ఉత్తమ్‌కు షోకాజ్‌ నోటీస్ ఇవ్వాలి

  • హైకమాండ్ చెప్పకుండా పద్మావతి పేరెలా ప్రకటిస్తారు?
  • కుంతియాకు రేవంత్​ ఫిర్యాదు
  • యురేనియంపై సంపత్‌కు ఏబీసీడీలు కూడా తెల్వవు
  • 14 రోజులు అసెంబ్లీ నిర్వహించకపోతే బడ్జెట్​ చెల్లదు
  • లాబీల్లో మీడియాతో చిట్‌చాట్

హైదరాబాద్‌, వెలుగు: హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని హైకమాండ్​ ఇంకా నిర్ణయించలేదని, అలాంటపుడు పీసీసీ చీఫ్​ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన భార్య పద్మావతిని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇది హైకమాండ్​ను ధిక్కరించినట్లేనని, ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ ఆర్‌సీ కుంతియాకు ఫిర్యాదు చేశారు. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో బస చేసిన కుంతియాను రేవంత్‌ కలిసినట్టు తెలిసింది. కుంతియాతో భేటీ అనంతరం రేవంత్‌ అసెంబ్లీకి వచ్చారు. ఇన్నర్‌ లాబీల్లో కొందరు ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా తాను చామల కిరణ్‌ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నానని రేవంత్ చెప్పారు. అతను లోకల్‌ అభ్యర్థి అని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు చెందిన ఊరే అతనిదని పరోక్షంగా ఉత్తమ్‌ను ఉద్దేశించి అన్నారు.

విద్యుత్​పై సర్కారువన్నీ అబద్ధాలే..

అసెంబ్లీకి ఎందుకు వచ్చారని రేవంత్​ను జర్నలిస్టులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో బర్నింగ్‌ టాపిక్‌గా ఉన్న విద్యుత్‌ అంశంపై సభలో చర్చ సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు లేరో తెలుసుకునేందుకు వచ్చానన్నారు. వారు లేకపోవడం సరికాదన్నారు. విద్యుత్‌పై ప్రభుత్వం ఏకపాత్రాభినయం చేస్తుంటే కాంగ్రెస్‌ సభ్యులు సభలో లేకపోతే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లవుతుందని ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలపై జనసేన ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్‌ నేతలు వెళ్లి ఆ పార్టీకి ఎందుకు క్రెడిట్‌ ఇచ్చారని కోర్‌ కమిటీలో సంపత్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించగా పవన్‌ కల్యాణ్‌తో సెల్ఫీ దిగేందుకు అవకాశం రాలేదనే కోపాన్ని తనపై చూపిస్తే ఏం లాభమన్నారు. యురేనియం విషయంలో సంపత్‌కు ఏబీసీడీలు కూడా తెలియవన్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, యురేనియం కమిటీ చైర్మన్‌ వీహెచ్‌ మీటింగ్‌కు వెళ్తే వాళ్ల వెంట తానూ వెళ్లానన్నారు.

14 రోజులైనా అసెంబ్లీ జరగాలి

అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు కనీసం 14 రోజులైనా జరగాలని, రూల్‌బుక్‌లో ఈ విషయం స్పష్టంగా ఉందని రేవంత్​ చెప్పారు. అంతకన్నా తక్కువ రోజులు జరిగితే బడ్జెట్‌ చెల్లదన్నారు. పది రోజుల బడ్జెట్‌కు లీగల్‌ సాంక్టిటీ ఉందని, ఎవరైనా కోర్టులో పిటిషన్‌ వేస్తే కొట్టేయడం ఖాయమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు చెబుతున్నారని, మరి ఆ అవినీతిపై విచారణ జరపకుంటే వారి భాగస్వామ్యం కూడా ఉందని భావించాల్సి వస్తుందని రేవంత్‌ అన్నారు. విద్యుత్‌ ఒప్పందాలపై తన వద్ద ఉన్న ఆధారాలను త్వరలోనే బీజేపీ రాష్ట్ర చీఫ్​ లక్ష్మణ్‌కు ఇస్తానన్నారు.

Revathi Reddy complains to Kuntiya that issue Show cause notice to Uttam Kumar reddy

Latest Updates