ప్రార్ధ‌నా మందిరాల‌ను కూలగొట్టిన సీఎంను చర్లపల్లి జైల్లో పెట్టాలి

తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మజీద్ ను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామ‌ని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని ప్రార్ధ‌నా మందిరాల‌ను కూలగొట్టిన సీఎం, సీఎస్, డీజీపీ లకు బేడీలు వేసి చర్లపల్లి జైల్లో పెట్టాలన్నారు.

రాత్రికి రాత్రే స‌చివాల‌యాన్ని పడగొట్టాలని సీఎం అధికారుల‌ను ఆదేశించార‌న్న రేవంత్… ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ సమీపంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయవద్దని సుప్రీమ్ కోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సీఎస్ పెడచెవిన పెట్టార‌న్నారు. పర్యావరణ అనుమతులు వచ్చినాకనే సచివాలయాన్ని కూలగొట్టాల‌ని అన్నారు. జవహర్ నగర్ లో ఎలాంటి చెత్త వేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని, సచివాలయ శకలాలు ఎక్కడ వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సచివాయాన్ని కూల్చడంపై ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశ ప‌డుతున్నార‌న్నారు. హిందు మతానికి.. సీఎంకు అనుకూలంగా స్టేట్ మెంట్ ఇచ్చిన ఇద్దరు ముగ్గురు ఉద్యోగ సంఘాల నేతలతో పాటు సెక్ర‌టేరియేట్‌కు చెందిన నరేంద్రరావు అనే ఉద్యోగ సంఘాల సన్నాసి యజమాని కాదని అన్నారు. మత విశ్వాసం ఉద్యోగ సంఘాలకు మాత్రమే సొంతం కాదని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను చెప్పుతో కొట్టాల‌ని అన్నారు.

మ‌సీదు, నల్ల పోచమ్మ గుడి కూల్చితే బీజేపీ, మజ్లిస్ పార్టీ ల నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు రేవంత్. మజ్లిస్, బీజేపీ, టీఆర్ఎస్ లు అన్ని ఒకే తాను ముక్కలన్నారు. దేవాలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించి దీనిపై బీజేపీ విధానాన్ని ప్ర‌క‌టించాల‌న్నారు.

“16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సెక్రటేరియట్‌లో ఆ ముఖ్య‌మంత్రుల కొడుకులు సీఎం లు కాలేద‌ని కేసీఆర్ కు పండితులు చెప్పార‌ట‌. ఆ మూడ నమ్మకాలతోనే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చి వేస్తున్నాడు. న‌మ్మకాలుంటే ఉండొచ్చు….అదే పిచ్చిగా మారొద్దు. నమ్మకాలు ఉంటే ఇంటి వరకే పరిమితం చేసుకోవాలి”అని రేవంత్ అన్నారు.

Latest Updates