ఆర్బీఐ, ఆడిటర్లదే బాధ్యత : ఠాకూర్

ఆర్బీఐ, ఆడిటర్లదే బాధ్యత
బ్యాంక్‌‌ల కుంభకోణాలపై ఠాకూర్ స్పందన
ఆస్తుల అమ్మి బకాయిలు కడతాం.. వాధ్వాన్‌‌లు
ఆర్‌‌‌‌బీఐ, ఆర్థిక శాఖకు లేఖ

జ్యుడిషియల్ కస్టడీలో వాధ్వాన్‌‌లున్యూఢిల్లీ: పీఎంసీ బ్యాంక్‌‌లో కుంభకోణానికి రెగ్యులేటరీ, ఆడిటర్, మేనేజ్‌‌మెంటే బాధ్యత వహించాలని, ఇతర బ్యాంక్‌‌ల మోసానికి కూడా ఇదే వర్తిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ‘పీఎంసీ బ్యాంక్‌‌ను లేదా ఏ ఇతర బ్యాంక్‌‌ను తీసుకున్నా.. ఈ ఇష్యూలను చూసుకోవడంలో మొదట రెగ్యులేటర్​ పని. రోజూ వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న బ్యాంక్‌‌ మేనేజ్‌‌మెంట్, ఆడిటర్‌‌‌‌ దీనికి బాధ్యత వహించాలి. ఇలాంటి మోసాల్లో ఎవరైన ప్రమేయం ఉన్నట్టు తేలితే.. వెంటనే ఈడీ చర్యలు తీసుకుంటుంది. వారిని అరెస్ట్ కూడా చేసి, ప్రాపర్టీలను అటాచ్ చేస్తుంది’ అని టైమ్స్ నెట్‌‌వర్క్ ఇండియా ఎకానమిక్ కాంక్లేవ్ ఈవెంట్‌‌లో ఠాకూర్ చెప్పారు. బ్యాంక్‌‌ల బ్యాలెన్స్ షీటును ఆరోగ్యకరంగా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకొస్తోందని ఠాకూర్ తెలిపారు. యూపీఏ 2 కాలంలో పెద్ద మొత్తంలో రుణ బకాయిలు పెరిగాయన్నారు.

2009 నుంచి 2014 కాలంలో యూపీఏ 2 అధికారంలో ఉందని, 2009 వరకు అవుట్‌‌స్టాండింగ్ రుణాలు రూ.18 లక్షల కోట్లు ఉంటే, అవి 2014 నాటికి రూ.58 లక్షల కోట్లకు పెరిగాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక, మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ.. బ్యాంక్‌‌ల ఆస్తుల క్వాలిటీ రివ్యూ చేపట్టి, బ్యాలెన్స్ షీట్లను క్లీన్ చేశారని చెప్పారు. బ్యాంక్‌‌లకు రీక్యాపిటలైజేషన్ కూడా అందించామని తెలిపారు. మూడేళ్ల క్రితం పలు క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొన్న పీఎన్‌‌బీ సైతం నేడు లాభాల్లోకి వచ్చిందన్నారు. ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌‌రప్టసీ కోడ్‌‌తో రూ.1.78 లక్షల కోట్లను ప్రభుత్వం వెనక్కి రప్పించ గలిగిందని తెలిపారు. అప్పు ఇచ్చేవారి, పుచ్చుకునే వారి మధ్య సంబంధాలను మెరుగుపరిచామని, బ్యాంక్‌‌ల ద్వారా ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు రూ.3,44,830 కోట్లను అందించామని ఠాకూర్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

మరోవైపు పీఎంసీ బ్యాంక్‌‌ కుంభకోణంలో ప్రధాన పాత్రదారులైన రియల్ ఎస్టేట్ గ్రూప్ హెచ్‌‌డీఐఎల్ ప్రమోటర్లు రాకేష్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్‌‌లు తమ ఆస్తులు అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఆస్తులు అమ్మి బ్యాంక్‌‌ బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారు. తమకున్న రోల్స్ రాయిస్, సొంత ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ వంటి ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్‌‌‌‌బీఐ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను వాధ్వాన్‌‌లు కోరుతున్నారు. ఈ మేరకు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్‌‌కు, కేంద్ర ఆర్థిక మంత్రికి, ఆర్‌‌‌‌బీఐకి వాధ్వాన్‌‌లు లేఖ రాశారు. ఈ లేఖలో అటాచ్ చేసిన 18 ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని వాధ్వాన్‌‌లు కోరారు. వాధ్వాన్‌‌లను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటూ కోర్టు రిమాండ్ విధించింది. వాధ్వాన్‌‌ల అధికార ప్రతినిధి ఈ లేఖను విడుదల చేశారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్‌‌ బ్యాంక్‌‌లో రూ.4,355 కోట్ల కుంభకోణానికి పాల్పడిన వాధ్వాన్‌‌లను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల వింగ్‌‌ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వాధ్వాన్‌‌ల ఆస్తుల్లో రోల్స్ రాయిస్,బెంట్లీ, బీఎండబ్ల్యూలు..

