉండటం, ఒత్తిడిగా అనిపించటం, కుంగుబాటు లాంటివి తగ్గిపోతాయని వాళ్ళు చెప్పారు.

Latest Updates