- ఏది కొన్నా కిలో రూ. 80 నుంచి రూ.100
- జులై వస్తే కానీ తగ్గవంటున్న వ్యాపారులు
- రేట్లు చూసి బెంబేలెత్తుతున్న జనం
హైదరాబాద్, వెలుగు: టమాట ధరలు మళ్లీ కొండెక్కాయి. నిరుడు మాదిరే ఈసారి కూడా రోజు రోజుకు రేట్లు జంప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పంట సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్‌కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. మూడు రోజుల కింద రూ.60 నుంచి రూ.70 పలికిన కిలో టమాట ధరలు.. తాజాగా రూ.వంద దాటాయి. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే చాన్స్ ఉన్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఎండ తీవ్రత తగ్గినా ఇతర కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పచ్చిమిర్చి కిలో ధర రూ.120కి పైగానే పలుకుతున్నది. వంద రూపాయలకు మూడు, నాలుగు కిలోలు వచ్చే ఉల్లిగడ్డ ప్రస్తుతం రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఆకుకూరలను సైతం కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ఆకుకూర తీసుకున్నా.. నిన్న మొన్నటివరకు రూ.20కి నాలుగు కట్టల వరకు ఇవ్వగా..ప్రస్తుతం రెండు, మూడు కట్టలే చేతిలో పెడుతున్నారు. మార్కెట్లో ఏ కూరగాయ కొనాలన్నా పావు రూ.20 చెబుతుండడంతో.. రెగ్యులర్‌గా కిలోల చొప్పున కొనే వినియోగదారులు ధరలు చూసి అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు.
మార్కెట్‌కు వచ్చే వెజిటెబుల్స్16 శాతమే ఇక్కడివి..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి పలురకాల కూరగాయలు దిగుమతి అవుతాయి. ఇక్కడ పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్‌కు ఇప్పుడు వచ్చే కూరగాయల్లో 84 శాతం ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తుండగా.. మన రాష్ట్రం నుంచి కేవలం 16 శాతం మాత్రమే కూరగాయలు హైదరాబాద్ మార్కెట్‌కు వస్తున్నాయి. బుధవారం బోయిన్పల్లి మార్కెట్‌కు 23,840 క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా దీనికి రెండు, మూడు రెట్లు వస్తే కానీ మనకు సరిపోయే పరిస్థితి ఉండదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కూరగాయల కొరతతో చాలా వరకు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వచ్చిన వాటిలోనూ డిమాండ్ ఉన్న కూరగాయలు చాలా తక్కువగా వచ్చాయి. బెండ, బీర, కాకరవంటి అందుబాటులో ఉండే కూరగాయలు కూడా తక్కువ వస్తున్నాయి. ఫలితంగా కూరగాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఆలుగడ్డ, ఆన్గెపుకాయ, క్యారెట్ లాంటివే వెయ్యి క్వింటాళ్లకు పైగా వచ్చాయి.
భారీగా తగ్గిన టమాట లోడ్లు
సాధారణంగా హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్‌కు 5 వేల క్వింటాళ్ల టమాటా మార్కెట్‌కు వస్తే కానీ మన అవసరాలకు సరిపోదు. వచ్చిన టమాటలోనూ 96.66 శాతం బయట నుంచే వస్తుండగా.. 3.34% మాత్రమే మన రాష్ట్రం నుంచి వస్తున్నది. ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. బుధవారం బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు 2,125 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది. ఇందులో తెలంగాణ లో పండిన పంట 71 క్వింటాళ్లు మాత్రమే. మిగతా పంట ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అయింది. ఇందులో వెయ్యి క్వింటాళ్లు ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చింది. రాష్ట్రంలో గజ్వేల్, మేడ్చల్, జహీరాబాద్, తూప్రాన్, వికారాబాద్, శామీర్‌పేట్, సిద్దిపేట, బోనగిరి, గద్వాల ప్రాంతాల నుంచి రావాల్సినంత టమాట లోడ్లు రావడం లేదు. ఎండల ప్రభావంతో టమాట సాగు తగ్గడమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. టమాట కొరత ఏర్పడడంతో బహిరంగ మార్కెట్లో ఈ కూరగాయ ధరలు మండిపోతున్నాయి.
సంచి కూడా నిండుతలేదు
పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో అన్నిరకాల ధరలకు రెక్కలు వచ్చాయి. రూ.500 పట్టుకుని మార్కెట్‌కు వెళితే సంచికూడా నిండడం లేదు. నిత్యం వంటల్లో వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు హోల్‌సేల్‌లోనే కిలో రూ.100 వరకు పలుకుతుండగా.. రిటైల్‌గా కిలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు. దుంపకూరలు కూడా కిలో రూ.60కి తగ్గడం లేదు. అన్నిరకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్‌వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జులైలో కొంత ఉపశమనం
ఇతర రాష్ట్రాల్లో కూరగాయల సాగు కొంత మెరుగపడడంతో జులైలో కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మన రాష్ట్రం కూరగాయలు అందుబాటులోకి రావాలంటే ఆగస్టు ఫస్ట్ వరకు ఆగాల్సిందేనని మార్కెటింగ్, హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు కొంత తిప్పలు తప్పవని చెబుతున్నారు. మొన్నటిదాకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల సాగుపై ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. యాసంగిలో చివరాకర్లో వెజిటెబుల్స్ సాగును ప్రోత్సహించడమే ఈ సమస్యను పరిష్కారమని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు
ప్రెంచ్ బీన్స్ 175 –210
టమాటా 100–120
పచ్చిమిర్చి 100–120
దొండకాయ 70–80
బీరకాయ 80–100
బెండకాయ 80–100
కాకరకాయ 80
క్యారెట్ 80
చామదుంప 60

