దండం పెడతా, మీ డబ్బులు తీసుకోండి

లండన్: బ్యాంక్‌లకు చెల్లించాల్సిన బాకీల్లో అసలును 100 శాతం చెల్లిస్తానంటూ లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా మరోసారి బ్యాంక్‌లకు చెప్పాడు. వాటిని తిరిగి తీసుకోవాలంటూ అభ్యర్థించాడు. ఇండియాకు అప్పగించే కేసుకు వ్యతిరేకంగా తాను వేసిన పిటిషన్‌పై బ్రిటీష్ హైకోర్టులో మూడు రోజుల విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ బయట మాల్యా మాట్లాడాడు. ‘బ్యాంక్‌లకు చేతులెత్తి దండం పెడతా.. అసలును 100 శాతం వెంటనే చెల్లిస్తాం.. తీసుకోండి.. నా గ్యారెంటీకి నేను కట్టుబడి ఉంటాను. పూర్తిగా చెల్లిస్తానంటున్నా. ప్రిన్సిపల్‌లో ఎలాంటి డిస్కౌంట్ కోరడం లేదు’ అని మాల్యా అన్నాడు. దివాలా కోడ్ కింద, చాలా కంపెనీలు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన మొత్తాల్లో హెయిర్‌‌కట్స్ పొందుతూ చేతులు మారుతున్నాయని, తాను ఎలాంటి హెయిర్‌‌కట్ కోరడం లేదని స్పష్టం చేశాడు. వారి మనీని పూర్తిగా తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నాడు. బకాయిలు చెల్లించనందుకు బ్యాంక్‌ల కన్సార్టియం వేసిన ఫిర్యాదులతో ఈడీ తన ఆస్తులను అటాచ్ చేసిందని మాల్యా పేర్కొన్నాడు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని తనను తాను సమర్థించుకున్నాడు. ‘ప్లీజ్ బ్యాంక్‌లు మనీ తీసుకోండి. ఈ ఆస్తుల నుంచి ఈడీ క్లయిమ్ చేస్తానంటోంది. ఒక వైపు ఈడీ, మరోవైపు బ్యాంక్‌లు అదే ఆస్తులపై ఫైట్ చేస్తున్నాయి’ అని మాల్యా అన్నాడు. అంతకుముందు కూడా అసలు చెల్లిస్తానని మాల్యా చెప్పాడు.

బ్యాంక్‌లకు రూ.9 వేల కోట్లకు పైగా బాకీ…

బ్యాంక్‌లకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన మాల్యా, దేశం విడిచి కొన్నేళ్ల క్రితం బ్రిటన్ పారిపోయాడు. అప్పటి నుంచి ఆయన్ను భారత్‌కు రప్పించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఈడీ, సీబీఐ తనపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించాడు. వీరు న్యాయంగా పోరాడితే, స్టోరీ డిఫరెంట్‌గా ఉండేదని అన్నాడు. ఈ మూడు రోజుల విచారణలో ఈడీ, సీబీఐ, ఇండియన్ హై కమిషన్ టీమ్ కూడా పాల్గొంది.

Latest Updates