ఎవడయ్య సొమ్మని చింతమడకకు లక్షలు ఇచ్చావ్ : రేవంత్ రెడ్డి

మిడ్ మానేరు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఇండ్లు కట్టుకోవడానికి రూ.5.04 లక్షలు,18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు రూ.2 లక్షలు ఇస్తామంటే సంబురపడ్డారనీ.. అనేక సార్లు హామీ ఇచ్చి అరెస్టులు చేయించారని విమర్శించారు. రెండోసారి బహురూపుల వేషంలో వచ్చి కేసీఆర్ మళ్లీ గెలిచాడనీ.. నిర్వాసితులు ఓట్లేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. పక్కదేశంలో ఉండే నాయకుడిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు.

మిడ్ మానేరు నిర్వాసితులు కురుక్షేత్రానికి సిద్ధం కావాలి

“13 సంవత్సరాలుగా పోరాడుతున్న 13 గ్రామాల మిడ్ మానేరు నిర్వాసితుల అజ్ఞాత ముగిసింది. ఇక కురుక్షేత్రం చేయాల్సిందే. నీళ్ల ముసుగులో కేసీఆర్ ధన దోపిడీ చేస్తున్నాడు. మిడ్ మానేరు నిర్వాసితుల ఉసురు కేసీఆర్ కు తగులుతుంది.” అన్నారు రేవంత్ రెడ్డి.

సభకు భారీగా జనం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాకలో మిడ్ మానేరు నిర్వాసితుల డిమాండ్ల సాధన సభ నిర్వహించారు. 12 గ్రామాలనుంచి నిర్వాసితులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి, గాయకుడు ఏపురి సోమన్న , గాయని విమలక్క, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, ముంపు గ్రామాల నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు హాజరయ్యారు.

ఇసుక లారీల కింద తొక్కించి చంపుతున్నారు

“ఒకనాడు సిరిసిల్ల చేనేతకు పెట్టింది పేరు. అగ్గిపెట్టెలో చీరలు నేసిన ఘనత సిరిసిల్లది. కానీ ఇప్పుడు ఇసుక లారీల కింద సిరిసిల్ల ప్రజలను తొక్కించి చంపుతున్నారు. ఎందరో పోరాడితే వచ్చిన తెలంగాణలో ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారా? ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్..  ఎన్ని ఇచ్చినవని అడిగితే అరెస్టులు చేయించారు” అన్నారు రేవంత్ రెడ్డి.

సంతోష్ కూలీపనికి పోయిండని ఇచ్చారా ఎంపీ పదవి?

“ఆడవాళ్లకు మంత్రి పదవి లేదు. ఉన్న మంత్రులకు జవసత్వాలు లేవు. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్న కరీంనగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు. ఎవడయ్య జాగీరని చింతమడకలో ఇంటికి పది లక్షలు ఇచ్చినవ్.  నిర్వాసితులకు ఎందుకు ఈయవ్. కూలీ పనికి పోతున్నడని ఎంపీ సంతోష్ కు పట్టా ఎట్లా ఇచ్చారు.  కేసీఆర్ సడ్డకుడు రవీందర్ రావు పెద్దరికం ఏందీ. పేకాట క్లబ్బులు, ఇసుక అక్రమ రవాణా వెనకున్నది ఆయనే. ఈటల రాజేందర్ కడుపులున్నదంతా కక్కిండు. కానీ పేదల గురించి కూడా మాట్లాడితే బాగుండేది. ఉద్యమ సమయంలో అమెరికా బాత్రూంలు కడిగిన కేటీఆర్ ఇప్పుడు ఏకు మేకైండు. ఈటల బద్దైలండనుకున్నా.. కానీ కేటీఆర్ ఫోన్ చేయగానే తుస్సుమన్నడు. ఇదేనా నీ పౌరుషం. టీఆర్ఎస్ పార్టీ దొంగల బండి. అందులో ఉన్నోళ్లంతా దొరికినంత దోచుకుంటున్నరు” అన్నారు రేవంత్ రెడ్డి.

ఇందిరాపార్క్ లో ధర్నా చేద్దాం

“బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు ఇందిరా పార్కు దగ్గర 2 రోజులు మిడ్ మానేరు నిర్వాసితులకోసం ధర్నా చేద్దాం. ఇవాళ్టి నుంచే హైదరాబాద్ కు పాదయాత్ర మొదలుపెట్టండి. పోరాటంతోనే సమస్యల పరిష్కారం అవుతుంది” అని చెప్పారు రేవంత్ రెడ్డి.

Latest Updates