రేప్ అండ్​ మర్డర్ ​కేసుల్లో.. తీర్పులు వేగంగా చెప్పాలె: సుప్రీం మాజీ జడ్జి

    కఠిన చట్టాలు ఉన్నా నేరాలు తగ్గట్లే

    సుప్రీంకోర్టు రిటైర్డ్​ జస్టిస్​ చలమేశ్వర్

హైదరాబాద్, వెలుగు: చట్టాలను ఎంత కఠినంగా చేసినా అత్యాచారాలు, హత్యలు తగ్గడంలేదని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్​ జాస్తి చలమేశ్వర్​ అన్నారు. ఈ కేసుల్లో తీర్పు వెలువడేందుకు చాలా సమయం తీసుకోవడమూ దీనికి ఓ కారణమని అన్నారు. మహిళల రక్షణ, సవాళ్లు అనే అంశంపై సీఆర్ ఫౌండేషన్ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. సీపీఐ నేత సురవరం సుధాకర్​రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో చలమేశ్వర్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శాంతిభద్రతలను కాపాడటం వారి బాధ్యతని చెప్పారు. దేశంలో నూటికి కేవలం 5, 6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నచట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రిటైర్డ్ ఐపీఎస్​అధికారి సి.ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ.. అత్యాచార కేసుల్లో నిందితులను కొట్టి చంపాలని, ఉరితీయాలని కోరడం సరికాదన్నారు. ప్రతి పోలీస్ ​స్టేషన్​లో ఉమెన్స్​వింగ్​ఏర్పాటు చేయాలనీ, అత్యాచారాలు, హత్య కేసులను మహిళా పోలీసులతో విచారించాలన్నారు. సురవరం మాట్లాడుతూ… హైదరాబాద్ లో దిశా ఘటనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పోలీసులు సకాలంలో స్పందించలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి మాట్లాడారు.

Latest Updates