కరోనా హెల్త్ బులెటిన్ లో రిపీట్ అవుతున్న తప్పులు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా హెల్త్ బులెటిన్ లో తప్పులు రిపీట్ అవుతున్నాయి. ముందు రోజు బులెటిన్ కు.. ఇవాళ్టి బులెటిన్ కు పొంతన లేకుండా నంబర్లు ఇస్తున్నారు. సోమ‌వారం 2 కేసులు వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. ఆ రెండు కేసులు కూడా హైదరాబాద్ పరిధిలోనే అని చూపించారు. అయితే ఆదివారం ఇచ్చిన హెల్త్ బులెటిన్ ప్రకారం GHMCలో మొత్తం 540 కేసులు ఉన్నాయి. కానీ సోమ‌వారం GHMC పరిధిలో 556 మొత్తం కేసులున్నట్లు చూపించారు. అంటే 16కేసులు ఎక్కువ చూపించినట్లు. అదే యాక్టీవ్ కేసుల విషయానికొస్తే నిన్న 371 ఉంటే.. సోమ‌వారం బులెటిన్ లో 29కేసులు పెంచి 400 చూపించారు. డిశ్చార్జిల విషయానికొస్తే.. ఆదివారం GHMC పరిధిలో 151 ఉంటే.. సోమ‌వారం 138 చూపించారు. దీంతో సోమ‌వారం డిశ్చార్జి అయిన వాళ్లు 13మంది తగ్గినట్లైంది.

కరోనా కేసుల హెల్త్ బులెటిన్ విషయంలో గందరగోళం మొదటినుంచి కొనసాగుతోంది. 2,3రోజులకు ఒక్కోరకం ఫార్మాట్ లో హెల్త్ బులెటిన్ ఇస్తున్నారు. మొదట్లో టెస్టుల వివరాలు ఇచ్చినా.. తర్వాత ఆ వివరాలు లేకుండానే రోజూ బులెటిన్లు రిలీజ్ చేస్తున్నారు. పదే పదే తప్పులు ఇస్తూ సవరణ బులెటిన్లు రిలీజ్ చేయడం అలవాటుగా మారుతోంది. ఆదివారం రాష్ట్రంలో 75 ఏళ్ల వృద్ధుడు కరోనాను గెలిచి డిశ్చార్జి అయ్యాడు. ఇంత పెద్ద విషయాన్ని బులెటిన్ లో సింగిల్ లైన్ వివరాలతో సరిపెట్టారు. డాక్టర్లకు, మెడికల్ స్టాఫ్ కు స్ఫూర్తినిచ్చే ఇలాంటి విషయాలు, వైద్య విజయాలను చెప్పుకుంటే మంచి సంకేతాలు పంపినట్టు అవుతుంది.

కేరళలో వృద్ధ దంపతులకు నయమైతే అక్కడి ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. వాళ్లను సంబురంగా ఇంటికి పంపించింది. అదే టైంలో వాళ్లకు చేసిన ట్రీట్మెంట్ తో డాక్టర్లకు, నర్సులకు మంచి పేరు వచ్చింది. ఆ వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్లు, వాళ్ల లైఫ్ స్టైల్ ఏంటీ ? వాళ్లకు ఎలాంటి ట్రీట్మంట్ ఇచ్మారు.. అనే వివరాలు తెలుసుకోడానికి దేశమంతా ఆసక్తి చూపించింది. ఇతర రాష్ట్రాల డాక్టర్లకు కూడా ఈ వివరాలు ఉపయోగపడ్డాయి. కానీ మన దగ్గర మాత్రం హెల్త్ బులెటిన్ లో నామమాత్రంగా చెప్పడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు.

Latest Updates