ఇంకిన్ని కిరాయి బస్సులు

1,035 హైర్​ బస్సులకు ఆర్టీసీ టెండర్‌ రిలీజ్‌

ప్రైవేట్‌ ఓనర్లను ఆహ్వానించిన ఆర్టీసీ యాజమాన్యం

760 హైర్‌ బస్సులు జీహెచ్ఎంసీ పరిధిలోనే..

21న మధ్యాహ్నం 2 గంటల దాకా  అప్లికేషన్ల స్వీకరణ

అదే రోజు 3 గంటలకు  టెండర్ల ఓపెన్

సెలక్షన్‌ కమిటీదే తుది నిర్ణయం

ఇప్పటికే 2,103 అద్దె బస్సులు.. 3,138 చేరనున్న సంఖ్య

ఇక సంస్థలో కొత్త బస్సులు లేనట్టే!

 

ఆర్టీసీ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం అనుకున్నదే జరుగుతోంది. సంస్థలో ప్రైవేట్‌ బస్సుల ఎంట్రీకి తెర లేచింది. హైర్‌ బస్సుల కోసం ఆర్టీసీ యాజమాన్యం టెండర్‌ రిలీజ్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,035 అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించింది. విధివిధానాలతో కూడిన టెండర్‌ నోటిఫికేషన్‌ను ఆయా కంపెనీలకు పంపించింది. ఇప్పటికే సంస్థలో ఉన్న 2,103 అద్దె బస్సులతో కలిపి మొత్తం 3,138 బస్సులు కానున్నాయి. 50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేట్ బస్సులు ఆర్టీసీలో ఉంటాయని ఇటీవల సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా రాబోయే అద్దె బస్సులతో కలిపి మొత్తం 30 శాతానికి చేరినట్లయ్యింది. మొత్తం అద్దె బస్సుల్లో ఎక్కువగా గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలోనే రానున్నాయి. 760 బస్సులు ఇక్కడే ఉన్నాయి. హైదరాబాద్‌‌  రీజియన్‌‌లో 423 బస్సులు, సికింద్రాబాద్‌‌ రీజియన్‌‌లో 337 అద్దె బస్సులకు టెండర్లు ఆహ్వానించారు. నల్లగొండ రీజియన్‌‌లో మాత్రం అతి తక్కువగా 5 కొత్త అద్దె బస్సులే ఇచ్చారు.

అగ్రిమెంట్‌‌ పీరియడ్‌‌ ఇలా..

అగ్రిమెంట్‌‌ పీరియడ్‌‌కు సంబంధించి ఆర్టీసీ పలు విధివిధానాలు రూపొందించింది. మెట్రో ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సుకు 6 ఏళ్ల వరకు అగ్రిమెంట్‌‌ చేసుకోనున్నారు. మొదట నాలుగేళ్లకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాతి రెండేళ్లు బస్సు ఫిట్‌‌నెస్‌‌ను బట్టి పొడిగిస్తారు. సిటీ ఆర్డినరీ లేదా సిటీ అర్బన్‌‌ బస్సులకు పదేళ్లపాటు అగ్రిమెంట్‌‌ ఉంటుంది. మొదట నాలుగేళ్లకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత ఫిట్‌‌నెస్‌‌ను బట్టి పొడిగిస్తారు. పల్లెవెలుగు బస్సుకు 9 ఏళ్లు ఒప్పందం చేసుకోనున్నారు. మొదట నాలుగేళ్లకు అగ్రిమెంట్ చేసుకుని.. తర్వాత వాహన ఫిట్‌‌నెస్‌‌, ఇతర అంశాలను పరిశీలించి పొడిగిస్తారు.

ఇప్పటికే రిక్రూట్‌‌మెంట్‌‌ నోటిఫికేషన్‌‌

తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి ఇప్పటికే ఆర్టీసీ నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. డ్రైవర్, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు ఇచ్చే రెమ్యునరేషన్‌‌ను కూడా ప్రకటించింది. డ్రైవర్లు, రిటైర్డ్‌‌ డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లు, రిటైర్డ్‌‌ కండక్టర్లకు రూ.1,000, రిటైర్డ్‌‌ ఆఫీసర్లకు రూ.1,500, రిటైర్డ్‌‌ ట్రాఫిక్‌‌ సూపర్‌‌వైజర్లకు రూ.1,500 ఇవ్వనున్నట్లు తెలిపింది. రిటైర్డ్‌‌ ఎలక్ట్రీషియన్‌‌, రిటైర్డ్ టైర్‌‌ ఎలక్ట్రీషియన్‌‌కు రూ.1,000 చొప్పున అందజేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులే కాక ఇతర శాఖల్లో ప‌‌ని చేసిన డ్రైవ‌‌ర్స్‌‌, రిటైర్డ్‌‌ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు కోరింది. కొన్ని జిల్లాల్లో రిక్రూట్‌‌మెంట్‌‌ జరుగుతోంది.

కొత్త బస్సులు ఇక లేనట్టేనా..?

అద్దె బస్సుల టెండర్‌‌తో ఆర్టీసీలో ఇక కొత్త బస్సుల కొనుగోలు లేనట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,460 బస్సులు ఉండగా, ఇందులో 8,357 ఆర్టీసీ బస్సులు, 2,103 హైర్‌‌ బస్సులు ఉన్నాయి. కొత్తగా మరో 1,035 అద్దె బస్సులతోపాటు మరో 20 శాతం ప్రైవేట్‌‌ బస్సులు రానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సుల్లో కాలం చెల్లిన వాటిని తీసేసి అవసరమైన వాటిని మాత్రం వాడుకోనున్నారు. అయితే సంస్థలో సుమారు 3 వేల బస్సులను కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో యూనియన్లు డిమాండ్‌‌ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 844 పైగా గ్రామాలకు బస్సుల సౌకర్యం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

రూల్స్, విధివిధానాలు..

    హైరింగ్‌‌ కోసం 2019 లేదా ఆ తర్వాత మోడల్‌‌ బస్సులు మాత్రమే ఉండాలి.

ఒక వ్యక్తి బస్సు కోసం ఎన్ని అప్లికేషన్లు అయినా ఫైల్‌‌ చేయవచ్చు.

    బస్సులో వెహికల్‌‌ ట్రాకింగ్‌‌ యూనిట్‌‌ ఏర్పాటు చేయాలి.

ఉద్యమాలు, ప్రమాదాల టైమ్‌‌లో బస్సు డ్యామేజ్‌‌ ఐతే ఆర్టీసీకి సంబంధం ఉండదు.

    బస్సుఓనర్‌‌(ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌‌)ను తీసుకునే విషయంలో సెలక్షన్‌‌ కమిటీదే నిర్ణయం.

హైస్పీడ్‌‌ డీజిల్‌‌ ఆయిల్‌‌ లేదా బయో డీజిల్‌‌తో కూడిన హైస్పీడ్‌‌ డీజిల్‌‌ ఉండాలి.

    అద్దె బస్సుకు నెలవారీ చార్జీలు చెల్లించాలి.

వాహన పన్నును కార్పొరేషనే చెల్లిస్తుంది.

    రీజినల్‌‌ మేనేజర్‌‌తో ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

కేటాయించిన రూట్‌‌, కిలోమీటర్లు మార్చరు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆయా మార్గాల్లో భౌగోళిక మార్పులు వంటి సమయాల్లో మాత్రం మినహాయింపు ఉంటుంది.

                ఫిట్‌‌నెస్‌‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌‌ ఉండాలి.

Latest Updates