120 మంది పైలెట్ల రాజీనామా

ఎయిర్‌ ఇండియాకు మరో సమస్య
జీతాల పెంపు, ప్రమోషన్లు
లేకపోవడమే కారణం

వాటాల అమ్మకాలతో కష్టాల నుంచి గట్టెక్కుదామని అనుకుంటున్న ఎయిర్‌‌‌‌ ఇండియాకు కొత్త చిక్కు వచ్చిపడింది. జీతభత్యాలు పెంచకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో  పైలెట్లు సామూహికంగా రాజీనామాలు చేశారు. ఎయిర్‌‌‌‌బస్‌‌‌‌ ఏ–320 విమానాలు నడిపే 120 మంది పైలెట్లు జీతాలు, ప్రమోషన్ల కోసం మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఇచ్చిన వినతిపత్రాలకు స్పందన రాకపోవడంతో రాజీనామాలు అందజేశారు. దాదాపు రూ.60 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్న ఎయిర్‌‌‌‌ ఇండియాలో వాటాలు అమ్మి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో ఈ సమస్య వచ్చింది.

ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన పైలెట్‌‌‌‌ ఒకరు మీడియాతో మాట్లాడుతూ కనీసం జీతాలు కూడా సరైన సమయానికి అందడం లేదని చెప్పారు. ‘‘మమ్మల్ని ఐదేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. చాలా తక్కువ జీతం ఇస్తున్నారు. కనీసం అనుభవం వచ్చిన తరువాత కూడా జీతాలు పెంచడం లేదు. ప్రమోషన్లు ఇవ్వడం లేదు. మార్కెట్లో ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. మాకు ఉద్యోగాలు తప్పక దొరుకుతాయి’’ అని ఆయన వివరించారు.

ఇండిగో ఎయిర్‌‌‌‌, గో ఎయిర్‌‌‌‌, విస్తారా, ఎయిర్‌‌‌‌ ఆసియా, ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ వంటి కంపెనీలు ఎయిర్‌‌‌‌బస్‌‌‌‌ విమానాలను నడుపుతున్నాయి. పైలెట్లు రాజీనామా చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు వస్తాయా ? అన్న ప్రశ్నకు ఎయిర్‌‌‌‌ ఇండియా ఆఫీసర్‌‌‌‌ ఒకరు బదులిస్తూ తమ దగ్గర అవసరానికి మించి పైలెట్లు ఉన్నారని తెలిపారు. రాజీనామాలతో ఏ ఒక్క విమానానికీ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు రెండు వేల మంది పైలెట్లు ఉండగా, వీరిలో 400 మంది ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు.

Latest Updates