బీఆర్కే భవన్​కు వాస్తు ప్రాబ్లమ్‌‌

హైదరాబాద్ , వెలుగురాష్ట్ర పరిపాలన కేంద్రంగా మారనున్న బీఆర్కే భవన్​కు రిపేర్ల మీద రిపేర్లు జరుగుతున్నాయి. వాస్తు మార్పులు కూడా చేస్తున్నారు. అన్ని ఫ్లోర్లకు మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. పూర్తి స్థాయిలో భవన్​ అందుబాటులోకి రావడానికి 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పనుల కాంట్రాక్టు పొందిన సంస్థ సిబ్బంది చెప్తున్నారు. సెక్రటేరియెట్​లోని శాఖలకు, ఉన్నతాధికారులకు, మంత్రులకు బీఆర్కే భవన్​లో ఫ్లోర్ల వారీగా చాంబర్లు కేటాయించారు.  అన్ని ఫ్లోర్లకు పెయింటింగ్​ వేస్తున్నారు. వాష్ రూమ్ లు, లైట్లు రిపేర్​ చేస్తున్నారు. తమకు కేటాయించిన చాంబర్లలో  సీఎస్ జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా ఇటీవల ప్రవేశించారు. మరో రెండు రోజుల్లో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సీఎస్ సోమేశ్​కుమార్ కూడా ఇక్కడ తమకు కేటాయించిన చాంబర్ లోకి రానున్నట్లు తెలుస్తోంది.

వాస్తు మార్పులు

తొందరగా మరమ్మతులు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కాస్ట ఎక్కువగా టైమ్​ పట్టే అవకాశం ఉందని పనులు నిర్వహిస్తున్న సిబ్బంది అంటున్నారు. ముందుగా సివిల్ పనులు మాత్రమే అని చెప్పారని, ఇప్పుడు వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాలని కొందరు అధికారులు కోరుతున్నారని వారు చెప్తున్నారు. వాస్తుకు అనుగుణంగా  పలు ఫ్లోర్లలో గోడలు కూల్చడంతోపాటు క్యాబిన్లు ఏర్పాటు చేయాల్సి వస్తోందని, దీని వల్ల ఆలస్యమవుతోందని అంటున్నారు. సీఎస్ చాంబర్​లో గోడలు పగుల కొట్టి కొత్తగా నాలుగు దర్వాజలు నిర్మిస్తున్నారు. ఈస్ట్ ఫేస్ లో సీఎస్ కూర్చునేలా చాంబర్ లో రిపేర్లు చేస్తున్నారు. అత్యాధునికంగా మినీ కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  సీఎస్ చాంబర్ పనులు పూర్తయ్యే సరికి మరో వారం పట్టే అవకాశం ఉంది. అయితే రోడ్లు భవనాల శాఖ అధికారులు తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారని చెబుతున్నారు.

మంత్రుల ఫ్లోర్ లో స్టార్ట్ కాని రిపేర్లు

బీఆర్కే భవన్ లో మొదటి ఫ్లోర్ ను పూర్తిగా మంత్రుల చాంబర్లకు కేటాయించారు. అయితే ఈ ఫ్లోర్ లో ఇప్పటికీ మరమ్మతులు స్టార్ట్ కాలేదు. ఇప్పటిదాకా మొదటి ఫ్లోర్ లో మార్కెటింగ్ శాఖ కొనసాగింది. దీనిని ఎల్ బీ నగర్ లోని ఆ శాఖ కార్యాలయానికి షిఫ్ట్​ చేశారు. మొదటి ఫ్లోర్ లో శాఖకు సంబంధించి ఇంకా కొంత సామగ్రి ఉంది. దానిని షిఫ్ట్​ చేసిన తర్వాతే రిపేర్లు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆ సామాగ్రి నేడో రేపో తరలించనున్నట్లు అక్కడి సిబ్బంది అంటున్నారు.

రెండేండ్ల వరకు బీఆర్కే భవన్​లోనే..

కొత్త సెక్రటేరియెట్​పూర్తి కావడానికి ఏడాది అవుతుందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఏడాదిన్నర రెండేండ్లు పట్టొచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకు బీఆర్కే భవన్​ నుంచే ప్రభుత్వ పాలన సాగనుందని, అందుకే  పకడ్బందీగా రిపేర్లు చేయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. మరమ్మతులు మొత్తం పూర్తయి బీఆర్కే భవన్​ అందుబాటులోకి రావాలంటే ఈ నెలాఖరు వరకు సమయం పట్టొచ్చని చెబుతున్నారు. భవన్​కు రిపేర్లు పూర్తయిన తర్వాతే టెలిఫోన్, ఇంటర్ నెట్, డేటా సెంటర్ , సర్వర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. డేటా సెంటర్, సర్వర్ల కోసం రూ. 18 కోట్లు విడుదల చేయాలని ఐటీ శాఖ ఆర్థిక శాఖకు లేఖ రాయగా, ఆ లేఖను సీఎంవోకి పంపారు. సీఎంవో నుంచి రిప్లై వచ్చాక ఈ పనులు సాగే అవకాశమంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. కొత్త సెక్రటేరియెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖకు నిధులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Latest Updates