మెటల్ లిథియం రిజర్వ్ లు దొరికేశాయ్!

బెంగళూరు: ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌ బ్యాటరీ తయారీలో అతి ముఖ్యమైనది లిథియం. మన దగ్గర లిథియం రిజర్వ్‌‌లు దొరకకపోతుండటంతో, వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని, ఈవీ బ్యాటరీలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఈ బ్యాటరీ కాస్ట్‌‌ ఎక్కువగా ఉండటంతో, ఈవీ కార్లు కూడా కాస్ట్‌‌లీగానే ఉన్నాయి. అయితే తాజాగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌ బ్యాటరీల తయారీకి ఉపయోగించే అత్యంత కీలకమైన మెటల్ లిథియం రిజర్వ్‌‌లు కర్నాటక రాష్ట్రంలో ఉన్నట్టు గుర్తించారు. బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో మాండ్య సమీపంలో లిథియం రిజర్వ్‌‌లున్నట్టు తెలిసింది. దీంతో ఇక నుంచి ఈవీ బ్యాటరీలు లోకల్‌‌గానే తయారు చేసుకునేందుకు వీలవుతుంది. అటామిక్ ఎనర్జీ కమిషన్ యూనిట్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ రీసెర్చర్లు దక్షిణ కర్నాటక జిల్లాలో జరిపిన సర్వేలో ఈ రిజర్వ్‌‌లు బయటపడ్డాయి. అక్కడ 14,100 టన్నుల లిథియం రిజర్వ్‌‌లున్నట్టు రీసెర్చర్లు అంచనావేశారు. ఈ విషయాన్ని కరెంట్ సైన్స్‌‌పై విడుదల చేసే జర్నల్‌‌ నాలుగో ఇష్యూలో ప్రచురించారు. ‘ప్రస్తుత డేటా ప్రకారం 0.5 కిమీ x 5 కిమీ ప్రాంతంలో 30,300 టన్నుల ఎల్‌‌ఐ20 ఉన్నట్టు అంచనావేస్తున్నాం. వీటి నుంచి 14,100 టన్నుల లిథియం మెటల్‌‌ వెలికితీయవచ్చు’ అని ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్, బ్యాటరీ టెక్నాలజీస్ నిపుణుడు ఎన్‌‌ మునిచంద్రయ్య చెప్పారు. అయితే అతిపెద్ద మేజర్ ప్రొడ్యూసర్లతో పోలిస్తే.. ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. చిలీలో 86 లక్షల టన్నుల, ఆస్ట్రేలియాలో 28 లక్షల టన్నుల, అర్జెంటీనాలో 17 లక్షల టన్నుల, పోర్చుగల్‌‌లో 60 వేల టన్నుల లిథియం రిజర్వ్‌‌లున్నాయని చెప్పారు. వాటితో పోలిస్తే… 14,100 టన్నులు చాలా తక్కువని పేర్కొన్నారు. ఇండియా తనకు కావాల్సిన మొత్తం లిథియాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది.

10 ఏళ్లలో 10 ఫ్యాక్టరీలు పెట్టాలని ప్లాన్….

ఇండియా దిగుమతి చేసుకునే లిథియం బ్యాటరీల విలువ రెండేళ్లలోనే మూడింతలు పెరిగిపోయింది. 2017లో రూ.2,746 కోట్లుంటే, 2019 ఆర్థిక సంవత్సరానికి రూ.8,583 కోట్లకు చేరుకుంది. 2019 నవంబర్ నాటికి ముగిసిన 8 నెలల కాలంలో అయితే, దేశీయ లిథియం బ్యాటరీ దిగుమతులు 929 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇండియాలో తన ఎనర్జీ అవసరాలకు లిథియం అవసరమని ఎక్స్‌‌పర్ట్స్ చెప్పారు. కానీ మన దగ్గర ఇప్పటి వరకు లిథియం లోకల్ రిజర్వ్‌‌లు లేవని తెలిపారు. లోకల్‌‌గా లిథియం మైన్స్‌‌ లేకపోవడంతో, ఇండియా ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్‌‌ను ఏర్పాటు చేసి, అర్జెంటీనా, బొలివియా, చిలీలో మైన్లను కొనుగోలు చేస్తోంది. కాగా వచ్చే పదేళ్లలో లిథియం అయాన్ బ్యాటరీలను రూపొందించడానికి 10 అతిపెద్ద ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది.

Latest Updates