రేపిస్టులకు ఉరే సరి

సోమవారం పార్లమెంట్​తోపాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ‘జస్టిస్​ ఫర్​ దిశ’ నినాదం మారుమోగింది. నిందితుల్ని వెంటనే ఉరితీయాలంటూ అన్నివర్గాల ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు. ఢిల్లీలోని జంతర్​మంతర్​ దగ్గర జరిగిన నిరసనలో స్డూడెంట్​, విమెన్​ గ్రూపులు నల్లరిబ్బన్లతో నిరసన తెలిపారు. వారికి  పలువురు ఎంపీలు మద్దతు పలికారు.

న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాదీ వెటర్నరీ డాక్టర్​ దిశ హత్యోదంతాన్ని పార్లమెంట్​ ఒక్కటిగా ఖండించింది. రేపిస్టులకు వెంటనే ఉరి శిక్ష అమలుచేయాలని, ఆ మేరకు చట్టాలను బలోపేతం చేయాలని పార్టీలకు అతీతంగా ఎంపీలు డిమాండ్​ చేశారు. సోమవారం లోక్​సభ, రాజ్యసభలో  దిశ అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సమాధానమిస్తూ.. అన్ని పార్టీలు సరేనంటే రేప్​లకు సంబంధించి కఠిన చట్టాన్ని తెచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

పొలిటికల్​ విల్​ కావాలి: రాజ్యసభ

ఆడవాళ్లపై అఘాయిత్యాలను అడ్డుకోవడానికి, రేప్​లాంటి తీవ్ర నేరాలకు పాల్పడేవాళ్లను కఠినంగా శిక్షించడానికి ఇప్పుడున్న చట్టాల్లో మార్పులు చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదని, పొలిటికల్​ విల్​పవర్​తోనే మార్పు సాధ్యమని రాజ్యసభ చైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతోన్న అకృత్యాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తోసిపుచ్చిన ఆయన.. దిశా హత్యోదంతంపై చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించిన ఉపరాష్ట్రపతి కంటనీరుపెట్టుకున్నారు. మహిళలపై దాడులు చేయడం ఒక సామాజిక రోగంగా మారిపోయిందన్నారు. హైదరాబాద్​లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని, ప్రజల మైండ్​సెట్ మారితేనే మహిళల పట్ల నేరాలు తగ్గుతాయని చెప్పారు. అత్యాచారాల్ని అడ్డుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలను తీసుకురావాలన్న విల్​పవర్​  కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని నాయకులకు ఉండాలని, ఘటనపై వెంటనే స్పందించేలా అధికార యంత్రాంగాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకులపై ఉందని వెంకయ్య చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ మాట్లాడుతూ.. దిశ హత్యోదంతం దేశం మొత్తాన్ని కలచివేసిందని, కఠినమైన చట్టాలు చేయడమొక్కటే పరిష్కారం కాదని, సమస్యను సమాజంలోని మూలాల నుంచి తొలగించడానికి అందరూ ముందుకురావాలని అన్నారు. టీడీపీ, ఆర్​జేడీ, బీజేడీ, ఆప్, టీఎంసీ, సీపీఎం ఎంపీలు కూడా రేపిస్టులకు మరణశిక్షలే సరైనవని అభిప్రాయపడ్డాయి.

డిసెంబర్​ 31లోగా ఉరి తీయండి: విజిల

రాజ్యసభలో దిశ ఉదంతంపై మాట్లాడుతూ ఏఐడీఎంకే ఎంపీ విజిల సత్యనాథ్​ కన్నీరుపెట్టుకున్నారు. ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు ద్వారా విచారణ పూర్తిచేసి, డిసెంబర్​ 31లోగా దోషుల్ని ఉరితీయాలని ఆమె డిమాండ్​ చేశారు. రేప్​ కేసుల్లో విచారణ ఆలస్యమయ్యేకొద్దీ బాధితులకు న్యాయం దూరమైపోతుందని విజిల అభిప్రాయపడ్డారు.

లోక్​సభలో..

సోమవారం లోక్​సభ ప్రారంభమైన వెంటనే  దిశ హత్యోదంతంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. దిశ హత్య ఘటనతోపాటు పెరుగుతున్న నేరాలపై బీజేపీ ఎంపీ ప్రభాత్‌‌ ఝా నోటీసులు ఇచ్చారు. స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలతో రెండింటిపైనా జీరో అవర్​లో చర్చ జరిగింది.  రేప్​ కేసుల్లో నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేయాలని దాదాపు అన్ని పార్టీల ఎంపీలు డిమాండ్​ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చర్చను ప్రారంభిస్తూ..  హైసెక్యూరిటీ ఉన్న చోట పోలీసులు దారుణాన్ని అడ్డుకోలేకపోయారని, బాధితురాలిని ఉద్దేశించి తెలంగాణ హోం మంత్రి చేసిన కామెంట్లు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్​లో జరిగిన దిశ ఘటన.. దేశవ్యాప్తంగా కలకలం రేపిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్​ కుమార్​ అన్నారు. ఏపీ టీడీపీ ఎంపీ రామ్మోహన్​ నాయుడు, వైఎస్సార్​సీపీ ఎంపీ వంగా గీత, టీఆర్​ఎస్ ఎంపీ కవిత, తదితరులు దిశ అంశంపై మాట్లాడారు. దిశ ఘటన అత్యంత బాధాకరమన్న డీఎంకే ఎంపీ టీఆర్​ బాలు.. మహిళలపై దాడులను కేవలం లా అండ్ ఆర్డర్​ సమస్యగానే చూడొద్దని ప్రభుత్వాన్ని కోరారు. మద్యం, డ్రగ్స్​ను పూర్తిగా నిషేధించడం ద్వారా నేరాల్ని అదుపుచేయొచ్చన్నారు. హైదరాబాద్​ ఘటనపై ప్రతిఒక్కరూ సిగ్గుపడాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు.

కఠిన చట్టానికి కేంద్రం రెడీ: రాజ్​నాథ్​

దిశ హత్యోదంతంపై కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ సోమవారం లోక్​సభలో అధికారిక ప్రకటన చేశారు. దిశ హత్యను కేంద్రం అమానుషచర్యగా గుర్తిస్తున్నదని చెప్పారు. దేశం మొత్తం ఈ దురాగతాన్ని ఖండిస్తున్నదని, వ్యక్తిగతంగా తనను కూడా కలిచివేసిందని తెలిపారు. దిశ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ‘‘నిర్భయ తర్వాత ఆ తరహాలో ఆడకూతుర్ని పొట్టనపెట్టుకున్న ఉదంతమిది. మహిళలపై అఘాయిత్యాలకు తెరపడేలా అవసరమైన చర్యలను మోడీ సర్కార్ తీసుకుంటున్నది. అన్ని పార్టీలు అంగీకరిస్తే రేపిస్టులను వెంటనే శిక్షించేలా కఠిన చట్టాలను తేవడానికి కేంద్రం రెడీగా ఉంది. ఈ పని తొందరగా చేయకుంటే మరికొందరు కీచకులు రెచ్చిపోయే అవకాశముంది”అని రాజ్​నాథ్​ చెప్పారు

Latest Updates