కేసీఆర్ ముందు నీ దోపిడీ ఆపు : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ‘రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని కేసీఆర్‌‌ చెబుతున్నరు. గాడిలో పెట్టేందుకు నిబంధనలు పాటించాలంటున్నరు. ముందు తన కుటుంబం దోపిడీని ఆపాలి’ అని మల్కాజ్‌‌గిరి ఎంపీ రేవంత్‌‌రెడ్డి విమర్శించారు. దేశంలో శ్రీమంతుల జాబితాలో కేసీఆర్‌‌ కుటుంబం, దివాలా రాష్ట్రాల లిస్టులో తెలంగాణ రాష్ట్రం నిలిచాయని చెప్పారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో రేవంత్ మాట్లాడారు. ఒకట్రెండు కంపెనీలకే కాంట్రాక్టులిస్తూ ప్రజాధనాన్ని కేసీఆర్‌‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన కుటుంబం 2019 ఎన్నికల అఫిడవిట్‌‌లో చూపించిన ఆస్తులను ప్రజలు గమనించాలన్నారు. కేసీఆర్‌‌ కుటుంబం దోపిడీ ఆపేస్తేనే తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు భద్రత కరువైందన్నారు. నిర్లక్ష్యపు పాలనతో రాష్ట్రాన్ని బొందల గడ్డ చేశారని ఘాటుగా విమర్శించారు. మిగులు బడ్జెట్‌‌తో రాష్ట్రం ఏర్పడితే ఆరేళ్లలో 3 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. భారత్ బచావో కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వమిచ్చే సందేశాన్ని రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు.

ఎన్నారై మోడీ

విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు దేశంలో కనిపిస్తున్న ప్రధాని ఎన్నారై మోడీ అని రేవంత్ విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడేంజరిగినా స్పందించే ప్రధాని.. ఉన్నావ్, దిశ, ఆదిలాబాద్ ఘటనలపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.

ఫాం హౌస్​లనే కేసీఆర్‌‌: పొన్నాల

రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, దోపిడీ కోసమే కేసీఆర్ ప్రణాళికలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అవినీతిపై చర్చకు రావాలని పిలిస్తే ఫాం హౌస్​, ప్రగతి భవన్‌‌లకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు.

‘భారత్ బచావో’లో రాష్ట్ర నాయకత్వం

కేంద్రం విధివిధానాలకు వ్యతిరేకంగా ‘భారత్ బచావో’ పేరిట శనివారం ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రం నుంచి 4 వేల మంది పార్టీ శ్రేణులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రధాన వేదికపై టీపీసీసీ, సీఎల్పీ లీడర్‌‌ కూర్చోగా.. ఎంపీలు, మాజీ ఎంపీలు వేదికకు ఇరు వైపుల ఏర్పాటు చేసిన వేదికలపై కూర్చున్నారు. మాజీ మంత్రులు పొన్నాల, శ్రీధర్ బాబు, ఇతర నేతలు సామాన్య జనాల్లోనే కూర్చున్నారు. కాగా, భారత్ బచావోలో పాల్గొనేందుకు వచ్చిన ఎన్‌‌ఎస్‌‌యూఐ రాష్ట్ర బృందం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాను కలిసింది.

Latest Updates