అడవి బిడ్డల బతుకులు ఆగం చేస్తరా: రేవంత్ రెడ్డి

నల్లమలలోయురేనియం తవ్వకాలతో పర్యావరణం నాశనం అవుతుందని, జీవవైవిధ్యానికి పెను ప్రమాదం తప్పదని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎంపీ ఎనుముల​రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. ప్రకృతి సంపదతో కళకళలాడే నల్లమల ఇలాంటి చర్యలతో పూర్తిగా వల్లకాడుగా మారిపోతుందన్నారు. యురేనియం పేరుతో నల్లమలలోని ప్రకృతి సంపదతో పాటు ప్రజల బ్రతుకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పు తెస్తున్నాయని ఆయన ఫైర్​అయ్యారు. అడవిబిడ్డల బతుకులను ఆగం చేస్తారా? అని ప్రశ్నించారు. ఆదివారం నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్​మండలంలోని మల్లాపూర్, అప్పాపూర్, సార్లపల్లి చెంచు పెంటలలో ఆయన పర్యటించారు. ఆదివాసీ చెంచు కుటుంబాలతో మాట్లాడిన ఆయన వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అమ్రాబాద్​మండల పరిధిలో యురేనియం తవ్వకాల కోసం లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంతకం చేయడం, దానిని సీఎం కేసీఆర్ అమలు చేయడంతో వారిద్దరి కుతంత్రాలు బయటపడ్డాయని రేవంత్​అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అనుమతులు అడిగితే వాటిని తిరస్కరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ, ఇక్కడ ఉన్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికే బాలరాజు, సీఎం కేసీఆర్ కుమ్మక్కై కుతంత్రాలు పన్నుతున్నారు”అని ఆయన ఆరోపించారు.

పర్మిషన్లు క్యాన్సిల్ ​చేసుకోవాలె

నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు. నల్లమల ప్రజలకు హాని కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, వారికోసం ఎంతటి పోరాటానికై నేను సిద్దమేనని హెచ్చరించారు. ‘‘ఆదివాసీలకు అడవిలో జీవించే హక్కు ఉంది. రాజ్యాంగంలో కల్పించిన రక్షణ మేరకు ప్రజల జీవించే హక్కును కాపాడేలా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు రక్షణ కరువైపోయింది. నిరంకుశ పాలనతో ప్రజా సంక్షేమం గాడి తప్పింది” అని రేవంత్​ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్​జిల్లా కాంగ్రెస్​కమిటీ ప్రెసిడెంట్ డా.చిక్కుడు వంశీకృష్ణ, నాయకులు సతీష్ మాదిగ, డా. అనూరాధ, యురేనియం వ్యతిరేక పోరాట జేఏసీ నాయకులు, ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకుడు పవన్, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Latest Updates