కరోనా అనుమానంతో అంత్యక్రియలను అడ్డుకున్నారు

  • పోలీసులు, డాక్టర్లపై గ్రామస్థుల దాడి
  • పలువురిపై కేసు నమోదు
  • గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

అంబాలా: లోకల్‌ సివిల్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయిన 60 ఏళ్ల మహిళ అంత్యక్రియలను గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు, డాక్టర్లపై దాడి చేశారు. అంబులెన్స్‌ను ధ్వంసం చేశారు. హర్యానా అంబాలాలోని చంద్రాపూర్‌‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. చంద్రాపూర్‌‌ గ్రామానికి చెందిన మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులు, డాక్టర్లను ఆమె బంధువులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. కరోనాతో చనిపోయిందనే అనుమానంతో ఆమె అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన డాక్టర్లు, పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. లాక్‌డౌన్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అదనపు బలగాలను మోహరించిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్థులను చెదరగొట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతురాలికి కరోనా ఉందో లేదో తెలియనప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, గ్రామస్థులు అనవసరంగా గొడవ చేశారని పోలీసు అధికారి రామ్‌కుమార్‌‌ చెప్పారు. గ్రామస్థులపై కేసు నమోదు చేశామన్నారు. “ ఆస్తమాతో బాధపడుతున్న మహిళ మా హాస్పిటల్‌లో చేరింది. ఊపిరి తీసుకోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆమె ట్రీట్‌మెంట్‌ ఇస్తుండగానే చనిపోయింది. శ్యాంపిల్స్‌ సేకరించి కరోనా టెస్ట్‌కు పంపించాం. టెస్ట్‌ రిజల్ట్‌ రావాల్సి ఉంది. రూల్స్‌ ప్రకారం అధికారులు చెప్పిన దగ్గర అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చాం” అని డాక్టర్‌‌ కుల్దీప్‌ సింగ్‌ చెప్పారు. హర్యానాలో ఇప్పటి వరకు 289 కేసులు నమోదు కాగా.. అంబాలాలో 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ముగ్గురు చనిపోయారు.

Latest Updates