ఈ తాబేళ్లకు మెమోరీ పవర్ ఎక్కువేనంట..

తాబేళ్లు నడకలో నెమ్మది గానీ.. తెలివితేటల్లో మాత్రం కాదట. వాటికి కొన్ని విషయాలు నేర్పిస్తే చాలు.. బాగా గుర్తుపెట్టుకుంటాయట. నేర్చుకున్న విషయాలను అవి తొమ్మిదేండ్ల తర్వాత కూడా మర్చిపోవట. గాలాపోగోస్, సీషెల్స్ దీవుల్లోని జెయింట్ టార్టాయిస్ లపై జపాన్ లోని ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్​సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

తొమ్మిదేండ్ల క్రితం..

గాలాపోగోస్, సీషెల్స్ దీవుల నుంచి తీసుకొచ్చి, వియన్నా, జూరిచ్ జూలలో ఉంచిన భారీ తాబేళ్లపై తొమ్మిదేండ్ల క్రితం రీసెర్చ్ జరిగింది. మామూలుగా జంతువులకు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఫుడ్ అందించడం ద్వారా.. ఆ పని చేస్తే ఫుడ్ ఇస్తారన్న విషయం అర్థమయ్యేలా చేస్తారు. దీనినే పావ్ లోవ్ ఎఫెక్ట్ అంటారు. ఎలుకలు, కుక్కలు, పిల్లులు, చింపాంజీల వంటి జంతువులు ఈ టెక్నిక్ ను ఈజీగా నేర్చేసుకుంటాయని తేలింది. అయితే, తాబేళ్లకు కూడా ఈ విషయం నేర్చుకునే తెలివితేటలు ఉన్నాయా? ఉంటే, ఎంత కాలం గుర్తుపెట్టుకోగలవు? అన్నది తేల్చేందుకు జపాన్ సైంటిస్టులు రీసెర్చ్ ప్రారంభించారు.

ఇదీ రీసెర్చ్..

ఒక పొడవాటి కర్రకు రంగు రంగుల బంతులను అమర్చారు. ఆ బంతులను తాబేళ్లు కొరికేలా ట్రెయినింగ్ ఇచ్చారు. అయితే, ఒక్కో తాబేలు దానికి కేటాయించిన ప్రత్యేకమైన రంగు బంతిని కొరికినప్పుడే స్ట్రాబెర్రీ పండ్లను ఇస్తూ వచ్చారు. దీంతో ఆ తాబేళ్లన్నీ తాము ఏ రంగు బంతి కొరికితే ఫుడ్ ఇస్తారో తెలుసుకున్నాయి. దాంతో ఎన్ని రంగుల బంతులను చూపినా.. తమకు ఫుడ్ ఇచ్చే రంగు బంతినే అవి కొరికాయి. అయితే, తొమ్మిదేళ్లు గడిచిపోయాక ఆ తాబేళ్లు ఇంకా ఆ విషయం గుర్తుపెట్టుకున్నాయా? అని సైంటిస్టులు టెస్ట్ చేశారు. వేర్వేరు రంగులున్న బంతుల స్టిక్స్ ను వాటి ముందు పెట్టగా, ఆ తాబేళ్లు కరెక్ట్ గా అప్పట్లో తమకు కేటాయించిన రంగు బంతులనే కొరికాయట. దీంతో మనుషుల్లాగానే సుమారుగా100 ఏండ్లకు పైగానే జీవించే ఈ తాబేళ్లకు తెలివితేటలు, మెమరీ కూడా బాగానే ఉందని తేలింది.

 

Latest Updates