‘ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నెం. 86/2019లోని ఆరోపణలను ఖండిస్తున్నాం. డిపాజిటర్ల ప్రయోజనాల మేరకు ఈ సమస్యను పరిష్కరించేందుకే కృషి చేస్తున్నాం. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, అక్టోబర్ 3 తేదీల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ఆర్‌‌‌‌బీఐ రాసిన లేఖల్లో, మా ఆస్తులను అమ్ముకునేందుకు వెంటనే అనుమతివ్వాలని కోరాం. సంబంధిత కంపెనీలకు ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా లోన్స్ ప్రిన్సిపల్‌‌ను అడ్జెస్ట్ చేస్తాం’ అని వాధ్వాన్‌‌ల సంతకంతో రాసిన లేఖలో ఉన్నాయి. ఈ లేఖలో లిస్ట్‌‌ చేసిన ఆస్తుల్లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్, బీఎండబ్ల్యూ 730 ఎల్‌‌డీ, హంబుల్ అంబాసిడర్ వంటి ఆల్ట్రా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవన్నీ రాకేష్ వాధ్వాన్‌‌కు చెందినవి. రాకేష్ కొడుకు సారంగ్ వాధ్వాన్‌‌కు చెందినవి ఫాల్కన్ 2000 ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్, ఆడి ఏజీ, రెండు ఎలక్ట్రిక్ కార్లు, ఫెర్ర్టియాచ్ 881, మూడు క్వాడ్ బైక్స్(ఏటీవీ), స్పీడ్ బోట్(డాల్ఫిన్ సూపర్ డీలక్స్ 31హెచ్‌‌టీ, 7 సీటర్) ఉన్నాయి. పీఎంసీ బ్యాంక్ మేనేజ్‌‌మెంట్ బ్యాంకింగ్ రెగ్యులేటరీ రూల్స్‌‌ను తుంగలో తొక్కి.. పెద్ద మొత్తంలో రుణాలను దివాలా తీసిన హెచ్‌‌డీఐఎల్ గ్రూప్ సంస్థలకు ఇచ్చింది.  బ్యాంక్‌‌లో 70 శాతానికి పైగా అడ్వాన్స్‌‌లు హెచ్‌‌డీఐఎల్ గ్రూప్‌‌కే వెళ్లాయి. ఈ గ్రూప్ రుణాలను తిరిగి చెల్లించలేక చేతులెత్తేయడంతో, పీఎంసీ బ్యాంక్ దివాలా తీసింది.

14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి జాయ్ థామస్..

పీఎంసీ బ్యాంక్‌‌ కుంభకోణంతో  సంబంధమున్న బ్యాంక్‌‌ మాజీ ఎండీ జాయ్ థామస్‌‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు ఆయన్ను రిమాండ్‌‌కు పంపింది.  బ్యాంక్ మాజీ డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాకు  కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అరోరాను బుధవారమే ముంబై పోలీసుల ఆర్థిక నేరాల వింగ్ అరెస్ట్ చేసింది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణంపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరోరాను ప్రశ్నిస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో అరోరా నాలుగో నిందితుడు. ఆర్థిక నేరాల వింగ్ అధికారుల ప్రకారం.. అరోరా పీఎంసీ బ్యాంక్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేశారు. అంతేకాక లోన్ కమిటీలో కూడా ఉన్నారు. రుణాల జారీ ప్రక్రియలో అరోరా ప్రమేయం కూడా ఉందని తేలినట్టు అధికారులు చెప్పారు. అరోరా, థామస్‌‌లని మాత్రమే కాక, పీఎంసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ వయం సింగ్​ను కూడా అరెస్ట్ చేశారు. వాధ్వాన్‌‌లు కూడా పోలీసుల అదుపులో  ఉన్న సంగతి తెలిసిందే. పీఎంసీ బ్యాంక్ టాప్ అధికారులు, వాధ్వాన్‌‌లకు వ్యతిరేకంగా ఈ నెల మొదట్లోనే ఆర్థిక నేరాల వింగ్ కేసు రిజిస్టర్ చేసింది. పీఎంసీ బ్యాంక్‌‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత, విత్‌‌డ్రాయల్స్‌‌పై ఆర్‌‌‌‌బీఐ పరిమితి విధించింది. ప్రస్తుతం రూ. 40 వేల దాకా విత్‌‌డ్రాయల్స్‌‌ను అనుమతిస్తున్నారు.

Latest Updates