ఓటుకు నోటు కేసు : విచారణకు హాజరైన రేవంత్

ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. కేసులో A-1గా ఉన్న కాంగ్రెస్  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ..ఇవాళ విచారణకు రావాలని నోటీసులు జారీ చేయటంతో.. ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కేసుకు సంబంధించిన పత్రాలతో హాజరైన రేవంత్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేంనరేందర్ రెడ్డిని గెలిపించేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహలను నిందితులుగా తెలిపింది. ACB చార్జిషీట్ ఆధారంగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్ రెడ్డిని ఇప్పటికే విచారించిన అధికారులు.. అనేక విషయాల మీద ఆరా తీశారు.

A-2గా ఉన్న ఉదయ్ సింహను నిన్న తొమ్మిది గంటలపాటు విచారణ జరిపింది ఈడీ. ముఖ్యంగా స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని.. ఈడీ అధికారులు ఉదయ్ సింహను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉదయ్ సింహకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఇవాళ A -1గా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు.

Latest Updates