మొదలైన రీపోలింగ్.. సిరా చూపుడు వేలుకు పెట్టట్లేరు

మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో భాగంగా ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో ఎలక్షన్ వాయిదా పడింది. ఈ డివిజన్‌లో సీపీఐ, సీపీఎం రెండూ కలిసి పోటీ చేస్తున్నాయి. దాంతో అక్కడ ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సీపీఐ వ్యక్తి బరిలో నిలిచారు. అయితే బ్యాలెట్ పేపర్‌లో ఎన్నికల కమిషన్ సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించింది. దాంతో ఎన్నికలను వాయిదా వేయాలని సీపీఐ నాయకులు ధర్నాకు దిగారు. దాంతో ఎలక్షన్ కమిషన్ ఆ డివిజన్ వరకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వాయిదపడ్డ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. డివిజన్‌లో మొన్న ఎన్నికల రోజు జరిగిన పొరపాటును గుర్తించే లోపే కొంతమంది ఓట్లేశారు. వారి చూపుడు వేలుకు సిరా గుర్తు కూడా పెట్టాశారు. అయితే ఓటర్లు ఈ రోజు మళ్లీ ఓటేస్తారు కాబట్టి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు చూపుడు వేలుకు కాకుండా.. మధ్యవేలుకి సిరా పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ డివిజన్‌లో మొత్తం 54,665 ఓటర్లు ఉన్నారు. వీరికోసం 69 పోలింగ్ కేంద్రాలు, 350 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌లో ఎన్నిక వాయిదా పడటంతో మొన్న ప్రకటించాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను కూడా ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలకు అధికారులు అనుమతించారు.

ఈ డివిజన్‌లో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి కనకబోయిన రేణుకు, టీఆర్ఎస్ నుంచి పగిల్ల షాలిని, ఎంఐఎం నుంచి జవేరియా ఫాతిమా, సీపీఐ నుంచి ఫిర్దౌస్ ఫాతిమా, కాంగ్రెస్ నుంచి వీరమణి, ఇండిపెండెంట్‌గా కవిత బరిలో నిలిచారు.

Latest Updates