సీన్మా థియేటర్ల రీఓపెనింగ్​పై కేంద్రం కీలక ప్రకటన

  • నెల తర్వాతేనని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి స్థితిని అంచనా వేసిన తరువాత సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించే విషయం పరిశీలిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కరోనా ఎఫెక్టుతో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్, సినిమా ఎగ్జిబిషనర్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులకు మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. అంతకుముందే పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రొడ్యూసర్స్ బృందం మంత్రికి వినతి పత్రం సమర్పించింది. సినిమా హాళ్లు ప్రారంభించాలన్న డిమాండ్‌పై జవదేకర్ మాట్లాడుతూ “జూన్ నెలలో కరోనా మహమ్మారి స్థితిని పరిశీలించిన తరువాత దీనిని పరిశీలిస్తాం” అని ఒక ప్రకటనలో తెలిపారు. 9,500 సినిమా హాళ్లలో టిక్కెట్ల అమ్మకం ద్వారా దేశానికి రోజుకు దాదాపు 30 కోట్ల రూపాయలు వస్తాయని గుర్తుచేశారు. వేతనాల్లో సబ్సిడీ, మూడేళ్లపాటు వడ్డీ లేని రుణాలు, పన్నులు, సుంకాలపై మినహాయింపు, విద్యుత్తుపై కనీస డిమాండ్ ఛార్జీల మాఫీ వంటి ప్రొడ్యూసర్స్ బృందం చేసిన డిమాండ్లను పరిశీలిస్తామని, సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. సినిమా హాళ్లను ప్రారంభించేందుకు మాత్రం కొద్ది రోజులు వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా అన్​లాక్​–1 కి సంబంధించి కేంద్ర హోంశాఖ.. దేవాలయాలు, హోటల్స్, రెస్టారెంట్లు తదితరాలు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. జూన్ 8 నుంచి షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకోవచ్చునని స్పష్టం చేసింది. కానీ, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, పబ్బులు లాంటివి మాత్రం తెరిచేందుకు అనుమతులు ఇవ్వలేదు.

 

Latest Updates