జలపాతాలే.. కాకపోతే కింద నుంచి పైకి..

ఏదైనా వస్తువు చేతిలోంచి జారిపోతే కిందకు పడుతుంది. నీళ్లు కూడా అంతే.. చేయి జారితే కింద పడిపోయి.. పల్లం వైపు ప్రవహిస్తాయి. కానీ.. కింద నుంచి పైకి ప్రవహించే నీళ్ల గురించి తెలుసా? ‘ఏంటి.. అలా కూడా ఉందా’ అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో జలపాతాలు కింద నుంచి పైకి ప్రవహిస్తున్నాయి. వాటి గురించే ఈ స్టోరీ..

ఈ భూమ్మీద ఎన్నో రహస్యాలున్నాయి. అవి చేధించడానికి మహామహులు ప్రయత్నాలు చేసినా.. ఫలితం తేలలేదు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. నీళ్లు ఎప్పుడు ఎత్తు నుంచి పల్లానికే పరుగులు తీస్తాయి. కానీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. కొండలు ఎగబాకుతున్నాయి. కిందనుంచి పైకి పారుతూ.. రివర్స్​ వాటర్​ఫాల్స్​ అయి ప్రపంచ టూరిస్టుల్ని ఆకర్షిస్తూ.. ఆ రహస్యమేంటో తెలియనివ్వకుండా పరేషాన్​ చేస్తున్నాయి.

మెయిన్​పత్​

చత్తీస్​ఘడ్​లోని సురుగాజా జిల్లాలో ఓ జలపాతం ఉంది. జలపాతం అంటే.. అన్నీ జలపాతాల్లాగ కాదు. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకో తెలుసా.. ఇక్కడ నీళ్లు పైనుంచి కిందకు కాదు.. కింది నుంచి పైకి ప్రవహిస్తాయి. కొండ అంచులో నిలబడి చూస్తే.. ఓ జలపాతం ఉవ్వెత్తున పైకి ప్రవహిస్తూ కనిపిస్తుంది. చుట్టూ పచ్చటి తివాచీ పరిచినట్టు ఉండే ప్రకృతి, చల్లటి గాలి, మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం ఒక్కసారి ఇక్కడికి వెళ్తే పదే పదే వెళ్లాలనిపిస్తుంది. ఈ జలపాతాన్ని ‘జల్​జలి’ అని కూడా అంటారు.

నానేఘాట్​

మహారాష్ట్రలో నానేఘాట్ అనే జలపాతం ఉంది. మహారాష్ట్ర సమీపంలోని జున్నార్​ ప్రాంతంలో ఉందిది. ముంబై నుంచి వెళ్తే కేవలం మూడు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న పర్వతం మీద నుంచి రివర్స్​ డైరెక్షన్​లో నీళ్లు ప్రవహిస్తాయి. ఎంతో ఎత్తులో ఉండే ఆ పర్వతం మీదకు కింద నుంచి పైకి నీళ్లు ప్రవహిస్తుంటాయి. కొన్ని వందల ఏళ్లుగా ఇది ఇలాగే కొనసాగుతోంది. ముంబై నుంచి 120 కి.మీ దూరం ఉంటుంది. పూణె నుంచి 150 కి.మీ ఉంటుంది. ట్రెక్కింగ్​కి వచ్చేవాళ్లు అహ్మద్​నగర్​ హైవే మీదుగా వచ్చి ట్రెక్కింగ్​ మొదలుపెడతారు. కల్యాణ్​ బస్టాండ్​ నుంచి జున్నార్​ చేరుకోవాలి. అక్కడి నుంచి మల్షేజ్​ ఘాట్​ రోడ్​ నుంచి వైశాఖరే గ్రామం మీదుగా ఈజీగా నానేఘాట్​ చేరుకోవచ్చు. ఆ ట్రెక్కింగ్, రివర్స్​ వాటర్​ఫాల్స్​, పచ్చదనం మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి.

సంధాన్​ వ్యాలీ

మహారాష్ట్రలో ఉన్న మరో రివర్స్‌ జలపాతం ఇది. సిన్హాఘడ్​, లోహఘడ్​, అంబోలి హిల్స్​లో కూడా రివర్స్​ జలపాతాలు కనిపిస్తాయి. ఈ జలపాతాలన్నీ పూణెకు కూడా చాలా దగ్గరగా ఉంటాయి.  కేవలం జూన్​, జూలై నెలల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ట్రెక్కింగ్​ చేసేవారికి ఈ జలపాతాలు మంచి అడ్వెంచరస్​ ప్లేసెస్​ అనే చెప్పాలి. సంధాన్​ లోయలో కింద నుంచి పైకి ప్రవహించే వాటర్​ఫాల్స్​ చూడడానికి భలే ఉంటాయి. మాన్​సూన్​లో ఇక్కడ నీరు రివర్స్​గా పైకి వెళ్తుంది. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్​ మొదటివారం వరకు ఇక్కడ లొకేషన్లు చూడడానికి రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి.

ఇదే ఆ రహస్యం!

గాలి అపసవ్య దిశలో కింద నుంచి పైకి బలంగా వీస్తుంది.  ఆ బలమైన గాలులకు చిన్నగా పారే జలపాతాలు గాలితో పాటుగా.. పైకి ప్రవహిస్తాయి. అలా.. పైనుంచి కిందకు పారాల్సిన జలపాతాలు బలమైన గాలి ప్రభావానికి లోనై పైకి ప్రవహిస్తూ  అందరినీ ఆకర్షిస్తున్నాయి. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా జరగడం వల్ల ఇది వింతగా అనిపిస్తుంది. పైకి ప్రవహించే నీళ్లు తుంపర్ల రూపంలో ఉంటాయి. అందుకే ఇవి గాలిలో తేలుతాయి.  అందుకే ఇక్కడికి అధిరోహకులు, మౌంటెనీర్లు, టూరిస్టులు మాన్​సూన్​ సీజన్​లో బారులు తీరతారు. కింద నుంచి పైకి ప్రవహించే జలపాతం ప్రత్యేక ఆకర్షణే కదా!

Latest Updates