కొండ పోచమ్మ కాల్వలకు పరదాల చాటున రిపేర్లు

సిద్దిపేట, వెలుగు: మల్లన్నసాగర్‌‌ ‌‌నుంచి కొండ పొచమ్మ సాగర్ కు నీళ్లు తరలించే కెనాల్ పలుచోట్ల దెబ్బతినడం, మర్కూక్ పంపుహౌస్ వద్ద మట్టికొట్టుకుపోయి కాంక్రీట్ గోడలకు పగుళ్లురావడంతో అధికారులు రిపేర్లు మొదలుపెట్టారు. పదిహేను రోజుల కిందే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఇంతలోనే శుక్రవారం ఎర్రవల్లి వద్ద కాల్వకు గండిపడటం, పలుచోట్ల లైనింగ్ కొట్టుకుపోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. శనివారం తెల్లారే రిపేర్లు మొదలుపెట్టారు. కాల్వలోకి నీటి విడుదలను ఆపేశారు. కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద పడిన గండిని మట్టితో పూడ్చారు. కొడకండ్ల వద్ద దెబ్బతిన్న లైనింగ్‌‌ ను రిపేర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మర్కూక్ పంపు‌‌హౌస్ వద్ద భారీగా నష్టం జరగడంతో అక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

నిర్మాణాలు దెబ్బతిన్న ప్రాంతం చుట్టూ పరదాలు కట్టి రిపేర్లు మొదలుపెట్టారు. ఎవరినీ ఆ ప్రాంతం వద్దకు రానివ్వడం లేదు. పంపు‌‌హౌస్ కెనాల్‌‌ ‌‌ కాంక్రీట్ గోడల పక్కన ఉన్న మట్టికోతకు గురై.. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పలు నిర్మాణాలు కొట్టుకుపొయాయి. వీటన్నింటినీ పూర్తిగా తొలగించి మళ్లీ కట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంపై కొండ పొచమ్మ సాగర్‌‌ ‌‌డీఈ చాందిరామ్ను వివరణ కోరగా.. కొత్త ప్రాజెక్టు కావడం వల్ల వరద ఉధృతికి కొంత మేర దెబ్బతినడం సహజమేనని పేర్కొన్నారు. దెబ్బతిన్న పనులను రూల్స్ ప్రకారం సదరు కాంట్రాక్టరే పూర్తి చేస్తారని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

 

Latest Updates